May 10,2023 22:49

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృతికా శుక్లా

- కలెక్టర్‌ కృతికా శుక్లా
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలుబీ గ్రామ, వార్డు వాలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, డీబీటీ ఆధారిత పథకాలు వంటివి విజయవంతంగా అమలుచేస్తోందని ఇప్పుడు జగనన్నకు చెబుదాం (జెకెసి) పేరుతో మరో కొత్త కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి ప్రారంభించినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్‌ కతికా శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టర్‌ జగనన్నకు చెబుదాం కార్యక్రమం గురించి విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎవరైనా 1902 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యను చెప్పొచ్చన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మరింత చేరువుగా పాలనను తీసుకెళ్లడం, చాలా తేలిగ్గా సేవలు పొందేలా చూడటం, పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడం, జవాబుదారీ తనంతో విధానాల ప్రయోజనాలను ప్రజలందరూ సమానంగా పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం స్పందన కార్యక్రమానికి బూస్టెడ్‌ వెర్షన్‌ అని.. ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, ఆరోగ్యశ్రీ, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు ఇలా వివిధ పథకాలు, సేవలకు సంబంధించి వ్యక్తిగతంగా ఏ సమస్య ఉన్నా హెల్ప్‌ లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి చెప్పొచ్చని తెలిపారు. మారుమూల ప్రజల నుంచి సైతం మిషన్‌ మోడ్‌లో గ్రీవెన్సులను స్వీకరించి.. గడువులోగా (సర్వీస్‌ లెవెల్‌ అగ్రిమెంట్‌) అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కలెక్టర్‌ వివరించారు.
- ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఇంటి దగ్గరి నుంచే 1902కు కాల్‌ చేయడం ద్వారా పథకాలు, సేవల గురించి తెలుసుకోవచ్చని.. అదే విధంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించు కోవచ్చని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. 1902కు ఫోన్‌ చేసి సమస్యను చెప్పగానే ఫిర్యాదును నమోదు చేసుకుని వై.ఎస్‌.ఆర్‌ (యువర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌) ఐడిని కేటాయిస్తారని.. ఎప్పటికప్పుడు ఎస్‌.ఎం.ఎస్‌ ద్వారా అర్జీ స్టేటస్‌ గురించి సమాచారం అందుతుం దన్నారు. జగనన్నకు చెబుదాం ద్వారా అందిన అర్జీల పరిష్కారాన్ని స్వయంగా ముఖ్య మంత్రి కార్యాలయం (సిఎంఒ) పర్యవేక్షిస్తుందని.. అందు వల్ల చాలా నాణ్యతతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. జెకెసి అర్జీల పరిష్కార ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తారని, మండలం, డివిజన్‌, జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశామని, వీటితో ఎప్పటికప్పుడు అర్జీల పరిష్కార ప్రక్రియను మానిటరింగ్‌ చేయనున్నట్టు తెలిపారు.