ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పశువులు అనారోగ్యంతో లేదా ప్రమాదవశాత్తు మృతి చెందితే వాటి పశు పోషకులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని అమలు చేసింది. ఈ పథకంలో భాగంగా పశువులుకు ఉచితంగానే బీమా సదుపాయం కల్పించారు. ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలో మృతి చెందిన పశువులకు సంబంధించిన పాడి రైతులకు నూరుశాతం పరిహారం దక్కింది.
తాజాగా ఈ పథకంలో ప్రభుత్వం మార్పులు తెచ్చింది. పథకం పేరును వైఎస్‌ఆర్ పశు బీమాగా మార్పు చేసినా ఉచిత బీమాను మాత్రం రద్దు చేసింది. మెరుగైన విధంగా బీమాను అమలు చేస్తామని, పరిహారాన్ని సకాలంలో అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు పల్నాడు జిల్లాలో క్లష్టర్ల వారి కేటాయింపుల్లో భాగంగా నేషనల్ ఇన్సూరెన్స్ బీమా కంపెనీ నమోదు చేస్తుండగా బీమా మధ్యవర్తిగా యన్ ట్రస్ట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీస్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ వ్యవహరిస్తోంది. గతంలో పశువులు చనిపోతే ప్రీమియం ఏమీ చెల్లించకుండానే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేది. అది కూడా చనిపోయిన ఆవు, గేదె, మేకలు, గొర్రెలకు వర్తింపజేసేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకంలో అనేక మార్పులు చేసి కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. అందులో పేర్కొన్న నిబంధన ప్రకారం పశు పోషకులు నిర్దేశిత ప్రీమియం చెల్లించి బీమా చేయించుకుంటేనే పరిహారం అందుతుంది. అది కూడా ఒక మేలు జాతి పశువుకు ప్రీమియం ఎంత ఎక్కువ చెల్లించినా పరిహారం మాత్రం రూ.30 వేలే ఇస్తామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ పశు పోషకులకు రూ.30 వేలు విలువ చేసే ఆవు, గేదే, ఎద్దు, దున్నలకు మూడేళ్ల కాల పరిమితికి రూ.384- ప్రీమియం చెల్లించాలి. మిగతా సామాజిక తరగతుల వారు రూ.960 చెల్లించాలి. రూ.15 వేలకు బీమా చేయించుకుంటే రూ.192, రూ.480 చెల్లించాల్సి ఉంటుంది. రూ.30 వేల కంటే ఎక్కువ ధర ఉన్న పశువులకు అదనంగా బీమా మొత్తం చెల్లించినా బీమా సంస్థ మాత్రం రూ.30 వేలే ఇస్తుంది.
గొర్రె, మేక, పందులకు రూ.6 వేలే
గొర్రెలు, మేకలు, పందులకు ఒక ఏడాది, రెండు, మూడేళ్ల కాల పరిమితికి బీమా చేసుకునే వెసులుబాటు ఉంది. ఆయా జీవాల పెంపకం దారుల్లో ఎస్సీ, ఎస్టీలకు రూ.36, ఇతరులు రూ.90 చెల్లించాలి. రెండేళ్లకు రూ.54, రూ.135, మూడేళ్లకు రూ.75, రూ.187.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జీవాలు చనిపోతే ఒక్కో దానికి రూ.6 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు.
ఎన్ని ఉన్నా 5 పశువులకు 50 జీవాలకు మాత్రమే బీమా..
ఉచిత పశు బీమా పథకం అమలులో ఉన్నప్పుడు రైతుకు ఎన్ని పశువులున్నా ఆవులు, గేదెలు, మేకలకు, గొర్రెలకు వర్తింపజేశారు. ఇంతకుముందు కేవలం ఆవులు, పశువులు, గొర్రెలు, మేకలకు మాత్రమే బీమా వర్తింపజేసేవారు. ప్రస్తుతం దున్నలు ఎద్దులు పందులకు కూడా బీమా పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఒక కుటుంబంలో, గేదెలు, ఆవులు, ఎద్దులు, దున్నలు ఎన్ని ఉన్నా గరిష్టంగా 5 పశువులకు, గొర్రెలు, మేకలు, పందులకు 50 జీవాలకు మాత్రమే బీమా వర్తింపజేస్తున్నారు. అర్హులైన వారు రైతు భరోసా కేంద్రంలో, సచివాలయ సిబ్బంది ద్వారా వివరాలు నమోదు చేసుకొని బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లించాలి. బీమా చేసిన 15 రోజుల నుండి అమలులోకి వస్తుంది. పశువుకు ప్రాణ నష్టం వాటిల్లితే బీమా కంపెనీ సిబ్బంది వచ్చి వైద్యుని పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం నిర్వహించి వివరాలు నమోదు చేసుకుంటారు.
మొదటి ఈత పాలిస్తూ రెండేళ్లు పైబడి 10 ఏళ్ల వయసు లోపున్న ఆవు, మొదటి ఈత పాలిస్తూ 3-12 ఏళ్లలోపు వయసు గేదెకు బీమా వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రైవేటు బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నారు. నిర్దేసించిన సమయంలోగా ప్రీమియం అందుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు బీమా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 100 శాతం బీమా చెల్లించగా మృతి చెందిన 330 పశువులకు సంబంధించి బిల్లులు చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. 2019 లో పశు గణన లెక్కల ప్రకారం పల్నాడు జిల్లాలో ఆవుజాతి పశువులు 66072, గేదె జాతి 467046, గొర్రెలు 469424, మేకలు 156291, పందులు 1645 ఉన్నాయి.
21 రోజుల్లో అన్నీ చెల్లింపు
కె.కాంతారావు, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి.
ప్రీమియం చెల్లింపులో రైతు భాగస్వామ్యం ఉంటే పరిహారం చెల్లింపులో ఆ సంస్థకు బాధ్యత ఉంటుంది. పశు ప్రాణ నష్టం వాటిల్లితే ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన 21 రోజుల్లో పరిహారం చెల్లించేలా సంస్థతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. జిల్లాలో పశు బీమా నమోదు లక్ష్యం మొదటి విడత 14 వేలుగా నిర్దేశిం చారు. ఇప్పటికే 6 వేలు పూర్తి చేశాం.










