Jun 07,2023 00:14
నేర సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: సామర్థ్యానికి మించి ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా ఎస్‌పి క్యాంప్‌ కార్యాలయ సమావేశ హాలులో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్పందన పిటిషన్లు, గ్రేవ్‌ కేసులు, ప్రాపర్టీ కేసులు, చీటింగ్‌ కేసులు, మిస్సింగ్‌ కేసులు, సర్కిల్‌ క్రైమ్‌ పార్టీల పనితీరు, గంజాయి, నాటుసారా కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి ఎస్‌పి సమీక్షించారు. జిల్లా ఎస్‌పి అధికారులతో మాట్లాడుతూ దిశ కాల్స్‌, 112, 100 ఎమర్జెన్సీ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాటి పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెనువెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. కాల్‌ వచ్చిన సమయం, సంఘటన స్థలానికి చేరుకున్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యంగా స్పందించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలోని స్టేషన్‌ల పరిధిలోని పోలీస్‌ అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించవలసి వస్తుందన్నారు. రౌడీలు, సస్పెక్ట్‌లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు.
జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై ప్రతిరోజు రైడ్‌లు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే నేరాలు కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో పరిమితికి మించి ఎక్కువ మందితో వెళుతున్న వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయన్నారు. రోజూ వారి కూలీలు ఎక్కువగా ఆటోలలో, ట్రాక్టర్‌లలో, ఇతర వాహనాలలో సామర్థ్యానికి మించి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారన్నారు. ఏదైనా అనుకోని విధంగా ప్రమాదం జరిగితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటోందన్నారు. కనుక వాటిని కంట్రోల్‌ చేయడానికి మొదటిగా ట్రాక్టర్‌, ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. అప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే చలానాలు విధించాలని, అవసరమైతే వాహనాన్ని సీజ్‌ చేయాలని అన్నారు. గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో నేర ఛేదనలో, లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్‌పి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్‌ ఎస్పి పి మహేష్‌, డిసిఆర్బి డిఎస్పి జి లక్ష్మయ్య, బాపట్ల, చీరాల, రేపల్లె డిఎస్‌పిలు టి వెంకటేశ్వర్లు, ఎస్‌ ప్రసాద్‌రావు, టి మురళీకృష్ణ, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డిఎస్పి ఏవి రమణ, డిఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ ఎ శ్రీనివాస్‌, డిసిఆర్‌బి ఇన్‌స్పెక్టర్‌ పి బాలమురళీకృష్ణ, జిల్లాలోని ఇన్‌స్పెక్టర్స్‌, అన్ని పోలీస్‌ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు, డిపిఓ అధికారులు పాల్గొన్నారు.