
'రండిబాబూ! రండి..! దేవుడు మీ మొర ఆలకించి చిరునవ్వుతో వరాలిచ్చే అద్భుతమార్గం. ఒక్క అగరుబత్తి వెలిగించండి. మీ కోర్కెలు నెరవేరతాయి. ఇల్లంతా పరిమళం-మనసంతా మనోహరం. రండి తీసుకోండి. పాకెట్ పదిరూపాయలే!' అంటూ మొహం అంతా నవ్వు నింపుకుని, మాట్లాడుతున్నాడు జబ్బార్.
స్టాండ్ వేసిన సైకిల్ హేండ్ బారు, బ్రేకు లివర్‌కి గుచ్చి వెలిగించిన అగరుబత్తి సువాసనలు గాలిలో పయనిస్తూ రోడ్డు మీద వెళ్తున్న జనాల్ని ఆకర్షిస్తున్నాయి. పైగా జబ్బార్ చతురోక్తులు జనాల్ని అడుగుముందుకు వేయనివ్వడం లేదు.
శివపురంలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల పదిహేను గ్రామాల నుండి జనం వచ్చి కాయగూరలు, పప్పుదినుసులు కూడా పట్టికెళ్తారు. మెయిన్ బజారులోని రామాలయం ముందు సైకిల్ పెట్టుకుని అగరుబత్తీలు, అత్తరు అమ్ముతాడు జబ్బార్.
వచ్చి అరగంట అయ్యిందో లేదో అప్పుడే పది అగరుబత్తీల ప్యాకెట్లు అమ్మాడు. చేతిసంచులు మడతపెట్టి, చేతిలో పెట్టుకుని వెళ్తున్న నలుగురు స్త్రీలు అతని కంటపడ్డారు. వెంటనే అందుకున్నాడు 'కొఠాలపర్రు అమ్మలు హడావిడిగా వెళ్తున్నారు. దుకాణాలు ఎక్కడికీ పోవమ్మా. జబ్బార్ దగ్గర అగరుబత్తీలు తీసుకొని వెళ్ళండి. రండి!' అంటూ పిలిచాడు.
నలుగురు ఆడవాళ్ళు నవ్వుతూ అతని దగ్గరకు వచ్చారు. ఒక అగరుబత్తీ ప్యాకెట్ మూత తీసి వారి ముందుంచాడు. చాలా మంచి సువాసన వారి ముక్కుల్ని తాకింది. 'ఇవి కొత్తగా వచ్చాయి. మీ అమ్మాయి పెళ్ళిచూపులనాడు ఈ అగరుబత్తీ వెలిగించి చూడు. అబ్బాయి డంగైపోయి, మీ సంబంధం రైటో రైటు అంటాడు. నిజం చెల్లెమ్మా!' అన్నాడు జబ్బార్.
ఆడవాళ్ళు నవ్వుకున్నారు. నలుగురూ నాలుగు ప్యాకెట్లు తీసుకుని, డబ్బులిచ్చేసి ముందుకు నడిచారు.
బుధవారం సంతకు ఏ గ్రామం నుండి ఎవరు వస్తారో జబ్బార్‌కు బాగా తెలుసు. ఇరవై సంవత్సరాల నుండీ ఇదే చోటులో నిలబడి అగరుబత్తీలు, అత్తరు అమ్ముతున్నాడు.
రాత్రి ఏడు గంటలు అవుతుండగా సంత జనం తగ్గిపోయారు. జబ్బార్ మిగిలిన అగరుబత్తీ ప్యాకెట్లు, అత్తరు సీసాలు సైకిల్ హేండిల్ బారుకి వేలాడుతున్న పెద్ద సంచీలో జాగ్రత్తగా సర్దాడు.
సైకిల్ స్టాండు తీసి, నడిపించుకుంటూ సంతలోకి వచ్చి గోవిందు మిఠాయి దుకాణం ముందు ఆగాడు. ఒక మంచం మీద దుప్పటి పరచి, సీమ వెండి పళ్ళాలలో తినుబండారాలు పెట్టి అమ్ముతాడు గోవిందు. మిఠాయి, బెల్లం గవ్వలు, పంచదార కొమ్ములు, తీపి కారప్పూస, కాజాలు, పకోడీలు, కారబ్బూంది అన్నీ ఉంటాయి గోవిందు దుకాణం దగ్గర. శివపురం పక్కనే
ఉన్న వడలి గ్రామం గోవిందుది.
జబ్బార్‌ని చూసి 'ఏం భారు! ఇవాళ వ్యాపారం జోరుగా ఉందా?' నవ్వుతూ అడిగాడు గోవిందు.
'ఫరవాలేదు భారు. ఏదో నడిచిపోతోంది. నాలుగు మిఠాయి ఉండలు, ఒక రూపాయి పకోడీలు ఇవ్వు భారు!' అన్నాడు జబ్బార్.
గోవిందు నాలుగు మిఠాయి ఉండలు ఒక పొట్లం, పకోడీలు ఇంకో పొట్లంలోనూ కట్టి జబ్బార్‌కి ఇచ్చాడు. గోవిందుకి డబ్బులు ఇచ్చేసి మసీదుకి దగ్గరగా ఉన్న ఇంటికొచ్చాడు జబ్బార్.
గుమ్మంలోనే ఎదురైన భార్యకి తినుబండారాల పొట్లాలు ఇచ్చి, సైకిల్‌కి తగిలించిన సంచి తీసి లోపలపెట్టాడు. ఇంటి ముందున్న సిమెంట్ గోలెంలోని నీళ్ళతో కాళ్ళూచేతులూ కడుక్కుని లోపలకు వచ్చాడు. అప్పటికే పిల్లలిద్దరూ మిఠాయి తినడం పూర్తి చేసి పకోడీలు తింటున్నారు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వి, జేబులోంచి డబ్బులు తీసి భార్యకి ఇచ్చాడు జబ్బార్. ఆమె
ఆ డబ్బుల్ని చెక్క బీరువాలోని చిన్న రేకుపెట్టెలో పెట్టింది.
'పిల్లల భోజనాలు అయ్యాయా?' భార్యని అడిగాడు జబ్బార్.
'ఆ! వాళ్ళ భోజనాలు, చదువుకోవడం రెండూ అయ్యాయి. రండి, మీరూ భోంచేద్దురుగాని' అని వంటగదిలోకి వెళ్ళింది రజియా.
భోజనం అయ్యాకా మంచం మీద పడుకుని, విశ్రాంతి తీసుకుంటూ పైకి చూశాడు జబ్బార్. పెంకులు పడకుండా కప్పు కిందగా కట్టిన ప్లాస్టిక్ షీటు ఫ్యాను గాలికి కదులుతోంది. ఈ ఏడాదైనా వెదురు తడిక కొత్తది వేయించాలనుకున్నాడు.
తాతలనాటి పెంకుటిల్లులో జబ్బార్ తండ్రి వాటాకి నాలుగు చిన్న గదులొచ్చాయి. జబ్బార్, తమ్ముడూ పంచుకోగా రెండేసి గదులొచ్చాయి. జబ్బార్ తమ్ముడు పాలకొల్లు వెళ్ళిపోయి, టీకొట్టు పెట్టుకుని అక్కడే ఉంటున్నాడు. ప్రస్తుతం నాలుగు గదుల్లోనూ జబ్బార్ తన కుటుంబంతో ఉంటున్నాడు.
'లంక మేత, గోదావరి ఈత' లా ఉంది తన పరిస్థితి. రామశర్మ మాష్టారి దగ్గర అగరుబత్తీలు, అత్తరు కొనడానికి డబ్బు అప్పుగా తీసుకుని, వ్యాపారం చేస్తున్నాడు. ఎంత కష్టపడ్డా సంపాదనలో మిగులు కనపడడంలేదు.
పూర్వం అత్తరు సాయిబంటే చాలా గుర్తింపు, గౌరవం ఉండేది. పెళ్ళిళ్ళకు ప్రత్యేకంగా పిలిచి బంధువులకి, స్నేహితులకి అత్తరు పూయించేవారు. పెళ్ళి పందిరి అంతా జబ్బార్ అత్తరుతో ఘుమఘుమలాడిపోయేది. పెళ్ళి సంబరాలయ్యాక జబ్బార్‌కు కొత్తబట్టలు పెట్టి భారీగా దక్షిణ యిచ్చేవారు.
కాలంలో మార్పులు వచ్చాయి. చాలామంది పనిపాటల కోసం గల్ఫ్ దేశాలు వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఖరీదైన సెంట్లు తేవడం మొదలుపెట్టారు. జనం ఆ సెంట్లకి బాగా అలవాటు పడిపోయారు. పెళ్ళిళ్ళకు సెంటు బాటిల్స్ కావాల్సివస్తే విదేశాల నుండి కొరియర్‌లో పంపించేవారు. దాంతో పెళ్ళిళ్ళలో జబ్బార్ అవసరం తగ్గిపోయింది, అతని ఆదాయమూ పోయింది.
అయినా అత్తరు మీద ఉండే మోజుతో ఉత్తరప్రదేశ్‌లో కన్హోజ్ నుండి అత్తరు వి.పి.పి. ద్వారా తెప్పించి అమ్ముతున్నాడు జబ్బార్. ఆలోచిస్తూ... ఆలోచిస్తూ... బాగా పొద్దుపోయాకా నిద్రలోకి వెళ్ళాడు జబ్బార్
***
ఒక గురువారం నాడు కవిటం సంతలో అగరుబత్తీలు అమ్మి, చీకటిపడ్డాక శివపురం బయల్దేరాడు జబ్బార్. డిసెంబరు నెల చలిచలిగా ఉంది. జగన్నాథపురం దాటి మార్టేరు దగ్గరగా వచ్చాడు. వెనుక నుండి క్వారీ లారీ, పెద్ద చప్పుడు చేస్తూ స్పీడ్‌గా వెళ్ళిపోయింది. రెండు క్షణాలు గడవగానే 'అమ్మా' అన్నకేక వినబడింది జబ్బార్‌కు.
కంగారుపడి అటూ, ఇటూ చూశాడు. జబ్బార్ కాలువగట్టు వైపు ఉన్నాడు. రోడ్డుకి అవతలవైపు ఒక అమ్మాయి పెద్ద కర్రదుంగ దగ్గర పడి ఉంది. ఆ అమ్మాయి సైకిలు ఒక పక్కగా పడిపోయింది.
జబ్బార్ రోడ్డు దాటి వెళ్ళి సైకిల్ దిగి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి అడిగాడు 'ఏమైందమ్మా?' అని.
'లారీ మీదకు వచ్చేస్తుందేమోనని రోడ్డు కిందగా దిగిపోయాను. ఈ కర్రదుంగలు తగిలి పడిపోయాను!' ఆయాసపడుతూ చెప్పిందా అమ్మాయి.
కలప అడితీ వాళ్ళు రోడ్డు మార్జిన్‌కి దగ్గరగా పెద్ద పెద్ద కర్ర దుంగలు వేశారు. జబ్బార్ ఆ అమ్మాయి కేసి పరీక్షగా చూశాడు. మోకాలు దగ్గర చెక్కుకు పోయి, రక్తం కారుతోంది. కలప అడితీ వాళ్ళు ఆఫీసుకి తాళం వేసి వెళ్ళిపోయారు.
ఆ అమ్మాయిని కంగారుపడొద్దని చెప్పి, ఆమె సైకిల్‌ని కొద్దిదూరంలో ఉన్న కనకదుర్గ గుడి పూజారికి అప్పగించి వచ్చాడు. జబ్బార్ ఆ అమ్మాయి పుస్తకాల సంచీ, తన సైకిల్ క్యారేజీకి కట్టి, ఆమెని లేవదీసి తీసుకొచ్చి, తన సైకిల్ మీద కూర్చోబెట్టుకుని మార్టేరు వైపు బయల్దేరాడు.
