May 01,2021 07:17

  ఇప్పటికే అరకొర వసతులతో తక్కువ సమయంతో తరగతులు నడిపిన ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు మరో రెండు నెలల పాటు విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులు నిర్వహించి రెండు నెలల తర్వాత పరీక్షలు జరిపితే బాగుంటుంది. విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు పెరుగుతాయి కదా ! ఆ వైపుగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పటికిప్పుడు పరీక్షలు జరపాలని అంత అత్యవసర పరిస్థితి ఏమిటి? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పది పరీక్షను రద్దు చేసింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు రద్దు చేశాయి అయినా మన రాష్ట్రంలో ఇలా ఎందుకు జరుగుతోంది ?
   కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ, కుంభమేళా లాంటి ఉత్సవాలు జరిగిన తీరు, ఆ తర్వాత కోవిడ్‌ విజృంభించిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. వీటిని గమనించిన అంతర్జాతీయ మీడియా మోడీ ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టిందీ కూడా చూశాం. మోడీ సర్కారు నిర్వాకాన్ని బట్టబయలు చేస్తూ వార్తలు, కథనాలు రావడం లేదంటూ జాతీయ మీడియా చెందిన పాత్రికేయులు వారి సంపాదకులను నిలదీశారు. ప్రజల పక్షాన మనం నిలబడాల్సిన సమయంలో మన బాధ్యతల నుంచి మనం తప్పు కుంటున్నామంటూ లేఖలు రాశాయి. మొన్న తమిళనాడు హైకోర్టు కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతికి అసలైన కారణం కేంద్ర ఎన్నికల సంఘం అంటూ వారి మీద హత్య కేసు ఎందుకు పెట్టకూడదని నిలదీసింది. నిన్న పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు ఏకంగా ఎన్నికల సంఘం మీద మర్డర్‌ కేస్‌ పెట్టమంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో వరుసగా జరిన స్థానిక సంస్థల ఎన్నికలతో కరోనా బారినపడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలతో 75 శాతం పైగా మంచాన పడిపోయారు. సెలవులు లేవు. వైద్య సదుపాయాలు లేవు. టెన్త్‌ క్లాస్‌ వరకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠశాలకు వెళ్లాల్సిందే. మినహాయింపు లేదు. ఇలాంటి ఒత్తిడిలో ఉపాధ్యాయులు మరణించిన తీరు కూడా మనం చూశాం. ఇవన్నీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తగుదునమ్మా అంటూ రాష్ట్రంలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిపి తీరాల్సిందే అంటూ పట్టుపట్టింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్ని వినతులు సమర్పించుకున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. కోవిడ్‌ విద్యార్థులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఉన్నవారికి వేరే గది కేటాయిస్తామంటున్నారు. మరి కోవిడ్‌ లక్షణాలు పైకి కనిపించని విద్యార్థుల పరిస్థితి ఏమిటి? లక్షణాలు బైటపడకుండా రోగంతో వచ్చి పాల్గొంటున్న సిబ్బందిని గుర్తించడం ఎలా? 11 లక్షల మంది విద్యార్థులు వారి కోసం వచ్చే తల్లిదండ్రులు విధులు నిర్వర్తించడానికి వచ్చే సిబ్బంది రవాణా సదుపాయాల మాటేమిటి? వారితో పాటు ప్రయాణించే ఇతర ప్రయాణీకుల పరిస్థితి ఏమిటి? వీటన్నిటికీ ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా పరీక్ష మాత్రమే నిర్వహిస్తే మా పని అయిపోతుంది అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుండడం తగదు.
   కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం-2005 ను అనుసరించి కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ 26 ఏప్రిల్‌ 2021లో జారీ చేసిన జీవో మేరకు జిమ్‌ లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ లు వంటివి వెంటనే మూసివేయాలని, 50 మందికి మించి జనసమూహాలు ఉండకూడదని, మాస్కులు, శానిటైజర్‌ తప్పనిసరిగా ఉండాలని, ప్రజా రవాణా 50 శాతం మాత్రమే ప్రయాణికులు ఉండాలని మనిషికి మనిషికి ఐదు అడుగుల దూరం ఉండాలని జీవో పేర్కొంది. అదే రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు వారు మొదటి, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ కు సంబంధించి సుమారు 