Aug 13,2023 22:21

రమేష్‌ హాస్పిటల్‌ ఎండో క్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ రాకేష్‌ బొబ్బా


ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్సిటీ : ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ప్రపంచ ప్రీ డయాబెటిస్‌ : దినోత్సవంగా జరుపుకుంటాము. సాధారణ ప్రజల్లో ప్రీడయాబెటిస్‌ గురించి అవగాహన కల్పించడంతో పాటు మధుమేహం వద్ధిని అరికట్టడం దీని ప్రధాన ఉద్దేశం. రోజురోజుకు డయాబెటిక్‌ రోగులు సంఖ్య పెరుగుతుందని దీనిపై ప్రజలకు తెలియచేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రమేష్‌ హాస్పిటల్‌ ఎండో క్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ రాకేష్‌ బొబ్బా తెలిపారు. ఈ సందర్భంగా ప్రీ డయాబెటిక్‌ గురుంచి తెలియచేశారు.
ప్రీడయాబెటిస్‌ అంటే ఏమిటి?
ప్రీడయాబెటిస్‌ అంటే మన రక్తంలోని చక్కర స్థాయిలు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉండటం, కానీ అది మధుమేహం అని నిర్ధారించబడేంత ఉండకపోవడం.
ప్రస్తుతం ఉన్న అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సుమారు 13.6 కోట్ల మంది ప్రి డయాబెటిస్‌ తో బాధపడుతున్నారు రానున్న ఐదు సంవత్సరాలలో వీరిలో 75 శాతం మందికి డయాబెటిస్‌ వద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
ప్రీడయాబెటిస్‌ కు కారణాలు ఏమిటి?
ఇన్సులిన్‌ అనేది మన శరీరంలోని క్లోమం చేత తయారు చేయబడే హార్మోను. ఇది మన రక్తంలోని చక్కెరలను మన కణాలకు అందజేయడం తద్వారా మన రోజు వారి మనుగడకు అవసరమైన శక్తిని మన శరీరానికి అందజేస్తుంది. శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు లేదా మన రోజువారి అవసరాలకు సరిపడినంత ఉత్పత్తి అవ్వనప్పుడు దానిని ప్రీడయాబెటిస్‌ అంటాము.
కారణాలను తెలుసుకుందాం....
ఈ క్రింద చూపబడే కారణాలు ప్రీడయాబెటిస్‌ అభివద్ధి చెందటానికి ఎక్కువ దోహబడతాయి:
ఊబకాయం లేదా అధిక బరువు, తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు మధుమేహం ఉండటం, గర్భాధారణ సమయంలో మధుమేహం నిర్ధారించబడటం, శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, కొలెస్ట్రాల్‌ శాతం ఎక్కువ ఉండటం మహిళలలో పీరియడ్స్‌ సమస్యలు వంటివి ఉండటం, వీటితోపాటు మన భారతీయులలో పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ప్రీడయాబెటిస్‌ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ దీనికి కారణం మన జన్య కణాల తయారీ విధానం, దీనిని సౌత్‌ ఏషియన్‌ ఫినో టైప్‌ అంటారు.
ప్రీ డయాబెటిక్‌ లక్షణాలు.....
ప్రీడయాబెటిస్‌ ఉన్న వారిలో తరచుగా ఎటువంటి సంకేతాలు కాని లక్షణాలు కానీ ఉండకపోవచ్చు, కానీ రక్తంలో చక్కెర స్థాయిలో సాధారణం కంటే ఎక్కువ ఉంటాయి. దీని కారణంగా చాలామందికి తము ప్రీడయాబెటిస్‌ స్టేజ్‌ లో ఉన్నారని తెలియదు, చాలా కొద్ది మంది వ్యక్తులలో మాత్రమే నీరసం, ఆకలి ఎక్కువ వేయటం, చెమటలు పెట్టడం, అలసటగా ఉండటం వంటి లక్షణాలను చూస్తూ ఉంటాము కాబట్టి పైన తెలిపినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారు పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఎలా గుర్తించవచ్చు.....
ప్రి డయాబెటిస్‌ను ఈ క్రింది పరీక్షల ద్వారా మనం గుర్తించవచ్చు:
రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలో 100 ఎం.జి/డిఎ1 నుండి 125 ఎం.జి/డిఎ1 మధ్య ఉంటే ఇది ప్రీడయాబెటిస్‌ అని కొంతవరకు నిర్ధారించబడుతుంది.
