ఒక వైపు అంతుబట్టని తెగుళ్లు, వైరస్‌లు ఇంకో వైపు నకిలీ, కల్తీ విత్తనాలు ఖరీఫ్ రైతు ఉసురు తీసుకున్నాయి. రాష్ట్రంలో సాగయ్యే రెండు ప్రధాన వాణిజ్య పంటలు మిరప, పత్తి రైతాంగం ఆసాంతం పెట్టిన పెట్టుబడులు కోల్పోయి ప్రభుత్వ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నష్టాలకు అప్పుడే పరిహారం అంటున్న సర్కారు మిర్చి, పత్తి విషయంలో నాన్చుడు దారి పట్టి రైతులను క్షోభకు గురి చేస్తోంది. తామర తెగులు సోకి మిర్చి, నకిలీ విత్తనాల వలన పత్తికి నష్టం వాటిల్లగా, ఈ నష్టాలకు ప్రభుత్వ పూచీ ఏమిటో ఇప్పటికైతే స్పష్టత లేదు. మిర్చి నష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం వేసుకొని తప్పించుకోగా, నకిలీ విత్తనాలమ్మి పత్తి నష్టాలకు కారణమైన సీడ్ కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వం ఈగ వాలనీయట్లేదు. వివిధ కారణాలతో పంట నష్ట పోయిన రైతులకు తక్షణం పరిహారం అందించి ఆసరా కల్పించాల్సిన సర్కారే సాకులు చెప్పి పరిహాసం ఆడటం అమానవీయం. పరిహారంపై రైతులకు కనీసం భరోసా సైతం కల్పించకపోవడం అన్యాయం. ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన మిర్చి, పత్తి రైతులు రోడ్డెక్కుతున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం చుక్కాని లేని నావలా తయారవగా వాణిజ్య పంటల సాగు జూదాన్ని తలదన్నింది. మునుపటి ఏడాది మిర్చికి కాస్త రేటు పడటంతో ఖరీఫ్‌లో రైతులు అటు మళ్లారు. రికార్డు స్థాయిలో 4.64 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. తామర తెగులు లక్షల ఎకరాల్లో పంటను కబళించింది. కోత ఖర్చులూ రాక పంటను దున్నేసిన దృశ్యాలనేకం. ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి అయింది. కౌలు రైతులకైతే లక్షన్నర. పెట్టుబడులు పూర్తిగా నష్టపోయిన రైతులు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిర్చికి తామర తెగులు పలు రాష్ట్రాల్లో వ్యాపించినందున జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాల్సిన కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్రం కేంద్రాన్ని నిలదీయకుండా లేఖలతో సరిపెట్టింది. వీరిద్దరి మధ్య రైతులు సమిధలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమైనా మిర్చి రైతులను ఆదుకుందా అంటే అదీ లేదు. అధ్యయన కమిటీల పేరుతో కాలక్షేపం చేసింది. నవంబర్ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు స్వల్ప విస్తీర్ణానికి పదో పరకో ఇచ్చి చేతులు దులిపేసుకుంది. బీమా అంటోంది. ఎంత మందికి ఎంత మొత్తంలో ఎప్పటికి ఇన్సూరెన్స్ వస్తుందో పెద్ద పజిల్.
పత్తి రైతుల గోడు చెప్పనలవి కాదు. కావేరి కంపెనీ విక్రయించిన 'జాదు' పత్తి విత్తనాలు చాలా చోట్ల విఫలమయ్యాయి. సగటున ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా రెండు క్వింటాళ్ల లోపు, అదీ గుడ్డి పత్తి వచ్చింది. కర్నూలులో 7,800 ఎకరాల్లో వేసిన జాదు విత్తనాల్లో నకిలీ కారణంగా పంట రాలేదని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. 2007 సీడ్ యాక్ట్ ప్రకారం ఎకరాకు రూ.23 వేల పరిహారం ఇవ్వాలని వ్యవసాయశాఖ జిల్లా కమిటీ ఆదేశించింది కూడా. వాతావరణ పరిస్థితులు, ఇతర సాంకేతిక కారణాలు చూపి సీడ్ కంపెనీ హైకోర్టుకెళ్లింది. సీడ్ యాక్ట్ ప్రకారం సకాలంలో ప్రభుత్వం స్పందించి ఉన్నట్లయితే న్యాయ పరమైన చిక్కులు వచ్చేవి కావు. నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాల వలన పంట నష్టపోయిన రైతులకు కంపెనీల నుండి పరిహారం ఇప్పించేందుకు 2011లో ప్రభుత్వం ఇచ్చిన జీవో పైనా ఇలాగే కంపెనీలు కోర్టుకెళ్లాయి. ఇక్కడా ప్రభుత్వ స్పందన లేదు. దాంతో ప్రభుత్వం కంపెనీలకు అనుకూలంగా ఉందనే భావన కలుగుతోంది. కర్నూలులోనే 30-40 వేల ఎకరాల్లో జాదు సీడ్స్ ఫెయిలయ్యాయి. గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కడప లోనూ 'జాదు'పై ఆరోపణలొచ్చాయి. అనుమతుల్లేని బిటి-3 పత్తి విత్తనాలతో రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానిది ఉపేక్షే. నకిలీ మిర్చి నారు, మిర్చి విత్తనాలతో రైతులు నష్టపోయారు. ఇంతా జరుగుతున్నా ఆర్‌బికెలు, గ్రామ సచివాలయాలు, ఇంటెలిజెన్స్, పోలీస్, వ్యవసాయ శాఖలు ఏం చేస్తున్నాయో తెలీదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు తీరిగ్గా ఇప్పుడు సీడ్ యాక్ట్ అంటోంది సర్కారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. నష్టపోయిన మిర్చి, పత్తి రైతులను సత్వరం ఆదుకోవాలి.










