* అదనపు డిఎంహెచ్‌ఒ డాక్టర్ అనురాధ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: ప్రాణాంతక వ్యాధులైన మలేరియా, పైలేరియా, డెంగీ వంటి వ్యాధుల బారిన పడకుండా దోమల వ్యాప్తిని అరికట్టాలని అదనపు డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎన్.అనురాధ అన్నారు. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఆదివారం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ముందుగా వద్ద సర్ రోనాల్డ్ రాస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1897 ఆగస్టు 20న అంతర్జాతీయ స్థాయిలో దోమల నివారణ దినోత్సవంగా ప్రకటించారన్నారు. దోమల నుంచి మలేరియా వ్యాపిస్తోందని సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారని గుర్తు చేశారు. జిల్లాలో దోమల వల్ల అనేక వ్యాధులు ప్రబలు తున్నాయని, వ్యాధులు ప్రాణాంతకంగా మారుతోందని అన్నారు. మలేరియా, పైలేరియా, డెంగీ వంటి ఎన్నో వ్యాధులకు దోమలే కారణమన్నారు. రసాయనాలతో కూడిన అనేక రకాల లిక్విడ్‌లు, క్వాయిల్స్ వంటివి మార్కెట్లో లభిస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించడం వల్ల మరికొన్ని వ్యాధులు ప్రబలే ప్రమాదం లేకపోలేదన్నారు. అందువల్ల దోమలు వృద్ధి చెందకుండా ముందుగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. దోమల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అనేక చర్యలు చెపడుతున్నట్ట తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పి.వి. సత్యనారాయణ, ఎఎంఒ ఎస్.శ్రీనివాస్, డిసి శ్రీకాంత్, ఎస్‌యుఒ సూరి అప్పారావు, సామాజిక వేత్త మంత్రి వెంకటస్వామి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.