11 లక్షల మంది విద్యార్థులు 1450 సెంటర్లు, 3500 మంది సిబ్బందితో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఒక్కో సెంటర్లో 400 నుంచి 500 మంది విద్యార్థులు అదే సంఖ్యలో వారి తల్లిదండ్రులు మరియు సిబ్బందితో కలుపుకుని సుమారు 1000 మంది ఒకే చోట చేరుతున్న పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం 2005 కేంద్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ వారు కరోనా మహమ్మారి కట్టడికి తీసుకున్న చట్టపరమైన చర్యలకు విరుద్ధం కాదా? ఇదే అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకం కాదా ?
   కరోనా మహమ్మారి నుంచి విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉద్యోగులను కాపాడవలసిన బాధ్యత ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల మీద ఉంది. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల మీద నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ 2005 చట్టం క్రింద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ''ది ఆంధ్రప్రదేశ్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌'' లేఖ కూడా రాసింది. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం జరుపతలపెట్టిన మంత్రివర్గ సమావేశాన్ని సైతం కేవలం 30 మంది మంత్రులు ఒక దగ్గరకి రాకూడదనే ఉద్దేశంతోనే వాయిదా వేసినప్పుడు ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా వేయడంలో తప్పేముంది? కోవిడ్‌ నిబంధనలు పాటిస్తామనుకుని చెప్పే పని అయితే నిబంధనలు ఎంతవరకు విద్యార్థులకు రక్షణ ఇస్తాయి? మాస్క్‌ వేసుకుంటారు, భౌతిక దూరం పాటిస్తారు. అంతటితో సరిపోతుందా? థర్మల్‌ స్కానర్‌ ద్వారా జ్వరం ఉన్న వాళ్ళని గుర్తిస్తారు. మరి జ్వరం వచ్చిన విద్యార్థి టాబ్లెట్‌ వేసుకుని పరీక్షకు వస్తే థర్మల్‌ స్కానర్‌ గుర్తించగలదా? జ్వరం వచ్చిన తర్వాత లక్షణాలు ఉన్నట్లు మనం గుర్తిస్తాం కానీ జ్వరం రాకముందు లక్షణాలు తీవ్రంగా ఉండి ఆ తదుపరి జ్వరం వస్తున్నట్లు ఇటీవల వైద్యులు చెబుతున్నారు. మరి వారి పరిస్థితి ఏమిటి? అంటే జ్వర లక్షణాలు రాకముందే ఎంతో మందికి ఈ వ్యాధిని తెలియకుండానే సంక్రమింప చేసి ఉండొచ్చు. ఇలాంటి ప్రత్యేక కేసులకు పరిష్కారం ఏమిటి? మరో విద్యార్థి ఆరోగ్యం బాగా ఉండి పరీక్ష రాయడానికి వస్తాడు. పైకి లక్షణాలు కనిపించని విద్యార్థితో చనువుగా ఉండటం వల్ల, మరే కారణం ద్వారా అయినా ఆ విద్యార్థికి వ్యాధి సంక్రమిస్తుంది. తదుపరి ఐదు రోజుల తర్వాత పరీక్ష రాయలేకపోతే మధ్యలోనే పరీక్ష నుండి ముగించుకొని వెళ్ళవలసి వస్తుంది. ఆ విద్యార్థి అప్పుడు ఉత్తీర్ణత పొందలేడు. విద్యార్థి బాగా ఉండి కూడా పరీక్షలు రాయడానికి వచ్చి జబ్బున పడినట్లే కదా! ఇక్కడ ఏ తప్పు చేయని విద్యార్థి పరీక్ష రాయడానికి వచ్చి మాత్రమే కదా జబ్బు పడ్డాడు. ఇప్పటికే అరకొర వసతులతో తక్కువ సమయంతో తరగతులు నడిపిన ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు మరో రెండు నెలల పాటు విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులు నిర్వహించి రెండు నెలల తర్వాత పరీక్షలు జరిపితే బాగుంటుంది. విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు పెరుగుతాయి కదా! ఆ వైపుగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పటికిప్పుడు పరీక్షలు జరపాలని అంత అత్యవసర పరిస్థితి ఏమిటి? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పది పరీక్షను రద్దు చేసింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు రద్దు చేశాయి. అయినా మన రాష్ట్రంలో ఇలా ఎందుకు జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా ప్రభుత్వం పరీక్షల నిర్వహణ విషయం పునరాలోచించాలని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిలో మనం ఏది అనుకుంటే అదే చేద్దాం అనే ఏకపక్ష విధానాన్ని ప్రభుత్వం విడనాడి పరీక్షలను వాయిదా వేయాలి. తద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి.
 

/ వ్యాసకర్త ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు /
డా|| ఎం.వి రమణయ్య

డా|| ఎం.వి రమణయ్య