Apr 28,2023 21:46

ప్రజాశక్తి - దెందులూరు
        ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావించి పరిసరాల పరిశుభ్రత పాటించినట్లయితే దోమల వ్యాప్తిని తగ్గించుకోవచ్చని, తద్వారా డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు మన దరి చేరవని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ డి.ఆశ సూచించారు. మండలంలోని గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న వీరభద్రపురంలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ప్రజలు చెత్తాచెదారాల్ని డ్రెయిన్‌లో వేయరాదని, తమ ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలైన నీళ్ల తొట్టెలు, డ్రమ్ములు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, రుబ్బురోలు, గ్రైండర్లు, ఎయిర్‌ కూలర్స్‌ శుభ్రం చేసుకోవాలని మూతలు పెట్టుకోవాలని చెప్పారు. దోమల గృహాల్లోకి ప్రవేశించకుండా సాయంత్ర సమయంలో కిటికీలు వేయాలని దోమతెరలు వాడాలని, దోమలు రాకుండా వేపాకుతో పొగ పెట్టాలని, నీటి నిల్వ ప్రాంతంలో పనికిరాని ఇంజన్‌ ఆయిల్‌ పోయాలని, ఎబెట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని సూచించారు. జిల్లా మలేరియా నివారణ అధికారి పిఎస్‌ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఉంచాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. మలేరియా కిట్లు వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లోను, గోపన్నపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిద్ధంగా ఉన్నాయన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు దోమల పట్ల, పరిసరాల పరిశుభ్రత పట్ల, దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కె.రోజా లలిత, అసిస్టెంట్‌ మలేరియా నివారణ అధికారి జె.గోవిందరావు, ఆరోగ్య విస్తరణ అధికారి నాగరాజు, అనురాధ, భార్గవి, హెల్త్‌ అసిస్టెంట్స్‌ రమేష్‌, శ్రీనివాస్‌, ఆదినారాయణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.