Aug 23,2023 21:58

నిర్వాసితుల సమస్యే అత్యంత ప్రధానం
ప్రాణాలు అరచేత పట్టుకుని నిర్వాసితులు జీవనం
ప్రశ్నార్థకంగా డ్యామ్‌ భద్రత
పోలవరంలో మొదటి ముద్దాయి మోడీ ప్రభుత్వమే
సిపిఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి - ఏలూరుప్రతినిధి, అర్బన్‌

పోలవరం ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించినప్పుడే ప్రాజెక్టు పూర్తయినట్లని, నిర్వాసితులకు పరిహారం అందించకుండా గోదావరిలో ముంచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు తెలిపారు. 'రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి' అనే నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చేపట్టిన బస్సుయాత్ర బుధవారం ఏలూరు చేరుకుంది. స్థానిక ఆశ్రం ఆసుపత్రి వద్ద బస్సుయాత్రకు ఆ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక టుబాకో మర్చంట్స్‌ కళ్యాణ మండపంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, టిడిపి నేత, పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ, ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అధ్యక్షత వహించారు. తొలుత సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య నేతలను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు ఇప్పటి వరకూ 22 శాతం మాత్రమే పరిహారం అందించారన్నారు. డ్యామ్‌ మాత్రం 70 శాతం పూర్తి చేశారన్నారు. సిఎం జగన్‌ కేంద్రంపై ఒత్తిడి చేసి నిధులు రాబట్టకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రాజెక్టు డ్యామ్‌ భద్రత ప్రమాదంలో పడిందని, ప్రపంచస్థాయి నిపుణులతో తనిఖీ చేయించి నష్టపరిహారాన్ని కాంట్రాక్టర్ల వద్ద వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యంలో తొలిముద్దాయి మోడీ ప్రభుత్వమే అని విమర్శించారు. మోడీ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ పనికిమాలిన ప్రధానిగా ఉన్నందుకు ప్రతి భారతీయుడూ సిగ్గుపడాలన్నారు. జగన్‌ను మోడీ కాపాడుతున్నారని, ఆ ధైర్యంతోనే ఇక్కడ వైసిపి నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్నారు. నిర్వాసితులకు అండగా ఉండి అందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాజన్న రాజ్యం తెస్తానని మోడీ రాజ్యం తీసుకొచ్చిన ఘనుడు జగన్‌ అని ఎద్దేవా చేశారు. 41.15, 45.75 లెక్కలు ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించినవే కాదని, నిర్వాసితుల పరిహారానికి సంబంధించినవని తెలిపారు. ప్రస్తుతం ముంచుతున్నవి గోదావరి వరదలు కాదని, ప్రాజెక్టు నిర్మాణంతో వస్తున్న వరదలేనని అన్నారు. నిర్వాసితుల భూములకు ఇస్తామన్న రూ.ఐదు లక్షల పరిహారంలో ఐదుపైసలుగాని, పునరావాస ప్యాకేజీ రూ.పది లక్షల్లో పదిపైసలుగాని జగన్‌ ఇవ్వలేదన్నారు. వరదలొస్తే రూ.పది వేలు పరిహారం ఇవ్వకుండా రూ.రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు నిర్వాసితులకు అండగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోడీని నిధులు అడగడానికి భయపడుతుందన్నారు. కేంద్రం చెబుతున్న విద్యుత్‌, చెత్త వంటి అన్ని పన్నులు వేస్తున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి నిర్వాసితులను గోదావరిలో ముంచారన్నారు. నిర్వాసితుల త్యాగఫలితమే పోలవరం ప్రాజెక్టు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం రూ.15 వేల కోట్లు కేటాయిస్తే నాలుగేళ్లలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యి రాష్ట్రం సస్యశ్యామలమయ్యేదన్నారు. పోలవరం నిర్వాసితులు లక్షా ఆరు వేల కుటుంబాలుంటే కేవలం 20 వేల కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామనడం దుర్మార్గమన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి జగన్‌, పోలవరం ప్రాజెక్టుకు మోడీ శనిలా దాపురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా గిరిజనులు కొండలు, గుట్టలపై తల దాచుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి, ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో భవిష్యత్తులో కరువురహిత రాష్ట్రంగా ఎపి ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేస్తే వైసిపి ప్రభుత్వం కేవలం నాలుగు శాతం మాత్రమే పూర్తి చేసిందన్నారు. కనీసం 2030 నాటికి పూర్తవుతుందో లేదోనని రైతాంగం, ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయకుండా కాంట్రాక్టు ఏజెన్సీలను ఒక కలం పోటుతో రద్దు చేయడం