
ఎపి నిట్ డీన్ శాస్త్రి
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
పరిశోధనా ఫలాలు క్షేత్రస్థాయికి చేరినప్పుడే వాటికి సార్థకత లభిస్తుందని ఎపి నిట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ జిఆర్‌కె.శాస్త్రి తెలిపారు. ఇంజినీర్స్ డేను పురస్కరించుకుని నిట్ ఇన్‌ఛార్జి డైరెక్టర్ డాక్టర్ ఎం.ప్రమోద్ పడోలే ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్‌శంకర్ రెడ్డి పర్యవేక్షణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పిహెచ్‌డి విద్యార్థుల పేపర్ ప్రజంటేషన్ కార్యక్రమం శనివారం ముగిసింది. ఎఐ అండ్ రోబోటిక్స్ క్లబ్, ఇన్నోవేషన్ సెల్, ఇఇఇ, ఇసిఇ, సిఎస్‌ఇ విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాస్త్రి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతరానిదేనని తెలిపారు. చరిత్రలో తరతరాలుగా నిలిచిపోయే ఆవిష్కరణల రూపకల్పనకు పాటుపడాలని సూచించారు. జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారి పరిశోధనా వెలుగును ప్రసరింపజేసిన ఘనత భారత శాస్త్రవేత్తలకే దక్కుతుందని, వారి స్ఫూర్తితో కొత్త కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని వివరించారు. ఎఐ అండ్ రోబోటిక్స్ క్లబ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఫణికృష్ణ కర్రి మాట్లాడుతూ యువత తమలోని అపార శక్తియుక్తులను వెలికితీసి ఆధునిక కాలానికి తగిన నైపుణ్యాలను పుణికి పుచ్చుకుంటే ఉన్నత శిఖరాలను సులువుగా చేరుకోవచ్చని తెలిపారు. అనంతరం తమ పేపర్ ప్రజంటేషన్‌తో ఆకట్టుకున్న ముగ్గురు పిహెచ్‌డి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మొత్తం 34 మంది తాము చేస్తున్న పరిశోధనలు, వాటి ప్రాధాన్యతను వివరించారు. న్యాయనిర్ణేతలుగా అసోసియేట్ డీన్ డాక్టర్ పి.శంకర్, విభాగాధిపతులు డాక్టర్ వి.సందీప్, డాక్టర్ జి.కిరణ్‌కుమార్, డాక్టర్ హిమబిందు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు టి.రమేష్, కిరణ్ తీపర్తి, నగేష్ భట్టు, సుదర్శన దీప పాల్గొన్నారు.