May 02,2023 00:50
నిరసన వ్యక్తం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-రేపల్లె: భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక ఏబిఆర్‌ కాలేజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పరీక్ష ఫీజు కట్టించుకోవాలని ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ బాపట్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్య, మనోజ్‌ మాట్లాడుతూ అటెండెన్స్‌ సరిపోలేదు అనే కారణంతో విద్యార్థుల వద్ద పరీక్ష ఫీజు కట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ముందుగానే విద్యార్థుల వద్ద కాలేజీ ఫీజు కట్టించుకుని, ఈరోజు పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరి రోజు అయినా కూడా పరీక్ష ఫీజు కట్టించుకోకపోవడం, ప్రిన్సిపల్‌ కాలేజీకి రాకపోవడం ఆయన విధుల పట్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ఫేస్‌ అటెండెన్స్‌ను తీసుకొస్తే కాలేజీలో మాత్రం ఎక్కడా లేనివిధంగా ప్రతి గంటకు మాన్యువల్‌ అటెండెన్స్‌ వేస్తూ మాన్యువల్‌ అటెండెన్స్‌ను పరిగణలోకి తీసుకుని క్లాస్‌ టీచర్‌ ఏది చెప్తే అది ప్రిన్సిపల్‌ వింటూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. దాదాపు 50 మంది విద్యార్థులకు పైగా ఫీజు కట్టించుకోకుండా నిలిపివేశారని, వీరందరి ఫేస్‌ అటెండెన్స్‌ను పరిగణలోకి తీసుకుని అందరి చేత పరీక్ష ఫీజు కట్టించుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు తమ సమస్యను చెప్పుకోవడానికి ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందించిన సందర్భంలో ప్రిన్సిపల్‌ ముందు కృతజ్ఞతగా నవ్వినందుకు వినతిపత్రాన్ని చించి ముఖం మీద విసిరివేయడం విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్‌ అహంకార వైఖరి మార్చుకుని విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం తన విధులను నిర్వహించాలని అన్నారు. అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని విద్యార్థులకు సూచించడం ప్రజాస్వామ్య హక్కులను, విద్యార్థుల ప్రాథమిక హక్కులను అణచివేయడమేనని అన్నారు. ఇప్పటికైనా కళాశాల బృందం, ప్రిన్సిపల్‌ తమ వైఖరిని మార్చుకుని విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలని, వారి సమస్యలను వినాలని పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల వద్ద వెంటనే పరీక్ష ఫీజు కట్టించుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రేపల్లె పట్టణ కార్యదర్శి సూర్యప్రకాష్‌, నాయకులు సతీష్‌ కుమార్‌, వెంకటేష్‌ అమర్‌దీప్‌, విద్యార్థులు పాల్గొన్నారు.