ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శుక్రవారం బాపట్ల పట్టణంలోని బాపట్ల జూనియర్ కళాశాల, సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ వున్న పరిసరాలను, తీసుకున్న భద్రతా చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూకపరింటెండెంట్స్, ఇతర అధికారులు అనుసరించవలసిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో బయట వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు ఉండరాదని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 సిఆర్‌పిసి అమలులో ఉన్నందున ఎవరూ గుంపులుగా ఉండకూడదని అన్నారు. తగిన ఎస్కార్ట్‌తో ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో ప్రవేశించే విద్యార్థులు, ఇన్విజిలేటర్‌లను, ఇతర సిబ్బందిని తనిఖీ చేసి మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు తమ విధులలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.










