Jul 25,2023 22:36

అదనపు పరిహారం కోసం కొత్తూరులో బైక్‌ ర్యాలీ చేస్తున్న నిర్వాసితులు (ఫైల్‌)

*గతేడాది జూన్‌ 6న నిధుల విడుదల ఉత్తర్వులు
*నేటికీ వేలాది మందికి జమ కాని సొమ్ములు
*జిల్లాలో రూ.68.12 కోట్లు పెండింగ్‌
*డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి :
వంశధార నిర్వాసితులకు ఎక్స్‌గ్రేషియో చెల్లింపుల్లో ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోంది. పరిహారం చెల్లింపులపై ఉత్తర్వులు వెలువరించి ఏడాది దాటినా, వేలాది మందికి నేటికీ డబ్బులు జమ కాలేదు. వంశధార ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఎకరాకు రూ.లక్ష చెల్లించనున్నట్లు తెలిపింది. పిడిఎఫ్‌ కుటుంబానికి రూ.లక్ష, యూత్‌ ప్యాకేజీ కింద రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలిపింది. అందులో కొందరికి డబ్బులు వచ్చినా, మరికొంత మందికి పరిహారం సొమ్ము ముట్టలేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
వంశధార నిర్వాసితులకు భూసేకరణ చట్టం 2013 అమలు హామీని నెరవేర్చని ప్రభుత్వం, చివరకు ఎక్స్‌గ్రేషియో చెల్లింపులోనూ మాట తప్పింది. గతేడాది జూన్‌ ఆరో తేదీన జిఒ నంబరు 1632 విడుదల చేసి, రూ.216.71 కోట్లను విడుదల చేసింది. ఇందులో భూములకు ఎక్స్‌గ్రేషియో కింద 15,571 మంది రైతులకు 9,580 ఎకరాల కోసం రూ.95.80 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 7,103 పిడిఎఫ్‌ కుటుంబాలు, 4,988 మందికి యూత్‌ ప్యాకేజీలు కలిపి మొత్తం 12091 మందికి రూ.120.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు భూములకు సంబంధించి 12,291 మంది రైతులకు 6048 ఎకరాలకు గానూ రూ.60.48 కోట్లు ఇచ్చారు. ఇంకా 3,280 మంది రైతులకు 3,532 ఎకరాలకు రూ.35.32 కోట్లు పెండింగ్‌లో ఉంది. పిడిఎఫ్‌, యూత్‌ ప్యాకేజీల కోసం ఇప్పటివరకు 8,811 మందికి రూ.88.11 కోట్లు చెల్లించారు. పిడిఎఫ్‌ కుటుంబాల్లో 3,280 మందికి రూ.32.80 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నిర్వాసితులకు మొత్తం మీద రూ.216.71 కోట్లకు గానూ రూ.148.59 కోట్లు చెల్లించింది. ఇంకా రూ.68.12 కోట్ల బకాయిలు ఉన్నాయి.

నిధులు విడుదల చేయకపోవడం వల్లే...
నిర్వాసితులకు ఎక్స్‌గ్రేషియో చెల్లింపులో ప్రభుత్వం మభ్యపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు డబ్బులు రాలేదని అడుగుతున్న నిర్వాసితులకు, రిజర్వు బ్యాంకుకు డబ్బులు వివరాలు పంపామని త్వరలోనే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయంటూ రెవెన్యూ అధికారులు బదులిస్తున్నారు. వలస వెళ్లిన కుటుంబాల చిరునామాలు తెలియకే డబ్బులు వేయలేకపోయామంటూ వారి బంధువులకు చెప్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

తిరిగి తిరిగి విసిగిపోయాం
మా కుటుంబంలో నలుగురికి అదనపు పరిహారం డబ్బులు రాలేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, భూములకు పరిహారంగా రూ.ఐదు లక్షల పైన రావాల్సి ఉండగా, రూ.లక్ష మాత్రమే వచ్చింది. కలెక్టరేట్‌కు ఎన్నిసార్లు వెళ్లామో తెలియదు. స్పందనలోనూ వినతిపత్రాలు ఇచ్చాం. జగనన్నకు చెబుదాంలో ఫిర్యాదు చేస్తే, ఆర్‌బిఐలో పెండింగ్‌ ఉందని బదులిచ్చారు. అసలు డబ్బులు వస్తాయో లేదో తెలియడం లేదు.
- గొట్టా గోవిందరావు, మెట్టూరు బిట్‌-3

అప్పుల పాలయ్యాం
మా ఇద్దరి అబ్బాయిల్లో ఒకరికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వస్తే, ఒకరికి ప్యాకేజీ, భూమి రెండింటికీ డబ్బులు రాలేదు. నాకున్న 2.40 ఎకరాల భూమికి రావాల్సిన సొమ్మూ ఇవ్వలేదు. కలెక్టరేట్‌కు ఎన్నిసార్లు తిరిగానో లెక్కలేదు. రేపుమాపు అంటున్నారు. డబ్బులు ఇస్తారని అయిన కాడికి అప్పులు చేసి తీర్చలేక అప్పులపాలయ్యాం.
- గులివిందల ప్రమీల, మెట్టూరు బిట్‌-3

అదనపు పరిహారం చెల్లింపులకు చర్యలు చేపట్టాలి
వంశధార నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్యాకేజీ డబ్బులను సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. అధికారంలోకొస్తే 2013 భూసేకరణ చట్టం పరిహారం ఇస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాట తప్పారు. నిర్వాసితులకు సంబంధించి యూత్‌ ప్యాకేజీ, అర్హులైన వారసులకు ఇళ్లస్థలాలు, డి-పట్టా భూములకు చెల్లింపులు వంటి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారంతో పాటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అదనపు పరిహారం డబ్బులను వెంటనే చెల్లించాలి.
- గంగరాపు సింహాచలం,
నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి