Aug 12,2023 22:31

ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటున్న సిపిఎం నాయకులు

      బత్తలపల్లి : ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ఏళ్ల తరబడి నివసిస్తున్న వారి గృహాలను ఎలా కూల్చివేస్తారంటూ సిపిఎం నాయకులు ప్రశ్నించారు. తాడిమర్రిలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చివేస్తుండగా సిపిఎం నాయకులు శనివారం నాడు అడ్డుకున్నారు. జెసిబిలకు అడ్డుపడి నిరసన తెలిపారు. అక్కడే ఉన్న పోలీసులు సిపిఎం నాయకులను బలవంతంగా పక్కకు లాగిపడేశారు. అయినా నాయకులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ తాడిమర్రిలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆర్‌అండ్‌బి అధికారులు గృహ యజమానులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే తొలగించేస్తుండడం అన్యాయం అన్నారు. ప్రభుత్వం నుంచి బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు. గ్రామసభలు నిర్వహించకుండా ఇళ్లు కూల్చివేయడం నిబంధనలకు విరుద్ధమే అవుతుందని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించి, ఒక వేళ కూల్చివేత తప్పనిసరి అయితే బాధితులకు ఆ ఆస్తి విలువను బట్టి పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. అలాకాకుండా ఏకపక్షంగా ఇళ్లను తొలగించడం అన్యాయం అన్నారు. రోడ్డు వెడల్పులో ఇళ్లను కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి, పక్కాగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం ఆధ్వర్యంలో వారిపక్షాన పోరాటం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెనుగొండ పెద్దన్న, కౌలు రైతుసంఘం నాయకులు కదిరప్ప, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నామాల నాగార్జున, తాడిమర్రి సిపిఎం నాయకులు నారాయణ, రైతు సంఘం నాయకులు పోతలయ్య బాధితులు పాల్గొన్నారు.