కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించడం దారుణం. దీనికి నిధుల కొరతను కారణంగా చూపడం అర్ధరహితం. కరోనా ప్రభావం నుండి కోలుకోవడానికి బడ్జెట్‌లో 13 శాతం మొత్తాన్ని కేంద్రం కేటాయించింది. అధికారిక సమాచారం ప్రకారమే ఇందులో 1.3 శాతం మాత్రమే పేదలకు దక్కింది. 90 శాతం మొత్తాన్ని రకరకాల పేర్లతో సంపన్నులకు పంపిణీ చేశారు. పేదలకు ఇవ్వడానికైతే సొమ్ము ఉండదా? సంపన్నులకు దోచి పెట్టడానికి మాత్రం ఎంతైనా ఉంటుందా? కోవిడ్ వల్ల చనిపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించడం అంటే సహాయాన్ని పరిమితం చేయడమేనని కేంద్రం వాదిస్తోంది. కానీ, నిజానికి కేంద్రం చేస్తున్నదేమిటి? అంతకన్నా తక్కువగా వేళ్లపై లెక్కపెట్టగల కార్పొరేట్లకు మాత్రమే పరిమితం చేయడం కదా? గత ఏడాది మాఫీ చేసిన బ్యాంకు అప్పులు రూ. 1.53 లక్షల కోట్లు పట్టుమని పది మంది కార్పొరేట్లకే! సాయం అందాల్సింది ఎవరికి? అందుతున్నదెవరికి? మరణించిన కుటుంబాల్లోని పేదలకు, బతికి ఉన్న కుటుంబాల్లోని పేదలకు పోటీ పెట్టి వాదిస్తూ, కార్పొరేట్లకు మాత్రం దోచిపెడుతోంది. అదే సమయంలో పేదలపై మరింతగా భారాలు మోపుతోంది. ఇంతకన్నా క్రూరత్వం మరొకటి ఉంటుందా!
సంక్షోభం నుండి బయట పడాలంటే నేరుగా పేదలకు నగదు బదిలీ చేయాలని ఐఎంఎఫ్ తో సహా అందరూ అంగీకరిస్తున్నారు. కానీ నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు పెట్రో ధరలు పెంచుతూ పేదల దగ్గర ఉన్న అరకొర నగదును కూడా వెనక్కి గుంజుకుంటోంది. రుణాల ఆశ చూపి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆస్తిపన్ను, చెత్త పన్ను పెంచేలా ఒత్తిడి చేయడం కూడ సామాన్యులపై భారం మోపేదే! ఎడా పెడా పన్నులు పెంచడమే కాదు. పేదల సంఖ్యను తగ్గించి చూపుతున్నారు. 2004లో అర్జున్ సేన్ గుప్తా కమిటీ దేశ జనాభాలో 77 శాతం మంది పేదలున్నారని చెప్పినప్పటి నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 2013లో 131 దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం పేదరిక నిర్మూలనలో మన దేశం 99వ స్థానంలోనూ, బ్రిక్స్ దేశాల్లో చిట్టచివర్లోనూ నిలిచింది. 1972-73 తరువాత మొట్టమొదటిసారి తలసరి వినియోగం 2017లో తగ్గింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 'తీవ్ర ఆకలి' ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరింది. ఆరోగ్య సూచికల్లో పోషకాహార లేమి అతి పెద్ద సమస్యగా ముందుకు వచ్చింది. బంగ్లాదేశ్ సైతం మన దేశాన్ని అధిగమించింది. నోట్ల రద్దు, ఆ వెంటనే విరుచుకుపడిన కరోనా దేశంలో పేదరికాన్ని మరింతగా పెంచాయి. అయితే, పాలకులు మాత్రం 27 కోట్ల మందిని పేదరికం నుండి బటయ పడేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ప్రపంచబ్యాంకుకు చెందిన ప్యూ రీసెర్చి సెంటర్ రెండు డాలర్ల కన్నా తక్కువ ఆదాయం వస్తున్న వారి సంఖ్య ఒక్క 2020 లోనే ఆరు కోట్ల నుండి 13.4 కోట్లకు పెరిగినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం...24 కోట్ల మంది అధిక ధరలకు వ్యాక్సిన్ కొనుక్కోగలరని అంచనా వేసి, ఆ మేరకు అనుమతులివ్వడం ఎంత దుర్మార్గం? దేశంలో ఉన్నతాదాయ, ఉన్నత మధ్య తరగతి, మధ్యతరగతి వారందరిని కలిపినా ప్యూ రీసెర్చి సెంటర్ అధ్యయనం ప్రకారం 8.4 కోట్ల మందే! మరి 24 కోట్ల మంది ఎక్కడి నుండి వచ్చారు? పేదలకు మరో మార్గం లేకుండా చేసి వ్యాక్సిన్ కొని తీరాల్సిన పరిస్థితులు కల్పించడమే కదా! ఇంతకన్నా అమానవీయం ఎక్కడన్నా ఉంటుందా?
కరోనా కష్టకాలంలో క్రార్పొరేట్ల ఆదాయం పెరిగిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 నుండి 17 శాతం ప్రైవేటు ఆసుపత్రులు అదనంగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేసింది. దేశ సంపద ఎటువైపు ప్రయాణం చేస్తోందో, ఎవరికి లబ్ధి కలుగుతోందో అర్ధం కావడం లేదా? ఈ పరిస్థితి మారాలి. ప్రజల కష్టార్జితం ప్రజలకే చెందాలి. కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో పాటు, పేదలకు నగదు బదిలీ, శ్రామికులకు కనీస వేతనాల పెంపు, ఉపాధి హామీ పనిదినాల రెట్టింపు వంటి చర్యలు అమలు చేసి తీరాల్సిందే. ఈ చర్యలు ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు దోహదపడతాయి. వీటిని డిమాండ్ చేయడం, సాధించుకోవడం ప్రజల హక్కు! దయాధర్మం ఎంత మాత్రం కాదు.










