Jul 05,2023 21:30

సమావేశంలో మాట్లాడుతున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి : జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించి నిర్వాసితులకు రూ.79.75 కోట్ల భూ పరిహారం పంపిణీ వేగంగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆర్‌డిఒలు, తహశీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారులకు సంబంధించి నిర్వా సితులకు పరిహారం చెల్లింపు, పెండింగ్‌ భూసేకరణ అంశాలపై సంబంధిత ఆర్డీఓలు, తాసిల్దార్లు, ఎన్‌హెచ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ 716 కడప నుండి రేణిగుంట జాతీయ రహదారికి సంబంధించి మొత్తం భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని, భూసేకరణ పరిహారం మొత్తం రూ.98 కోట్లు చెల్లింపు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.73 కోట్లు చెల్లించారని ఇంకనూ రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఎన్‌హెచ్‌్‌ 440 రాయచోటి-వేంపల్లికి సంబంధించి రూ.33 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.20 కోట్లు చెల్లించడం జరిగిందని, ఇంకను రూ. 13 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఎన్‌హెచ్‌ 71 మదనపల్లి నుండి పీలేరుకు సంబంధించి ఇంకనూ రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. అదేవిధంగా ఎన్‌హెచ్‌ 42 మదనపల్లి నుండి మొలకలచెరువుకు సంబంధించి 12 హెక్టార్ల భూసేకరణ పెండింగ్లో ఉందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇంకనూ రూ.20 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలకు సంబంధించి లెవెల్‌ క్రాసింగ్‌ 119 లో భూ సేకరణ పూర్తి చేశారని, ఇందులో ఇంకను రూ.1.75 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. లెవెల్‌ క్రాసింగ్‌ 120లో ఇంకను 0.24 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉందని త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని రాయచోటి ఆర్‌డిఒను ఆదేశించారు. లెవెల్‌ క్రాసింగ్‌ 95కు సంబంధించి సిటిఎం గ్రామంలో భూసేకరణ త్వరితగతిని పూర్తి చేయాలని మదనపల్లి ఆర్‌డిఒను ఆదేశించారు. జిల్లా మొత్తంగా జాతీయ రహదారుల అంశానికి సంబంధించి పరిహారం చెల్లింపులలో 65 శాతం మేర ప్రగతి సాధించారని, వచ్చే వారంలోగా 80 శాతం ప్రగతిని తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు. ఇంకను పెండింగ్‌ ఉన్న భూసేకరణను త్వరితగతిని పూర్తి చేయాలని తాసిల్దార్లను ఆదేశించారు. భూసేకరణను ఆర్‌డిఒలు స్వయంగా పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. అనంతరం ప్రాజెక్టు వారీగా సాధించిన ప్రగతి, పరిహారం చెల్లింపు, కోర్టు కేసులు, పెండింగ్‌ ఫైల్స్‌ తదితర అంశాలను సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, మదనపల్లి ఆర్‌డిఒలు రంగస్వామి, మురళి, ఎన్‌హెచ్‌ అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.