Jan 04,2023 23:56

ర్యాలీ నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాల విద్యార్థులు

ప్రజాశక్తి -సీలేరు
సీలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. జీకే వీధి మండలంలో పరీక్ష కేంద్రం మాకొద్దు సీలేరు జూనియర్‌ కళాశాలలో పరీక్ష కేంద్రం ముద్దు అంటూ నినాదాలు చేశారు. సీలేరు మార్కెట్‌ సెంటర్‌ చేరుకొని మానవహారంగా నిర్వహించారు. అధికారులు తక్షణమే సీలేరులో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలన్నారు. అనంతరం ర్యాలీగా గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకొని గ్రామ సభలో పాల్గొన్న కార్యదర్శి శ్రీనివాస్‌, ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు నుంచి జీకే వీధి మండల కేంద్రంలో పరీక్షా కేంద్రం తరలించడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి కనీస బస్సు సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నామని వాపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటిడిఏ పి ఓ రోణంకి గోపాలకృష్ణ, కమిషనర్‌ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.