ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పరిసరాల రక్షణ, భవిష్యత్తు తరాలకు పరిరక్షణ అని శ్రీమహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహబూబ్ బాషా, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శంకరయ్య తెలిపారు. సోమవారం శ్రీమహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎస్‌ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'ప్లాస్టిక్ వాడకం నిర్మూలన' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కాలుష్యాన్ని తగ్గించాలంటే పరిసరాల్లో మొక్కలు నాటాలని తెలిపారు. విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంగా భావించి ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. తమ చిన్నతనంలో గ్రామగ్రామాన చెట్టు, చామలతో ప్రకృతి సస్యశ్యామలంగా ఉండేదని తెలిపారు. తద్వారా జంతు జాతి నివసించేదన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రజలను చైతన్యపరిచి, సమీకరించి మొక్కలు నాటాలని కోరారు. దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పుడమిని కాలుష్య కోరల్లో నుంచి కాపాడాలని తెలిపారు. మార్కెట్‌కు వెళ్లేటప్పుడు కచ్చితంగా కాటన్ సంచులను తీసుకెళ్లేలా అలవాటు చేసుకోవాలన్నారు. కళాశాలలో ఇప్పటికే మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించిన కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులను జెవివి నాయకులు అభినందించారు. అనంతరం కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఎస్‌ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజరు కుమార్, జెవివి సీనియర్ నాయకులు మాదన్న, కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకులు, ఐక్యూ ఎసి సమన్వయకర్త డాక్టర్ ఎం.సుశీలమ్మ, జెవివి సీనియర్ నాయకులు నారాయణ, కళాశాల ఉపన్యాసకులు న్యూటన్ రాజు, ఖాదర్ బాషా, రామాంజనేయులు, క్రమర్, వెంకట నాయుడు, ఈరన్న, మనోరంజన్, జెవివి నాయకులు తాయప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మొక్కలు నాటుతున్న ప్రిన్సిపల్ మహబూబ్ బాష










