ప్రజాశక్తి-రామభద్రపురం : నష్ట పరిహారం చెల్లించాకే పక్కా నిర్మాణాలు తొలగిస్తామని ఆర్‌డిఒ శేషశైలజ తెలిపారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ రహదారి విస్తరణలో పక్కా ఇళ్లు, నిర్మాణాలు కోల్పోతున్న తారాపురం నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారి -26 విస్తరణ పనుల్లో భాగంగా సాలూరు బైపాస్ జంక్షన్ నుంచి దత్తిరాజేరు మండల పరిధిలోని మానాపురం రైల్వేగేట్ వరకు మూకాంబికా కనస్ట్రక్షన్స్ ద్వారా చేపట్టిన పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని చెప్పారు. మధ్యలో తారాపురానికి చెందిన పక్కా ఇళ్లు, జిరాయతీ, వ్యాపార స్థలాలు ఉండడంతో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అభ్యంతరాలుంటే తెలియపరచాలని కోరారు. సొంత స్థలంలో 60 శాతం పైబడి ఇళ్లను, జిరాయతీ స్థలాలను కోల్పోతున్న వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు మూడు రెట్లు నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటిం చారు. అనంతరం సమగ్ర భూసర్వేపై విఆర్‌ఒలతో సమీక్షించారు. రొంపల్లి, కొట్టక్కి గ్రామాల వారు వెంటనే రికార్డులను అప్పచెప్పాలని విఆర్‌ఒలను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రాజారావు, తారాపురం నాయకులు బెవర సీతారాం, బెవర చిన్నారావు, కలగర్ల ప్రసాద్, గంగునాయుడు, తిరుపతిరావు పాల్గొన్నారు.










