ప్రజాశక్తి-గుంటూరు:తెలుగు సాహిత్యంలో ఎన్నో రకాల వాదాలున్నప్పటికీ అంతిమంగా కవుల లక్ష్యం మంచితనం, మానవత్వమేనని సుప్రసిద్ధ కవి, ఆంధ్రప్రదేశ్ ముస్లిం రచయితల సంఘం వ్యవస్థాపకులు షేక్.కరీముల్లా పేర్కొన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం, డాక్టర్ పట్టాభి కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బ్రాడీపేటలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో శ్రీశ్రీ జయంతి-మేడే సందర్భంగా 'కవిమిత్రుల కలయిక- కవి సమ్మేళనం' కార్యక్రమం జరిగింది. కరీముల్లా మాట్లాడుతూ ప్రేమను, ప్రేమతత్వాన్ని మించిన గ్రంథం కానీ, మత గ్రంథం కానీ లేదన్నారు. నేడు సాహిత్యరంగంలో ప్రేమతత్వం కంటే ఇగోయిజమే ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ముక్కలవుతున్న సమాజాన్ని కలిపికుట్టాల్సిన సాహిత్యరంగమే దురదృష్టవశాత్తూ కులాలుగా మతాలుగా చీలిపోతున్న విపత్కర పరిస్థితుల్ని చూడాల్సివస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ తెలుగుభాష అంతరించిపోతున్న తరుణంలో కవులు, రచయితలు భాషకోసం ఉద్యమాలు చేయాల్సి వుందన్నారు. రచయిత, కవి డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ శ్రీశ్రీ అనే రెండక్షరాలు సమసమాజ నిర్మాణానికి ఎక్కుపెట్టిన రెండు బాణాలని, సమాజాన్ని నిరంతరం కాపలా కాసే రక్షణకవచాలు అన్నారు. కార్యమ్రంలో 'కాలంసాక్షిగా' షేక్ అబ్దుల్ హకీమ్ రాసిన అబాబీలు నూతన కవితా ప్రక్రియ పుస్తకాన్ని సుప్రసిద్ధ కవయిత్రి షేక్ బషీరున్నీసాబేగం సమీక్షించారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్, బండారు సురేష్, తదితరులు పాల్గొన్నారు.










