Mar 07,2021 07:08

చట్టపరంగా సాధించుకున్న ప్రజా హక్కులను కాలరాస్తే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు. బ్యూరోక్రాట్లు తమ అధికారాలను విస్మరించి పాలక వర్గాల తొత్తులుగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదని మార్చి 1న తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును పరిశీలిస్తే విదితమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద లాభపడే వారు ఎంతమంది ఉన్నారో, నష్టపోయినవారు కూడా గణనీయంగానే ఉన్నారు. ఒక మంచి పని కోసం ఒక ప్రాజెక్టు చేపట్టినపుడు ఆ ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. కాని, ఆ ప్రాజెక్టు కింద సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన సహాయం అందించాల్సింది పోయి వారిని మరింత పాతాళానికి తొక్కడం అత్యంత దుర్మార్గమైన విషయం. తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరిగింది. మన రాష్ట్రంలో కూడా జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణం కింది అనేక మంది భూములు, ఇళ్ళు, సర్వం కోల్పోయారు. ఆనాడు ప్రజలు ఆందోళన చేపడితే భూములు, ఇళ్ళు కోల్పోయిన వారికి కొంత పరిహారం ముట్ట చెప్పి...పోలీసుల ద్వారా అనంతగిరి గ్రామ ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల నగదుతో పాటు పునరావాసం, మౌలిక వసతులు కల్పించాలని అక్కడి పేదలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం 2018 అక్టోబర్‌లో కోర్టు మధ్యంతర తీర్పు వెల్లడించింది. భూములకు, ఇళ్ళకు మాత్రమే నష్టపరిహారం ఇస్తే సరిపోదు. ప్రాజెక్ట్‌ వల్ల సర్వం కోల్పోయిన వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం, నష్టపరిహారం చెల్లించాలని చెప్పింది.
కోర్టు తీర్పును ప్రభుత్వం ధిక్కరించినందుకు తిరిగి పేదలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును ధిక్కరించినందుకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, స్థానిక ఆర్‌.డి.ఓలకు ఏకంగా 3 నెలల చొప్పున జైలు శిక్షతో పాటు రూ. 10 వేల చొప్పున జరిమానా విధించింది. పేదలకు తక్షణమే పునరావాసం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇటువంటి పరిస్థితి ఒక్క తెలంగాణ లోనే కాదు బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యాంగ బద్ధంగా వచ్చిన ప్రజల హక్కులన్నిటిని కాలరాస్తూ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. 2013 భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని మూడు సార్లు ప్రయత్నించి భంగ పడింది. మన రాష్ట్రంలో గత ఏడు సంవత్సరాలుగా గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం అభివృద్ధి అనే ముద్దు పేరు పెట్టి పరిశ్రమలు, ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, రాజధాని పేరుతో 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి రైతులు, పేద ప్రజల నుండి నాలుగు లక్షల ఎకరాలకు పైగా భూములు లాక్కున్నాయి. తిరగబడిన వారిపై నిర్బంధం ప్రయోగించాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా భూబ్యాంకునే ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు 15 లక్షల ఎకరాలు గుర్తించింది. నాడు రైతు, కూలీ, దళిత, గిరిజన సంఘాలు ఏకమై పోరాడబట్టి ఆనాడు తాత్కలికంగా వెనుకడుగు వేసింది. అయినప్పటికీ వివిధ ప్రాజెక్ట్‌ల కోసం భూములు తీసుకున్న చోట పేదలకు పునరావాసం, పున:నిర్మాణం చేపట్టలేదు. కాబట్టే అనివార్యంగా పేదలకు చట్టపరంగా పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం 2016లో హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘంగా విచారించిన తరువాత వివిధ ప్రాజెక్ట్‌ల కింద నష్టపోయిన వారికి 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సిందిగా హైకోర్టు 2018 ఆగష్టులో తీర్పు చెప్పింది. అంతేగాక, రానున్న 6 నెలల్లో లబ్ధిదారులందరిని గుర్తించి పరిహారం చెల్లించే పని రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీకి అప్ప చెప్పింది. కోర్టు తీర్పు చెప్పి రెండున్నర సంవత్సరాలు గడిచింది. పాత ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చింది తప్ప ఒక్క లబ్ధిదారుని గుర్తించలేదు. ఒక్కరికి పరిహారం అందించలేదు. ప్రభుత్వం మారింది తప్ప విధానంలో ఎటువంటి మార్పు లేదు. పేదలకు న్యాయం జరిగింది లేదు.
రాష్ట్రంలో సుమారుగా 50కి పైగా ప్రాజెక్టుల కింద 5 లక్షలకు పైగా నిర్వాసితులున్నారు. ఒక్క పోలవరం ప్రాజెక్టు కిందే సుమారు రెండు లక్షల మంది ఉన్నారు. భూములు పోయిన వారికి తప్ప భూమిపై ఆధారపడిన వ్యవసాయ కార్మికులకు, ఇతర పేదలకు పునరావాసం అందలేదు. భోగాపురం ఎయిర్‌పోర్టు, విశాఖ పెట్రో కారిడార్‌, వంశధార, మల్లవల్లి ఇండిస్టియల్‌ పార్క్‌, రాజధాని, ఏర్పేడు, ఐఐటి, గండికోట ప్రాజెక్ట్‌, ఎన్‌.పి కుంట, శకునాల, వలిగొండ మొదలగు ప్రాజెక్టుల కింద లక్షలాది ఎకరాల భూమిని పేదల నుండి బలవంతంగా లాక్కున్నారు. ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. పరిహారం చెల్లించలేదు, హైకోర్టు తీర్పును అమలు చేయలేదు.
కోర్టు తీర్పు వెలువడి రెండున్నర సంవత్సరాలు గడిచినా మన రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. లీగల్‌సెల్‌ అథారిటీ అధికారులను, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులను పిలిచి సమావేశపరిచినా అధికారులు సమావేశాలకు (కోర్టుకు) రాకుండా తప్పించుకుంటున్నారు. తిరిగి కోర్టు ధిక్కరణ కింద హైకోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి రానీయకుండా...తక్షణమే పిల్‌ నెం 191 ప్రకారం హైకోర్టు తీర్పును అమలు చేసి నిర్వాసితులకు పరిహారం అందించాలి.
                వి. వెంకటేశ్వర్లు వి. వెంకటేశ్వర్లు / వ్యాసకర్త ఏ.పి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి/