కడప అర్బన్ : ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎఫ్‌ఎ-2 పరీక్షలు విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేవిగా కాకుండా ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించేవిగా ఉన్నాయని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు ఆరోపించారు. మంగళవారం యుటిఎఫ్ భవన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యత నిచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకుంటుందని, విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్ష ప్రశ్నా పత్రాలను ప్రింటింగ్ చేయడానికి కావాల్సిన నిధులను విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉందని వాపోయారు. సెల్ ఫోన్‌లో ప్రశ్నాపత్రాలను చూసుకుని విద్యార్థులకు బోర్డుపై రాసి పరీక్షలు నిర్వహించాలని తెలపడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇలా ప్రశ్నాపత్రాలు వాట్స్‌అప్ గ్రూపుల్లో రావడం వల్ల ఆ పరీక్షలకు తగిన ప్రాధాన్యత లేకుండా పోతుందని చెప్పారు. ప్రశ్నాపత్రాలు ముద్రించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికక్కడ ఆయా పాఠశాలల్లోనే ప్రశ్నా పత్రాలు తయారు చేసుకోమని ఉపాధ్యాయులకు ఉత్తర్వులు ఇచ్చినా సరిపోయేదని తెలిపారు. పాఠశాలలకు రావాల్సిన నిధులు ప్రభుత్వం విడుదల చేయక పోవడం వల్ల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు పేపర్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. చివరికి ఉపాధ్యాయులే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రశ్నాపత్రాలు సమాధాన పత్రాలు తీసుకువచ్చి విద్యార్థులకు ఇచ్చే దుర్భర పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పారు. ప్రశ్నాపత్రాలను బోర్డు మీద రాయడానికి గంటకు పైగా సమయం పడుతుంటే విద్యార్థులు సమాధానాలు ఎప్పుడు రాయాలో దిక్కు తెలియని స్థితిలో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిసిఇబిలకు తగిన నిధులను విడుదల చేసి ప్రశ్నాపత్రాలు ప్రింటింగ్ చేసి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇలాంటి పరీక్షల వలన విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ నరసింహారావు, జిల్లా కార్యదర్శి ఎజాస్ అహ్మద్, నాయకులు గోపీనాథ్, వెంకటరమణ, జమాల్ బాషా, సిద్దయ్య, జావిద్, కరిముల్లా, కిరణ్ కుమార్, జి. వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.










