ప్రజాశక్తి-రంపచోడవరం
ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమం పాఠశాలలకు నాణ్యత గల నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందించేందుకు వేసిన టెండర్లను పరిశీలించి ఖరారు చేయడం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాన్ రాజ్ పేర్కొన్నారు. గురువారం సాయంకాలం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 11 మండలాలకు సంబంధించిన గిరిజన ఆశ్రమ పాఠశాలలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేయుటకు టెండర్లు వేసిన నేపథ్యంలో ఎటిడబ్ల్యుఓలు, జిసిసి గోదాముల ఇన్‌ఛార్జులు, జిసిసి డివిజనల్ మేనేజర్, జిసిసి సీనియర్ మేనేజర్లతో గిరిజన సంక్షేమ శాఖ డీడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించడం జరిగిందని తెలిపారు. చింతూరు డివిజన్ రంపచోడవరం డివిజన్ల పరిధిలోని ఆశ్రమ పాఠశాలలకు నిత్యావసర సరుకులు సరఫరా చేయుటకు ఐదుగురు టెండర్లు వేసినట్లు చెప్పారు. టెండర్లు ఖరారైన తరువాత ఎప్పటికప్పుడు నాణ్యమైన నిత్యావసర సరుకులు ఆశ్రమ పాఠశాలలకు సకాలంలో చేరవేసే బాధ్యత వారిపై ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటిడబ్ల్యుఓలు కె.సుజాత, హాసిని, జిసిసి డివిజనల్ మేనేజర్లు పార్వతీశ్వరరావు, మధు, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ పరిపాలన అధికారి బి.కిషోర్, సీనియర్ మేనేజర్లు ముళ్ళ నాగ వెంకట రాజారెడ్డి, విజయలక్ష్మి, చంద్రశేఖర్, జిసిసి గోదాముల ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.