'స్కూలు వదిలి చాలాసేపు అయ్యిందిగా. చీకటి పడేవరకూ ఎందుకున్నావమ్మా?' అమ్మాయిని అడిగాడు జబ్బార్.
'ట్యూషన్‌కి వెళ్ళి వస్తున్నాను. మా జగన్నాథపురంలో ట్యూషన్ చెప్పేవాళ్ళు లేరు అంకుల్!' బాధని ఓర్చుకుంటూ చెప్పింది ఆ అమ్మాయి.
జబ్బార్ సైకిల్ గబగబా తొక్కుతూ మార్టేరు పాత వంతెన దగ్గరున్న ఆసుపత్రికి వచ్చాడు. ఆ అమ్మాయిని జాగ్రత్తగా దింపి, డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు.
డాక్టర్ ఆ అమ్మాయిని పరీక్షించి తలకు కూడా దెబ్బ తగిలిందని చెప్పి, గాయాలు శుభ్రం చేసి నాలుగు కుట్లు వేశారు. మోకాలు మీది దెబ్బకు మందు వేసి కట్టుకట్టారు. ఇదంతా పూర్తయ్యేసరికి గంటపైనే పట్టింది. ఇంజెక్షన్లకి, మందులకి తన దగ్గరున్న డబ్బులు రెండువందల యాభై డాక్టరు గారి టేబుల్ మీద పెట్టి నమస్కరించాడు జబ్బార్.
'ఫరవాలేదు. ఒకవారంలో తగ్గిపోతుంది. కంగారుపడకు.' అని వార్డులోకి వెళ్లాడు డాక్టర్ పేషంట్లని చూడటానికి. ఆ అమ్మాయి జబ్బార్ కూతురే అని అనుకున్నాడు డాక్టర్.
ఈలోగా డాక్టర్ గారికి జ్వరం చూపించుకోవడానికి వచ్చిన సుజన, వరండాలో బల్ల మీద తలకి, కాలికి బ్యాండేజీలతో ఉన్న స్నేహితురాలిని చూసి జబ్బార్ నడిగింది.
'వనజకి ఏమయ్యింది అంకుల్?'
'ఈ అమ్మాయి నీకు తెలుసా?'' జబ్బార్ అడిగాడు.
'తెలుసు. నాతోనే పదవతరగతి చదువుతోంది. వీళ్ళది జగన్నాథపురం. వీళ్ళ నాన్న పాండు హోటల్‌లో పనిచేస్తాడు!' అంది సుజన.
'అతని పేరు?'
'నాగరాజు'
వెంటనే జబ్బార్ సైకిల్ మీద ఆచంట రోడ్‌లో ఉన్న పాండు హోటల్‌కి వచ్చి, నాగరాజుని కలిసి విషయమంతా చెప్పి అతన్ని ఆసుపత్రికి తీసుకువచ్చాడు.
కూతుర్ని హాస్పిటల్ బల్ల మీద అలా చూసి గొల్లుమన్నాడు నాగరాజు. జబ్బార్ అతన్ని ఓదార్చి, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. వనజ స్కూల్ బ్యాగ్ అతనికిచ్చి, పాప సైకిల్ కనకదుర్గ గుడిదగ్గర ఉందని చెప్పి, తన సైకిల్ తీసుకుని శివపురం వచ్చాడు జబ్బార్.
అతను ఇంటికి వచ్చేసరికి తొమ్మిది గంటలయ్యింది. రజియా కంగారుపడుతోంది భర్త కోసం.
'ఈరోజు ఇంత ఆలస్యమయ్యిందే?'
