Dec 16,2022 23:59

సిఐకి వినతిపత్రం ఇస్తున్న బాధితుడు మహాలక్ష్మి

ప్రజాశక్తి-చోడవరం
జగనన్న కాలనీకి సంబంధించి భూమిని కోల్పోయిన వ్యక్తికి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సొమ్ము రూ.72 లక్షలు స్వాహా చేసిన వైసిపి నాయకుడిపై బాధిత భూ యజమాని ఆబోతు మహాలక్ష్మి శుక్రవారం సిఐ బి.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు ప్రకారం... మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ఆబోతు మహాలక్ష్మికి చెందిన రెండు ఎకరాల ఢ పట్టా భూమిని 2021లో జగనన్న ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం తీసుకుంది. దీనికి పరిహారం కింద రూ.72 లక్షలు మహాలక్ష్మి బ్యాంక్‌ (గ్రామీణ బ్యాంకు) అకౌంట్‌లో ప్రభుత్వం జమ చేసింది. డబ్బులు పడిన విషయం మహాలక్ష్మికి తెలియదు. ఈ లోగా ఆ గ్రామ మాజీ సర్పంచ్‌, వైసిపి నాయకుడు జగనన్న ఇల్లు ఇప్పించానని, అందుకు సంబంధించిన డబ్బులు పడ్డాయని చెప్పి బాధితుడు మహాలక్ష్మిని బ్యాంకుకు తీసుకొని వెళ్లాడు. అక్కడ పలు కాగితాలపై సంతకాలు చేయించుకుని, బ్యాంక్‌ అధికారుల సమక్షంలో 2021 జనవరి 27న మహాలక్ష్మి అకౌంట్‌లో ఉన్న డబ్బులను తన అకౌంట్‌లోకి మళ్లించుకున్నాడు. తరువాత విషయం తెలుసుకున్న మహాలక్ష్మి కొందరు గ్రామస్తుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకు, రెవెన్యూ అధికారులకు వివరాలు తెలియజేయాలని నోటీసులు పంపించారు. అయితే నాటి నుంచి ఇప్పటివరకు కేసులో ఎటువంటి పురోగతి లేదు. దీంతో మహాలక్ష్మి శుక్రవారం చోడవరం వచ్చి స్థానిక సిఐ బి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించాడు. తమకు న్యాయం చేయాలని కోరాడు.