ఓ పాత తెలుగు సినిమాలో హాస్య నటుడు బాబూమోహన్ ఎప్పుడు? ఏమిటి? ఎందుకు? ఎలా? అని ప్రశ్నిస్తూ చిత్రవిచిత్రమైన డైలాగులు చెబుతూ ఉంటాడు. అవి ఆ పాత్రకు మాత్రమే సంబంధించిన డైలాగులు కాదు. అవి అందరికీ సంబంధించిన ప్రశ్నలు. ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో ఎప్పుడు? ఏమిటి? ఎందుకు? ఎలా? అని ప్రశ్నిస్తూ పోతే ఈ సమాజంలో జరిగే అనేక అనర్థాలు, అపోహలు, మూఢనమ్మకాలు నశిస్తాయి. గౌతమ బుద్ధుడు దాదాపు 2500 సంవత్సరాల క్రితమే ఈ కింది నియమాలు ప్రబోధించాడు. 'ఏదైనా విషయాన్ని నీవు విన్న వెంటనే నమ్మొద్దు. చాలామంది దాని గురించి మాట్లాడుతూ ప్రచారం చేశారు కాబట్టి...ఆ విషయాన్ని నువ్వు నమ్మాలనే నియమం ఏమీ లేదు. ఏదైనా విషయాన్ని పెద్దలు చెప్పారు. గురువులు చెప్పారు కదా అని నీవు విధిగా నమ్మవలసిన పని లేదు. ఏదైనా విషయాన్ని తరతరాలుగా సంప్రదాయంగా వస్తోంది కనుక దానిని నమ్మాలనుకోవద్దు. ఆ విషయాలను కూలంకశంగా పరిశీలించి, వివరాలు తెలుసుకుని, నిజానికి దగ్గరగా ఉంది. ఆ విషయం చాలా మందికి మంచి చేస్తుంది అని భావిస్తే అప్పుడు దానిని నమ్మాలి' అని పేర్కొన్నాడు.
కానీ ఇప్పటికీ ప్రజలలో ఈ విధానం ఆచరణ లోకి రాలేదు. శాస్త్రీయ సాంకేతిక ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. కానీ భారత పౌరులుగా శాస్త్రీయంగా ఆలోచించడంలో, నడుచుకోవడంలో మనం పూర్తిగా వెనుకబడి ఉన్నాం. ఈ అభివృద్ధి చెందిన యుగంలో కూడా మన దేశంలో చాలా మంది ప్రజలకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు. అవగాహన రాహిత్యం వల్ల అమూల్యమైన ప్రకృతి సంపదను వృధా చేస్తున్నాం. మతపరమైన సాంస్కృతిక పరమైన అపోహలు, అసహనం ముమ్మరంగా ప్రసారం అవుతున్నాయి. ఎందుకు అని ప్రశ్నించడం మర్చిపోయి చాలా విషయాలను గుడ్డిగా నమ్ముతున్నార. టీవీ కార్యక్రమాలు దీనికి వంత పాడుతున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో 'ఎద్దు ఈనింది' అంటే 'గాట్లో కట్టేయి' అనే స్థితికి (ముఖ్యంగా చదువుకున్న వారు) చేరుకుంటున్నారు. ఇప్పుడు వాడే యంత్రాలు, పరికరాలు అన్నీ వేల సంవత్సరాల నుండి ఉన్నాయని చెబుతూ, పురాణాలలో మత గ్రంథాలలో ఉన్న కల్పనలను నిజాలని భ్రమింపజేస్తూ, అదే మన చరిత్ర అని అందరినీ నమ్మించేటందుకు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. దేశంలో ప్రముఖ స్థానంలో ఉండే నాయకులు దీనికి వంత పాడుతున్నారు.
