Aug 14,2023 23:49

పనిముట్ల సరఫరా నిలిపివేతతో కూలీలపై
అదనపు భారం
ఉపాధి హామీ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తోన్న
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
'ఇచ్చేది అరకొర వేతనమే అయినా ఉపాధి చట్టం ఆసరాగా ఉంది. గతంలో ఈ పనులకు వెళ్లేవారికి ప్రభుత్వమే పనిముట్లు ఇచ్చేది. ఐదేళ్ళుగా పనిముట్లను ఇవ్వడం ఆపేశారు. సొంతంగా పార, గునపం, తట్ట కొనుగోలు చేసుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తుంది' అని రౌతులపూడి మండలం బలరామపురానికి చెందిన ఉపాధి కూలీ ఎ.గోవింద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా ఇలా అనేకమంది కూలీలపై అదనపు భారం తప్పడం లేదు. చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే సౌకర్యాలు తగ్గిస్తున్నట్లు కూలీలు అంటున్నారు.
కాకినాడ జిల్లాలో 4.75 లక్షల వరకూ జాబ్‌ కార్డులు ఉన్నాయి. 5.50 లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ పనులు వల్ల కొన్ని మండలాల్లో మాత్రమే ఉపాధి పనులు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం కూలీల వేతనాల కోసం 60 శాతం, పరికరాల కోసం 40 శాతం నిధులు వెచ్చించాలి. పరిపాలనా ఖర్చుల కింద 6 శాతం మించకుండా ఖర్చు చేయాలి. పనిముట్లు కొనుగోలుకు అవకాశం ఉన్నా నాలుగేళ్ల నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో అవి కూలీలకు అందడం లేదు.
తగ్గుతున్న సౌకర్యాలు
ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన మొదట్లో ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించేది. కొన్నేళ్లుగా క్రమంగా వాటిని తగ్గిస్తూ వస్తుంది. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకొచ్చిన తర్వాత కేంద్ర విధానాలను అనుసరిస్తూ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగస్వామి అయ్యింది. ఈ పథకంలో మెటీరియల్‌ విభాగం కింద వస్తున్న నిధులతో సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు, సిమెంట్‌ రోడ్లు, డ్రెయినేజీలను నిర్మిస్తున్నారు. ఫలితంగా మెటీరియల్‌ విభాగంలో నిధులు భారీగా తగ్గిపోతున్నాయి. గతంలో ప్రతి గ్రూపునకు పారలు, గునపాలు, తట్టలు ఇతర సామగ్రితో పాటు నీడ కోసం టెంట్లు అందించేవారు. పని చేస్తున్న కూలీల సంఖ్య కనుగుణంగా గతంలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పనిముట్లు కోసం ఖర్చు చేసేవారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పెద్ద ఎత్తున అధికారులు కూలీలకు పని కల్పిస్తుంటారు. ఈ సమయంలో పనిముట్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. పనిముట్లు లేకపోవడంతో కొంత మంది పనిని కోల్పోతున్నారు.
తప్పని అదనపు భారం
తాగునీరు, పనిముట్లు, వేసవి అదనపు వేతనం, టెంట్లు, ప్రథమచికిత్స కిట్లు, మేట్లకు ఇచ్చే పారితోషికం వంటి రాయితీలన్నీ ప్రస్తుతం నిలిచిపోవడంతో కూలీలపై అదనపు భారం పడుతోంది. పనిముట్లు కొనుగోలు చేసేందుకు రూ.500 నుంచి రూ.700 వరకూ ఖర్చు అవుతోందని పలువురు కూలీలు తెలిపారు. గతంలో జాబ్‌ కార్డు కలిగిన వేతనదారులందరికీ పరికరాలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్ధితులు లేవు. పనిలోకి రావాలంటే పనిముట్లు తెచ్చుకుంటేనే మస్తర్‌ వేస్తున్నారు. పెరిగిన ధరలతో సతమతం అవుతుండగా నిర్దేశించిన వేతనం రాక ఆపసోపాలు పడుతున్న తమకు అదనపు ఖర్చులు తప్పడం లేదని గ్రామీణులు ఆవేదన చెందుతున్నారు.
సొంతంగా కొనుగోలు చేస్తున్నాం
గునపం, తట్ట, పార వంటివి ఐదేళ్లుగా ఇవ్వడం లేదు. సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నాం. అధికారులను ఆడుగుతుంటే తెలియదు అంటున్నారు. పనిముట్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి.
- నేరేడుమిల్లి సూరిబాబు, ఉపాధి కూలీ, తాళ్ళరేవు