Dec 17,2022 22:56

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌ : మచిలీపట్నం చిలకలపూడి రైల్వేస్టేషన్‌ సమీపంలోని ప్రభుత్వ ఉర్దూ మైనారిటీ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్‌ ఆనంద్‌బాబు రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి సమయంలో ఓ మహిళతో శంగార చేష్టలు చేస్తూ వీడియోకు చిక్కారు. పాఠశాల బోధనా సిబ్బంది విద్యార్థులతో ఈ వీడియో తీయించినట్లు తెలిసింది. అయితే వీడియో చిత్రీకరించారని తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ ఆ విద్యార్థులను చితబాదినట్లు తెలిసింది. ప్రిన్సిపాల్‌ కొట్టడంతో భయపడి బంధువుల ఇంటికి చేరుకున్న ఓ విద్యార్థి వీడియోలు బయట పెట్టటంతో ప్రిన్సిపల్‌ రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. విషయం బయటకు పొక్కడంతో డివైఇఓ యు.వి.సుబ్బారావు శాఖపరమైన విచారణ ప్రారంభించారు. వీడియోలు పరిశీలించి, విచారణ పూర్తిచేసి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. చిలకలపూడి పోలీసులు ప్రిన్సిపాల్‌ను, మహిళను స్టేషనుకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు.