పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం...
చీపురు పట్టి మార్కెట్‌ను శుభ్రం చేసిన కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించగలమని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీసేవ, 'పరిశుభ్రత కోసం ఒక గంట శ్రమదానం' కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగర కమిషనర్ అరుణ నగరపాలక సంస్థ బస్టాండ్ వద్దనున్న మార్కెట్ రోడ్లను చీపురు పట్టి శుభ్రం చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. పరిశుభ్రత అంశాన్ని ప్రతిఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలన్నారు. గహాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఊరు శుభ్రంగా ఉంటుందని, తద్వారా ప్రజలు ఆరోగ్యకర జీవనం సాగించేందుకు వీలవుతుందన్నారు. పరిసరాల శుభ్రత కోసం ప్రతిఒక్కరూ రోజు కొంత సమయం కేటాయించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య కార్మికులు నిత్యం శ్రమిస్తుంటారని అభినందించారు. ఈకార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షన్ని షర్మిల, ఎంహెచ్‌ఓ డాక్టర్ లోకేష్, సానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆదివారం నగరపాలక సంస్థ పరిధిలోని 50 వార్డుల్లోనూ స్థానిక కార్పొరేటర్లను భాగస్వామ్యంతో వార్డు పర్యావరణ పారిశుద్ధ్య కార్యదర్శులు పరిశుభ్రత కోసం ఒక గంట శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో శుభ్రం చేయడంతో పాటు, గతంలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రంగా మార్చడంతో పాటు మొక్కలు నాటారు. పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, మానవహారం నిర్వహించారు.
స్వచ్ఛభారత్ సేవా కార్యక్రమాల్లో సంసిధ్ క్యాంఫర్డ్ విద్యార్థులు
స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శరవణపురం తపోవనంలోని వద్ధాశ్రమంలో సంసిధ్ క్యాంఫర్డ్ పాఠశాల వెస్ట్ విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ పరిసరప్రాంతాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్, మేనేజర్ సుమిత్, ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.










