ప్రజాశక్తి - గుంటూరు : పరిశ్రమల ప్రోత్సాహక రాయితీ క్లైయిమ్‌లను మొదటి వచ్చినవి మొదట పరిష్కరించాలని పరిశ్రమలు, అనుబంధ శాఖల అధికారులను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. కలక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఇండిస్టియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సహిక పారిశ్రామిక వేత్తలు సింగల్ డెస్క్ ద్వారా అందించిన దరఖాస్తులను నిర్దేశిత సమాయానికి పరిష్కరించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించటానికి ప్రభుత్వం అందించే రాయితీ కోసం అందిన దరఖాస్తులను డీఐఈపీసీ కమిటీలో సభ్యులందరూ పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్పారు. రాయితీ క్లైయిమ్‌లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు నిబంధనల ప్రకారం పరిష్కరించి అర్హతున్న పారిశ్రామిక వేత్తలకు లబ్ధి అందించేలా చూడాలన్నారు. యువత, మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించేందుకు జిల్లాలో డిమాండ్ ఉన్న వస్తువుల తయారీపై, ప్రభుత్వం అందించే రాయితీపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటానికి ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహకాలకు సంబంధించి 23 క్లైయిమ్స్‌కు రూ.1,92,66.039 మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆమోదించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ విజయరత్నం, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి, ఏపీఐఐసీ డీప్యూటీ జోనల్ మేనేజర్ దీవెన్, అగ్నిమాపక శాఖాధికారి సత్యనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఎ.రఘునాథ బాబు, ఏ.పి.ఎస్.ఎఫ్.టీ బ్రాంచ్ మేనేజర్ కె.అజిత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ ఎం.నారాయణ, భూగర్భ జల డీడీ వందనం, ఎస్సీ, ఎస్టీ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ రీజనల్ హెడ్ పరిమళ, దళిత్ ఇండిస్టి అసోసియేషన్ ప్రతినిధి బ్రహ్మయ్య పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి