Jul 26,2023 22:28

రైతులతో మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి- పొందూరు: మడ్డువలస కాలువ పనులకు సంబంధించి తాము కోల్పోయిన భూములకు ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం పరిహారాన్ని చెల్లించిన తరువాతనే పనులను చేపట్టాలని, లేకుంటే పనులను అడ్డుకుంటామని వి.ఆర్‌.గూడెం, వావిలపల్లిపేట, నరసాపురం గ్రామాల రైతులు అధికారులకు తెలియజేశారు. మండలంలోని మడ్డువలస ఫేజ్‌-2 కాలువ పనులను అడ్డుకుంటున్న ఆయా గ్రామాల రైతులతో రెవెన్యూ, మడ్డువలస కాలువ, భూసేకరణ అధికారులు బుధవారం పొందూరులో సమావేశాన్ని నిర్వహించారు. మడ్డువలస కాలువ తవ్వకాలకు సంబంధించి తమకు ఇచ్చిన పరిహారం చాలా తక్కువని, దానిని పెంచాలని, లేకుంటే పనులు అడ్డుకుంటామని నరసాపురం రైతులు అధికారులకు తెలియజేశారు. ఒకసారి పరిహారం చెల్లించిన తరువాత మరలా దానిని పెంచడం జరగదని, దీనిపై నిర్ణయం తీసుకునే అధికారులకు ఉండదని ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ పప్పల వేణుగోపాలం, మడ్డువలన డిఇ నాగేశ్వరరావులు రైతులకు తెలియజేశారు. అలాగే వి.ఆర్‌.గూడెంలో పది మంది రైతులకు, వావిలపల్లిపేటలో ఐదుగురు రైతులకు పరిహారం అందకపోవడంతో అక్కడా పనులను రైతులు అడ్డుకున్నారు. ఆయా గ్రామాల రైతులను కలిసి నచ్చజెప్పేం దుకు అధికారులు ప్రయత్నం చేసినా వారు అంగీకరించ లేదు. పరిహారం చెల్లిస్తేనే పనులు జరగనిస్తామని, లేకుంటే అడ్డుకుంటామని అధికారులకు రైతులు తెలియజేశారు.