భార్య ప్రశ్నకి టూకీగా సమాధానం చెప్పి స్నానం చేసి వచ్చాడు. ఇద్దరి భోజనాలు పూర్తయ్యాయి. మర్నాడు తూర్పుగోదావరి జిల్లాలోని నగరం వెళ్ళాలి బంధువులింట్లో పెళ్ళికి. ఇంట్లో చూస్తే వంద రూపాయలే ఉన్నాయి. ఈ రోజు సంపాదన హాస్పిటల్‌కి ఇచ్చేశాడు.
మర్నాడు ఉదయమే రామశర్మ గారి దగ్గరకు వెళ్ళి, మూడొందలు అప్పు చేసి నగరం పెళ్ళికి వెళ్ళాడు జబ్బార్.
ఎన్ని ఇబ్బందులొచ్చినా పీర్ల పండగ ఘనంగా చేసేవాడు జబ్బార్. అందరికీ స్వీట్లు పంచేవాడు. గ్రామంలో అందరూ బాగుండాలని ప్రార్థించి, నిప్పుల గుండం తొక్కేవాడు.
***
కాలచక్రంలో పదేళ్ళు గిర్రున తిరిగాయి.
జబ్బార్ కూతురికి పెళ్ళి చేశాడు. కొడుకుని దుబారు పంపించాడు రామశర్మ గారి సహకారంతో.
దుబారు నుండి కొడుకు నెలనెలా పంపుతున్న డబ్బుతో రామశర్మ గారి బాకీ మూడేళ్ళలో తీర్చేశాడు జబ్బార్.
కొడుకు దుబారు వెళ్ళి వచ్చి, సంపాదించిన డబ్బుతో రాజమండ్రిలో ఎలక్ట్రికల్ షాపు పెట్టుకున్నాడు. పెళ్ళి కూడా చేసుకున్నాడు.
కాలం తన ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది.
ప్రస్తుతం జబ్బార్ కూతురికి ఇద్దరు పిల్లలు, కొడుక్కి ముగ్గురు పిల్లలు. తండ్రిని తన దగ్గరకు వచ్చి ఉండమని బతిమాలుతున్నాడు కొడుకు.
పుట్టిపెరిగిన ఊరు శివపురం విడిచిరామన్నాడు జబ్బార్.
ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య ఫించను, రేషన్ బియ్యంతో పొదుపుగా జీవిస్తున్నారు జబ్బార్, రజియా.
కొడుకు ప్రతినెలా వచ్చి పప్పులు, కిరాణా సరుకులు ఇచ్చి వెళ్తున్నాడు.
అయినా వారంలో నాలుగురోజులు సైకిల్ మీద తిరుగుతూ అగరుబత్తీలు అమ్ముతూనే ఉన్నాడు జబ్బార్.
ఒకరోజు రామశర్మ గారు కూడా అన్నారు. 'జబ్బార్, పొరుగూళ్ళు వెళ్ళకు, నేను మొన్న గమనించాను. సైకిల్ చాలా నెమ్మదిగా తొక్కుతున్నావు. హాయిగా రాజమండ్రి వెళ్ళి, కొడుకు దగ్గర ఉండవచ్చుగా?'
శర్మగారి మాటలకి చిరునవ్వు నవ్వాడు జబ్బార్.
'మీరు చెప్పింది నిజమే శర్మగారు. నా కొడుకు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. షాపులో ఫ్యాను వేసి గల్లా పెట్టి దగ్గర కూర్చోపెడతాడు. అందరికీ మా నాన్నగారు అని గర్వంగా చెబుతాడు. కానీ నాకు ఆనందం కలగదు. నేను కొఠాలపర్రు వెళ్తుంటే పొలాల్లో పనిచేసే నా ఆడపడుచులు 'ఏం, సాయిబన్నా! బాగుండావా?' అని నోరారా పిలిస్తే నా గుండెల్లో షెహనారు మోగుతుంది. నా కళ్ళు సంతోషంతో మెరుస్తాయి. నగరంలో నా అక్కా, చెల్లీ, నన్ను ఎలా ఆదరంగా చూస్తారో, ఆ ఆదరణ, ఆ ఆప్యాయత నాకు కనిపిస్తుంది వారి మాటల్లో. సైకిల్ దిగి వారితో మాట్లాడే ఐదు నిమిషాలు నాకు ఎంతో బలాన్నిస్తాయి. చైతన్యం కలిగిస్తాయి. అలాగే కవిటం, మార్టేరు, వడలి ఏ ఊరు వెళ్ళినా వారి ఆత్మీయత నాలో నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. వీరందరి మంచితనం, ఆప్యాయత నన్నూ, నా కుటుంబాన్నీ పోషించింది. నేను ఏం మాట్లాడినా నవ్వుకునేవారు. సోదర ప్రేమతో నా వద్ద అగరుబత్తీలు కొనేవారు. కొంతమంది తమ అవసరానికి మించి కొనేవారు. బహుశా వాటిని వారి బంధువులకో, మిత్రులకో ఇచ్చేవారేమో!
