ప్రజాశక్తి - ఏలూరుటౌన్
ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమల ద్వారా వచ్చే ప్రాణాంతక వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వాటిని నివారించొచ్చని ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎం.నాగేశ్వరరావు సూచించారు. స్థానిక ఏలూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టైటాస్ నగర్‌లో నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ జ్వరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, జ్వరంమొస్తే అశ్రద్ధ చేయకుండా దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని, అక్కడ అన్ని పరీక్షలూ ఉచితంగా చేస్తామని సూచించారు. దోమల నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. నీటి నిల్వ ప్రాంతాలైన నీటి తొట్టెలు, డ్రమ్ములు వారానికి ఒకసారి శుభ్రం చేయాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ దత్తచరణ్, అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, రమేష్ ఎఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










