Jul 01,2023 00:17

అవగాహన కల్పిస్తున్న రాధిక

ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రధానమంత్రి శుద్ధి పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటును అందిపుచ్చుకోవాలని ఉద్యాన అధికారి జి రాధిక సూచించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో శుక్రవారం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంపై ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటుపై అవగాహన కల్పించారు. ప్రాసెసింగ్‌ చేయు ఉత్పత్తులను వివరించారు. బియ్యపు పిండి, రైస్‌ బ్రాస్‌ ఆయిల్‌, స్నాక్స్‌, నూడిల్స్‌, అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు, వివిధ రకాల పొడులు, బెల్లం ఉత్పత్తులు తదితర రకాల ఆహార శుద్ది పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించారు. పరిశ్రమల ఏర్పాటుకు లబ్దిదారులు కేవలం 10శాతం పెట్టుబడితో ముందుకొస్తే, పరిశ్రమ నిర్మాణ వ్యయంలో మిగతా 90 శాతం బ్యాంకు రుణ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఆంద్రప్రదేశ్‌ ఆహార శుద్ధి పరిశ్రమల సంస్థ, ఉద్యాన శాఖ ద్వారా 35 శాతం రాయితీని పరిశ్రమలు స్థాపించిన లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు రుణానికి జమ చేస్తారని తెలిపారు.ఆర్థిక తోడ్పాటు,సాంకేతిక శిక్షణ ,మార్కెట్‌ సపోర్టు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను లబ్ధిదారులకు తెలియపరచి, పథకం సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఉమా ప్రసాద్‌, ఏపీఎం ఉష, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అధికారి అప్పారావు, వెలుగు కోఆర్డినేటర్లు, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల మండలాల ఆర్‌బికెల సిబ్బంది పాల్గొన్నారు.