Jan 21,2023 22:25

ప్రజాశక్తి - ఏలూరు
          కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నివాసాలకు, వ్యాపార సంస్థలకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనను, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే ఆలోచనను ఉపసంహరించు కోవాలని, వ్యవసాయ రంగానికి, ఎస్‌సి, ఎస్‌టి తదితరులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ చేశారు. శనివారం ఉదయం ఏలూరులోని జిల్లా విద్యుత్‌ భవన్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్‌ చట్టం 2005కు సవరణలు, ప్రతిపాదనలు బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే వ్యతిరేకిస్తుంటే మోడీ ఆదేశాల మేరకే మన రాష్ట్రంలో సిఎం జగన్‌ అమలు చేయడానికి పూనుకోవడం దారుణమని విమర్శించారు. స్మార్ట్‌, ప్రీపెయిడ్‌, ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో వినియోగదారులపై వేలకోట్ల భారాలు మోపుతున్నారని విమర్శించారు. వ్యవసాయ మీటర్ల వినియోగదారులపై ఆరువేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి లేకుండా మీటర్ల కొనుగోలు చేయరాదని, అయినా ఏకపక్షంగా కొనుగోలు చేశారని చెప్పారు. హరిత ఎనర్జీ పేరుతో 75 వేల ఎకరాలను అదానీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని తెలిపారు. ఒక్కో స్మార్ట్‌ మీటరు రూ.13 వేల నుండి రూ.14 వేల వరకూ ఖర్చవుతుందని అంటే సుమారు పది వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని చెప్పి జగన్‌ మాట తప్పారని విమర్శించారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఇప్పటికే అదనపులోడు, డిపాజిట్ల పేరుతో భారాలు వేస్తున్నారని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఉచిత విద్యుత్‌ కోత పెట్టారని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే పద్ధతితో వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌కు కూడా ఎసరు పెట్టారన్నారు. ప్రభుత్వం ఇదే పద్ధతిలో ముందుకెళితే 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్‌ పోరాటం మాదిరే మరో విద్యుత్‌ పోరాటం జరుగుతుందని హెచ్చరించారు. 2023-24 సంవత్సరం లోటుగా చూపించిన 13 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీగా ఇవ్వాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించరాదని, ట్రూ అప్‌ ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలని, ఇప్పటికే వసూలు చేస్తున్న ట్రూ అప్‌ ఛార్జీలను నిలిపి వేయాలని రవి డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం సిపిఎం జిల్లా కమిటీ తరపున ట్రాన్స్‌కో ఎస్‌ఇ అధికారి సాల్మన్‌రాజుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలకు ఉచిత విద్యుత్‌ను ఎట్టి పరిస్థితులలోనూ తొలగించబోమని హామీ ఇచ్చారు. అదే విధంగా వినతిపత్రంలోని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా, నగర నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పి.కిషోర్‌, ఎ.శ్యామలారాణి, కె.శ్రీనివాస్‌, రామకృష్ణ, పి.ఆదిశేషు, లెనిన్‌, సాయిబాబు, జగన్నాధరావు, గోపి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో
ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాలను ఉపసంహరించుకోవాలని పలు ప్రజాసంఘాలు ట్రాన్స్‌కో ఎస్‌ఇకి వినతిని అందించాయి. ఈ సందర్భంగా ఏలూరు నగర అభివృద్ధి కమిటీ నాయకులు పి.కిషోర్‌, పన్నుల వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ కట్టా సత్యనారాయణ తమ బృందంతో కలిసి వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ నాయకులు ఏసుబాబు, కోటేశ్వరరావు, ఇస్సాక్‌, పన్ను వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు గోపి, గౌడ రవీంద్ర, లెనిన్‌ పాల్గొన్నారు.