ఇంతమంది మిత్రుల్ని, ఆత్మీయుల్ని వదులుకుని, ఎక్కడకు వెళ్ళమంటారు? వద్దు సార్.. వద్దు. రెండురోజుల కొకసారైనా మిమ్మల్ని చూడందే, మీతో మాట్లాడందే నాకు తోచదు సార్!'
చివరి మాటలు అంటుండగా జబ్బార్ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. శర్మగారు జబ్బార్‌ని దగ్గరకు తీసుకని, ఆలింగనం చేసుకున్నాడు. రెండు నిముషాలు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినపడింది.
'లోపలికి వచ్చి ఇద్దరూ కాస్త మజ్జిగ తాగండి!' అన్న జానకమ్మ గారి పిలుపుతో ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు.
ఈ సంఘటన జరిగిన వారంరోజులకి బుధవారం సంత రోజున శివపురంలో రామాలయం ముందు అగరుబత్తీలు అమ్ముతున్నాడు జబ్బార్. పొరుగూళ్ళ నుంచి వచ్చినవాళ్ళు జబ్బార్‌తో పరాచికాలాడి అగరుబత్తీలు కొనుక్కుని వెళ్తున్నారు.
సాయంత్రం ఆరుగంటలయ్యింది. పూజారిగారు గుడి తలుపులు తీసి, దీపాలు వెలిగించారు.
కొద్దిగా అలసట అనిపించి, గుడి గేటుకి చేరబడి కూర్చున్నాడు జబ్బార్. పదినిమిషాలు గడిచాకా అగరుబత్తీల కోసం వచ్చిన వ్యక్తి జబ్బార్‌ని పిలిచాడు. అతను పలకకపోయేసరికి దగ్గరకు వెళ్ళి భుజం తట్టాడు. జబ్బార్ పక్కకి ఒరిగిపోయాడు. పూజారిగారు కూడా వచ్చి నాడి చూశారు. కొన్నిక్షణాల్లో ఆయన కళ్ళమ్మట నీళ్ళు జలజలా రాలాయి. వెంటనే రామశర్మకి కబురు చేశాడు పూజారి గారు.
రామశర్మ డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చారు. డాక్టర్ జబ్బార్‌ని పరీక్షించి, ప్రాణం పోయిందని చెప్పారు. నలుగురూ కలసి జబ్బార్ మృతదేహాన్ని అతనింటికి తీసుకువచ్చారు.
జబ్బార్ చనిపోయాడన్న వార్త తెలియగానే చుట్టుపక్కల గ్రామాల నుండి జనం తండోపతండాలుగా వచ్చారు అతనింటికి. బహుశా ఏ రాజకీయ నాయకుడి మరణానికీ అంతమంది జనం వచ్చి ఉండరు.
జబ్బార్ చనిపోయి నెల రోజులయ్యింది. శివపురంలో బుధవారం సంత జరుగుతూనే ఉంది. రామాలయం ముందు నుండి వెళ్ళేవారికి జబ్బార్ అగరుబత్తీల పరిమళం ముక్కుకి తాకుతూనే ఉంది.
ఎం.ఆర్.వి. సత్యనారాయణమూర్తి
98486 63735