Apr 26,2023 01:12
ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయమ్మ

పజాశక్తి-బాపట్ల: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం.. దోమల బారిన పడకుండా ప్రజలను కాపాడదామని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బాపట్లలో ర్యాలీ నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభిం చారు. మలేరియా నివారణ, దోమల నిర్మూలన, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై నినాదాలు చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్‌ సెంటర్‌ వరకు సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి మలేరియా నివారణ చర్యలపై నినాదాలు చేశారు. కార్యక్ర మంలో టి వెంకటేశ్వర్లు, వ్యాధి నిరోధక టీకాల అధికారి రాజకుమార్‌, జిల్లా మలేరియా అధికారి ఇస్మాయిల్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రాం బాబు, శరత్‌, సూపర్‌వైజర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్త లు, సుశీల స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థినులు పాల్గొన్నారు.
అద్దంకి: పట్టణంలోని గోరగకాయపాలెం యుపిహెచ్‌సి ఆరోగ్య కేందం నుంచి రాష్ట్ర వైద్యా శాఖ తరపున ఆశా వర్కర్స్‌, ఏఎన్‌ఎంలు వైద్యాధికారులు, రోటరీ క్లబ్‌ అఫ్‌ సింగరకొండ అద్దంకి సభ్యులతో ప్రపంచ మలేరియా వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహనా ర్యాలీ మంగళవారం జరిగింది. గోరగాయపాలెం యూపీహెచ్‌సి నుంచి ప్రారంభించి బంగ్లా రోడ్డు లోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర మానవహారం నిర్వహించి, ప్రజలకు మలేరియా వ్యాధి నిర్ములనపై అవగాహన కల్పించారు. డాక్టర్‌ జయచంద్ర రావు మాట్లాడుతూ గృహ పరిసరాలలో మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని చెప్పారు. రోటరీ ప్రెసిడెంట్‌ సందిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు దోమలు కుట్టకుండా జాగ్రత్తపడి, మలేరియా రాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. రోటరీ ప్రెసిడెంట్‌ సందిరెడ్డి శ్రీనివాసరావు, కోశాధికారి తమ్మన శ్రీనివాసరావు, సభ్యులు షేక్‌ మొహమ్మద్‌ రఫీ, డాక్టర్‌ ఉబ్బా దేవపాలన, చప్పిడి వీరయ్య, మలాది శ్రీనివాసరావు, డాక్టర్‌ వలి తదితరులు పాల్గొన్నారు.
భట్టిప్రోలు: ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వెల్లటూరు, భట్టిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాలీలు నిర్వహించారు. వైద్యులు సిహెచ్‌ రామలక్ష్మి, డిఎల్‌ పద్మజ ఆధ్వర్యంలో గ్రామ పురవీధుల్లో ప్లకార్డులతో జరిగిన ర్యాలీ నుద్దేశించి మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రత పాటించాలని, దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఎంపిపి డివి లలితకుమారి మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్యం లోపించకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి హనుమంతరావు, జెడ్పిటిసి టి ఉదరు భాస్కరి, గ్రామ సర్పంచ్‌లు చౌటురి లక్ష్మీ, దారా రవికిరణ్మయి, సిబ్బంది మందా ప్రసాద్‌, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.