ఏకంగా ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరో అడుగు ముందుకు వేసి మత గ్రంథంలో ప్రస్తావించినట్టు కుండలో బిడ్డలు పుట్టడం టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీకి ఉదాహరణ అని చెప్పడం అత్యంత శోచనీయం. సాంకేతిక రంగంలో అత్యంత ప్రగతి అని భావించదగిన డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని పాఠశాలలో బోధించ కూడదని కొందరు జాతీయ నాయకులు నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో ఏది నిజం ఏది అబద్ధం అనేది కనుక్కోవడం ఎలా? ఏది వాస్తవం ఏది అపోహ నిర్ణయించడం ఎలా? ఏది నిజమైన వార్త ఏది అశాస్త్రీయ వార్త తెలుసుకోవడం ఎలా? ఇందుకు మనకు శాస్త్రీయ దక్పథం (సైంటిఫిక్ టెంపర్) అవసరం. శాస్త్రీయ దృక్పథం అలవడితే మన ఆలోచనా పరిధి విస్తృతం అవుతుంది.
శాస్త్రీయ దృక్పథం అంటే...ప్రకృతిని, సమాజాన్ని శాస్త్రీయ పద్ధతులలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. శాస్త్రీయ పద్ధతులు అంటే ప్రయోగ పూర్వకంగా అర్థం చేసుకోవడం, సాక్ష్యాధారాలు సేకరించడం. ముఖ్యంగా 'ఎందుకు?' అని ప్రశ్నించడం. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైల్లో ఉన్నప్పుడు నెహ్రూ మొట్టమొదట శాస్త్రీయ దక్పథం అన్న పదాన్ని వాడారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 (ఎ)లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 'ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, తద్వారా మానవతా వాదాన్ని, నూతన విషయాల పట్ల జిజ్ఞాసనూ సంస్కరణల పట్ల ఆసక్తిని అభివృద్ధి చేయాల'ని సూచించారు.
కానీ ఆచరణలో అది ఇప్పటి వరకు సాధ్యం కావడం లేదు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వైద్యుడు, సామాజిక కార్యకర్త, హేతువాది, రచయిత నరేంద్ర దభోల్కర్ శాస్త్రీయ దృక్పథాన్ని వివరిస్తూ 'ఏ మేరకు సాక్ష్యాధారాలు ఉన్నాయో ఆ మేరకు నమ్మడం' అని చెప్పారు. మహారాష్ట్రలో 'మహారాష్ట్ర అంధ శ్రద్ధ నిర్మూలన్' సమితిని స్థాపించి మూఢనమ్మకాలు, చేతబడి, బాణామతిని నిషేధించే చట్టం తేవాలని నిరంతరం పోరాడే క్రమంలో ముష్కరులు ఆయనను ఆగస్టు 20, 2013న హత్య చేశారు. ఆ మరుసటి రోజున మహారాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆపై చట్టం అయింది. ఇదే పంథాలో శాస్త్రీయ దృక్పథం కోసం పోరాడిన గౌరీ లంకేశ్, పన్సారే, కల్బుర్గి వంటి ప్రముఖ హేతువాదులను మత ఛాందసులు చంపివేశారు. తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజల్లో శాస్త్రీయ అవగాహనను పెంచే క్రమంలో నరేంద్ర దభోల్కర్ ప్రాణాలు కోల్పోయిన ఆగస్టు 20వ తేదీన 'శాస్త్రీయ దృక్పథపు దినోత్సవం' జరుపుకోవాలని దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రముఖులు నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సైతం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతూ మూఢనమ్మకాలను నిషేధిస్తూ చట్టం తేవాలని జన విజ్ఞాన వేదికతో పాటు మరికొన్ని సంస్థలు అనేక పోరాటాలు, కార్యక్రమాలు చేస్తున్నాయి.
(ఆగస్టు 20 జాతీయ శాస్త్రీయ దృక్పథపు దినోత్సవం)
* యుగంధర్ బాబు ( జనవిజ్ఞాన వేదిక ఎ.పి. రాష్ట్ర కమిటీ సభ్యులు)