పోలవరం జాప్యానికి ప్రధాన కారణమన్నారు. సామాజిక విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నీటికి రాజకీయరంగు పులమాల్సిన అవసరం లేదన్నారు. నీటితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే అన్ని రంగాలకూ ఉపయోగమని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సర్వం త్యాగం చేసిన నిర్వాసితులే తొలి లబ్ధిదారులుగా ఉండాలన్నారు. మోడీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జగన్‌ అనాలోచిత విధానాల ఫలితంగా మట్టి రాతి కట్టడం, డ్యామ్‌ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చి రూ.235 కోట్లు ఆదా చేశానన్న సిఎం జగన్‌ రూ.2335 కోట్లు అదనంగా ప్రతిపాదించి కాంట్రాక్టర్‌ను నియమించి రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచారన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదిత డిజైన్‌ 45.72 నుండి 41.15 కుదించి నిర్మించడం సరికాదన్నారు. రాజకీయ నాయకులు ఐక్యంగా పోరాడితేనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఎప్పుడు ఖాళీ చేయిస్తే అప్పటివరకూ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని పరిహారం చెల్లించాలన్నారు. బిజెపితో అంటకాగే పార్టీలన్నింటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాడుతున్న అన్ని పార్టీలకూ తమ మద్దతు ఉంటుందన్నారు. జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడానికి ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలపై నిలదీయలేని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం మన దౌర్భాగ్యమన్నారు. వైసిపి, బిజెపి మినహా అన్నిపార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌ వందన సమర్పణ చేశారు. తొలుత ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్‌, రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌.పెంచలయ్య, ఏలూరు ఏరియా కార్యదర్శి తమ్మా విశ్వేశ్వరరావు ఇతర కళాకారులు ఆలపించిన గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకుడు డిఎన్‌విడి ప్రసాద్‌, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, కొండేటి బేబి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం:రాష్ట్రంలో జగన్‌, దేశంలో మోడీలను తరిమికొట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. 'రాష్ట్రాన్ని రక్షించండి - దేశాన్ని కాపాడండి' నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బుధవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం చేరింది. ఈ సందర్భంగా జెపి సెంటర్‌లో జరిగిన బహిరంగసభకు సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ 922 రోజులుగా 33 కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా ప్రధాని మోడీ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్‌ దుర్మార్గ విధానాలతో అస్తవ్యస్త పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుండి తన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టి ప్రశ్నించే గొంతుకలను జిఒ నెం.1 అడ్డుపెట్టుకుని అణిచేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో అభివృద్ధిని నిర్వీర్యం చేశారన్నారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, జగన్‌ అనాలోచిత విధానాలకు గుంతలు పడిన రహదారులే నిదర్శనమని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులను నిండా ముంచారన్నారు. కేంద్రం సహకరిస్తేనే తాను పోలవరం నిర్వాసితులకు పరిహారం అందిస్తానని చెప్పడం తన అసమర్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో జగన్‌, కేంద్రంలో మోడీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బస్సు యాత్ర ముగింపు సందర్భంగా సెప్టెంబర్‌ 8న తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ సిఎం జగన్‌ తన స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మిక వర్గానికి తీరని ద్రోహం తలపెట్టారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, సభకు అధ్యక్షత వహించిన కృష్ణ చైతన్య మాట్లాడారు. సభలో నేతలు జయలక్ష్మి, పరుచూరి రాజేంద్ర, నక్కి లెనిన్‌బాబు, పెంచలయ్య, చంద్రనాయక్‌, ఆర్‌.పిచ్చయ్య, మహంకాళి సుబ్బారావు, బండి వెంకటేశ్వరరావు, దారయ్య, జెవి.రమణరాజు, రాము, జమ్మి శ్రీనివాసరావు, టివిఎస్‌.రాజు, గోలిమే బాలయేసు, మైసాక్షి వెంకటాచారి, గురవయ్య పాల్గొన్నారు.