2 గంటల గ్లూకోస్‌ టోలరెన్స్‌ పరీక్ష( గ్లూకోజ్‌ తోలేరెంట్‌ టెస్ట్‌) : ఈ పరీక్ష 75 గ్రామాల గ్లూకోజ్‌ ద్రావణాన్ని తీసుకునే ముందు మరియు తీసుకున్న తర్వాత రక్తంలోని గ్లూకోస్‌ స్థాయిలను కొలుస్తుంది, పరీక్ష రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు 140ఎం.జి/డిఎ1 నుండి 199ఎం.జి/డిఎ1మధ్య ఉంటే అది ప్రీడయాబెటిస్‌ ఉన్నట్లు సూచిస్తుంది.
గ్లైకోసైలేటెడ్‌ హిమోగ్లోబిన్‌ (హెచ్‌బిఎ 1సి) పరీక్ష: దీనిని హిమోగ్లోబిన్‌ ఏ 1సి అని కూడా పిలుస్తారు, ఈ పరీక్ష మన రక్తంలోని గత రెండు నుండి మూడు నెలల్లో సగటు గ్లూకోజ్‌ స్థాయిలను కొలుస్తుంది ఇది 5.7 శాతం నుండి 6.4 శాతం మధ్య ఉంటే అది ప్రీడయాబెటిస్‌ అని నిర్ధారించబడుతుంది. పైన తెలుపబడిన పరీక్షలను 30 సంవత్సరాలు పైబడిన వారు వారు తప్పనిసరిగా చేయించుకోవాలి, అలాగే ప్రతి మూడు సంవత్సరాలకు ఈ పరీక్షలను క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉంటే మంచిది అదేవిధంగా ఎవరిలో అయితే ప్రీడయాబెటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందో వారు వీలైనంతవరకు తరచుగా పరీక్షలు చేయించుకుంటే మంచిది. ప్రస్తుతం ఉన్న ఉన్న అధ్యయనాల ప్రకారం ప్రీడయాబెటిస్‌ ఉన్న వ్యక్తులలో అంధత్వం, స్ట్రోక్‌, గుండె జబ్బులు, నరాల సమస్యలు మరియు మూత్రపిండాల వైఫల్యం వంటి జీవక్రియ సమస్యలకు లోనవుతారని తెలుస్తుంది. కాబట్టి ప్రీడయాబెటిస్‌ ను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవాలి.
ప్రీడయాబెటిస్‌ యొక్క చికిత్స , నిర్వహణ:.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినటం, రోజూ 30 నిమిషాలు శారీరక వ్యాయామం చేయటం, తక్కువ క్యాలరీలో ఉన్న ఆహారాన్ని తినడం ద్వారా ఐదు శాతం వరకు బరువు తగ్గటం, రోజువారి ఆహారంలో ఉప్పు ప్రమాణాన్ని తగ్గించటం, ధూమపానం, మద్యపానాన్ని ఆపివేయటం, అదేవిధంగా టీ,కాఫీలలో, ఆహార పదార్థాలలో ఎక్కువ చక్కెరలను తీసుకోవడం మానేయటం ద్వారా ప్రీడయాబెటిస్‌ రాకుండా జాగ్రత్త పడవచ్చు, అదేవిధంగా ప్రీడయాబెటిస్‌ నుండి మధుమేహం కు వద్ధి చెందే అవకాశాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.
కొంతమంది రోగులు ఎవరైతే ఆరోగ్యమైన జీవన శైలి నిర్వహించడంలో విఫలమవుతారో, లేదా టైప్‌ 2 మధుమేహం అభివద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుందో వారిలో కొన్ని రకాల మాత్రలను వాడవలసి ఉంటుంది. ప్రీడయాబెటిస్‌ కోసం ఉపయోగించే అత్యంత సాధారణ మందులు మెట్ఫార్మిన్‌ అకార్బోస్‌ ఇవి డయాబెటిస్‌ మిల్లైటస్‌ అభివద్ధిని నిరోధించడంతో సహాయపడతాయి. ఈ మందులు తక్కువ దుష్ప్రభావాలను కలిగి, ప్రీడయాబెటిస్‌ రోగులలో బాగా పనిచేస్తాయి.