ప్రిన్సిపల్ బాధ్యతారాహిత్యం వల్లే గిరిజన ఆశ్రమ విద్యార్థి మృతి
ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో
బాధిత కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలి
ప్రిన్సిపల్ సస్పెన్షన్, బాధ్యులపై చర్యలకు డిమాండ్
ప్రజాశక్తి -జి.మాడుగుల : గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి జర్త కొండబాబు మృతికి పాఠశాల ప్రిన్సిపల్ బాధ్యతారాహిత్యమే కారణమని నిరసిస్తూ శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సాగిన ధర్మన్నపడాల్, జిల్లానాయకులు జగ్గందొర దీనబంధు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పాంగి జీవన్‌కృష్ణ, కొర్ర కార్తీక్ విడుదల చేసిన ప్రకటనలో ఈనెల 6న స్థాని గిరిజన గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణలో తొమ్మిదో తరగతి విద్యార్థి జర్త కొండబాబు తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. గురుకులంలో ఉన్న విద్యార్థికి గాయాలైన పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించడంతోపాటు అతని మెరుగైన ఆరోగ్యానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా మరుసటి రోజున స్థానిక పిహెచ్‌సిలో హెల్త్ అసిస్టెంట్ వద్ద నామమాత్రం వైద్యం అందించి, తీవ్రజ్వరం ఉన్నప్పటికీ మరో విద్యార్థిని తోడు ఇచ్చి కొండబాబును అతని ఇంటికి పంపేసి చేతులు దులుపుకున్నారని, తర్వాత విద్యార్థి ఆరోగ్యం ఎలా ఉందో కనీసం ఆరా తీయలేదన్నారు. ఈ నేపథ్యంలో గాయాలతో తీవ్రజ్వరం అస్వస్థతకు గురైన కొండబాబును ఈ నెల 14న జి.మాడుగుల పిహెచ్‌సికి అతని తల్లిదండ్రులు తీసుకురాగా, ఆరోగ్యం విషమంగా ఉండడంతో విశాఖ కెజిహెచ్‌కు రిఫర్ చేయగా అక్కడ ఈ నెల 15న మృతి చెందాడన్నారు.
గురుకులంలో విద్యార్థుల గొడవ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజెప్పకపోవడం, దాడి చేసిన విద్యార్థులపై ఇప్పటివరకు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం వంటి బాధ్యతారాహిత్య చర్యల ద్వారా ఘటనను కప్పిపుచ్చాలని చూసి విద్యార్థి మృతికి కారకులైన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతనెలలోనూ పాఠశాలలో తాగునీటి సమస్యపై ప్రశ్నించిన ఇద్దరు విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టిన ఆరోపణలున్న ఉదంతంపై ప్రిన్సిపల్‌పై విచారణ జరపాలని కోరారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.25లక్షల పరిహారం, ఇతర సౌకర్యాలను అందించి న్యాయం చేయాలని కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు అమలు చేస్తున్న అధికార యంత్రాంగం, సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సభ్యులు మల్లేష్ భగీరథ, భాస్కర్, శ్రీను విద్యార్థులు పాల్గొన్నారు.










