- అరసవల్లి పాలకమండలి తీర్మానం
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : అరసవల్లి ఆలయ పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ పాలకమండలి నిర్ణయించింది. ఆలయంలో ఇఒ వి.హరిసూర్యప్రకాష్ అధ్యక్షతన పాలకమండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఫేక్ లెటర్లు పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విధులకు సరిగ్గా హాజరు కాని వారిని తొలగించాలని ఇఒను ఆదేశించారు. ఆలయంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాన్ని ఏజెన్సీకి అప్పగించాలని తీర్మానించారు. టెండరు ప్రక్రియ ద్వారా ఏజెన్సీని ఖరారు చేయనున్నట్లు చెప్పారు. గర్భాలయంలో స్వామివారి నిత్య అలంకరణకు, పర్వదినాల్లో అవసరమైన పువ్వులు, పువ్వులదండలు సరఫరా, సందర్శకులకు ప్రోటోకాల్ అవసరాలకు స్వామి వారి జ్ఞాపికలు, కండువాలు తదితర వాటిని సరఫరా చేసేందుకు అవసరమైన ఏజెన్సీలకు వచ్చే నెల మొదటి వారంలో బహిరంగ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఆలయంలో నిరుపయోగంగా ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దేవాదాయ ధర్మాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టాలని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో శిథిలావస్థకు చేరుకున్న టిటిడి నిర్మించిన భవనం పూర్తిగా తొలగించడంపై టిటిడికి లేఖ రాయాలని నిర్ణయించారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు మండవల్లి రవి, లుకలాపు గోవిందరావు, కె.సోమేశ్వరరావు, కోటేశ్వర చౌదరి, ద్వారపు అనురాధ, జోగి మల్లెమ్మ తదితరులు పాల్గొన్నారు.










