Oct 01,2023 22:27

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
             స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని పౌరుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. పట్టణంలో చేపట్టిన స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు పాల్గొని స్వచ్ఛతా కార్యక్రమాలను విద్యార్థులతో కలిసి స్వయంగా నిర్వహించారు. తొలుత 11వ వార్డు బిఎన్‌.రోడ్డు డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం సెంటర్‌ వద్ద స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 33వ వార్డు అభిరుచి హోటల్‌ ఎదుట గొల్లవానితిప్ప కెనాల్‌ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి స్వచ్ఛత శ్రమదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్‌ ఎం.శ్యామల, తహశీల్దార్‌ వై.రవికు మార్‌, ఎంపిడిఒ కె.వెంకటలక్ష్మి, మున్సిపల్‌ ఇంజినీరు పి.త్రినాథరావు, వార్డు నాయకులు, వార్డు సచివాలయ సిబ్బంది, పురపాలక సంఘం సిబ్బంది, వార్డు వాలంటీర్లు, పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రత అందరి బాధ్యతని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ఆదివారం రెండో పట్టణంలోని ఎఎస్‌ఆర్‌ నగర్‌లో ఉన్న పార్కులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ కొడవలితో పార్కులో మొలిచిన గడ్డిని కోసి మున్సిపాలిటీ డస్ట్‌బిన్‌లలో వేశారు. అనంతరం చీపురుతో పార్కును శుభ్రపరిచారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్‌డిఒ దాసిరాజు, వైసిపి సీనియర్‌ నాయకులు గోకరాజు రామం, ఎంపిపి విజయనరసింహరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్యామల, తహశీల్దార్‌ వై.రవికుమార్‌ పాల్గొన్నారు.
కాళ్ల :పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటిస్తే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని కలవపూడి సర్పంచి జాన్‌ అన్నారు. మండలంలోని కలవపూడిలో స్వచ్ఛతా హి సేవ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి జాన్‌ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకారం అందించాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి, ఉప సర్పంచి భట్రాజు వాసు, కార్యదర్శి ఎం.అనూష, విఆర్‌ఒ కెనడి, హైస్కూల్‌ ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు సనగన సత్యనారాయణ పాల్గొన్నారు.
పెనుమంట్ర : నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపిడిఒ పి.పద్మజ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో, పాఠశాల, పంచాయతీల పరిధిలోని ప్రధాన కూడళ్లలో, ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో ఆదివారం అధికారులు స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు.
పాలకొల్లు రూరల్‌ :మండలంలోని లంకలకోడేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎస్‌పి రవిప్రకాష్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత ఆరోగ్యానికి కారణమన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి మనోహరా చారి, రూరల్‌ సిఐ కుడిపూడి సతీష్‌, రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాస్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెబిజె.ప్రసాద్‌రావు, లంకలకోడేరు పంచాయతీ కార్యదర్శి డి.శ్రీనివాస్‌, మహిళా పోలీసులు, పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వీరవాసరం : స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ శాఖాధికారులు శ్రమదానం చేశారు. ఈ శ్రమదానంలో భాగంగా పారిశుధ్య పనులు, చెత్తను ఎత్తడం వంటి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు. వీరవాసరం సర్పంచి చికిలే మంగతాయారు ఆధ్వర్యంలో వీరవాసరం ఎంఆర్‌కె.హైస్కూల్‌, జాతీయ రహదారి వెంబడి అపారిశధ్య పరిసరాలను శుభ్రం చేయడం, వీధులు ఊడ్చడం వంటి పనులు చేశారు. తహాశీల్దార్‌ ఎం.సుందరరాజు ఆధ్వర్యంలో తహాశీల్దార్‌ కార్యలయం పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సత్యనారాయణరాజు, సర్వేయర్లు శైలజ, కాటం శ్రీనివాసరావు, పిహెచ్‌సి సిబ్బంది పాల్గొన్నారు.
గణపవరం :స్వచ్ఛభారత్‌ అభియాన్‌ పిలుపులో భాగంగా ఆదివారం మండలంలో ఉన్న 25 పంచాయతీల్లో శ్రమదానాలు జరిగినట్లు ఇఒపిఆర్‌డి టివి.సత్యనారాయణ చెప్పారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీల్లో చెత్త చెదారాలను తొలగించారు. మంచినీటి చెరువుల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చెరువులను శుభ్రం చేశారు. రహదారుల పక్కన ఉన్న చెత్త పోగులను తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని గణపవరం సర్పంచి మూరా అలంకారం అన్నారు. ఆదివారం నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో అలంకారం మాట్లాడుతూ గ్రామంలో వీధులన్నీ చెత్త చెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయన్నారు. ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పంచాయతీ సిబ్బందితోపాటు కలిసి వీధులన్నీ శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డిఎస్‌ఆర్‌.ప్రసాద్‌, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పాలకొల్లు : పాలకొల్లు ఛాంబర్స్‌ డిగ్రీ, పీజీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌-3 యూనిట్ల వాలంటీర్లు పాలకొల్లు రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ మాష్టర్‌ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఛాంబర్స్‌ కళాశాల వారు పట్టణంలో సేవ చేయడం అభినందనీయమన్నారు. కళాశాల ఛైర్మన్‌ కెవిఆర్‌.నరసింహరావు మాట్లాడుతూ విద్యార్థులు సేవ చేస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని చెప్పారు. కరస్పాండెంట్‌ కె.రామరాజు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ఇలా సేవా దృక్పథంతో ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్లు కె.రాంబాబు, టి.రాధా మాధవి, వి.సామ్యూల్‌ పాల్గొన్నారు. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కలెక్టర్‌, దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ కోరాడ శ్రీనివాస్‌, ఇఒ యాళ్ల సూర్యనారాయణ, ధర్మకర్తలు, భక్త్తులు పాల్గొన్నారు.
ఆచంట : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుందని ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య అన్నారు. మండలంలోని ఆచంట కొడమంచిలి, పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, వల్లూరు, పెనుమంచిలి, ఆచంట వేమవరం, శేషమ్మ చెరువు, అయోధ్యలంక, ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు ఆయా గ్రామ సర్పంచులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రపరిచారు. ఈ కార్యక్ర మంలో సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు, సుంకర సీతారాం, జక్కంశెట్టి చంటి, నేలపూడి బేబిరామ్మోహన్‌రావు, గణేశుల శేషవాణి సుబ్బారావు, అల్లం పద్మావతి, గుబ్బల మాధవరావు, దిరిశాల విజయలక్ష్మి, జక్కంశెట్టి శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శులు జివివి.సత్యనారాయణ, నరసింహరావు, డి.నాని పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో ముందుగా గుర్తించి ఎంపిక చేసుకున్న 125 పాయింట్లలో సుమారు 1500 మంది శ్రమదానంలో పాల్గొన్నారు. చెత్తాచెదారాలను శుభ్రం చేసి ఆ 125 పాయింట్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. తాడేపల్లిగూడెం ఆర్‌డిఒ కె.చెన్నయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ అనపర్తి శామ్యూల్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ కర్రి భాస్కరరావు, అధికారులు, వార్డు ఇన్‌ఛార్జులు, వాలంటీర్లు, కన్వీనర్లు, సచివాలయ ఉద్యోగులు శ్రమదానంలో పాల్గొన్నారు.
పెనుగొండ : పెనుగొండ సర్పంచి నక్కా శ్యామలాసోని ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపిడిఒ శ్రీనివాస్‌ దొర పాల్గొన్నారు.