Feb 13,2022 09:18

'ప్రేమ' రెండు అక్షరాల పదం.. రెండు జీవితాల బంధం. మాటలు నేర్చిన దశ నుంచి మరణించే వరకూ, ఎవ్వరిని అడిగినా దీని గురించి గుక్కతిప్పుకోకుండా చెబుతారు. దీని పరిధి విశ్వమంత...! జగతిని నడిపే ప్రేమకు వయసే లేదు. ఘనమైన చరిత్ర ఉంది. మధురమైన వర్తమానం ఉంది. కాబట్టే ప్రేమకోసం ప్రాణాలు అర్పించేవారు కొందరు. పెద్దలను ఎదిరించి మరీ ఒక్కటయ్యే వారు మరికొందరు. అసలు ఈ సిద్ధాంతం ప్రేమకు సరిపోతుందని ఒకటి మనం చెప్పగలమా? ఎన్ని చెప్పుకున్నా ఇంకేదో కొత్తగానే ఉంటుంది. ''ప్రేమంటే కేవలం ప్రేయసీ, ప్రియులదే కాదు. మనల్ని ప్రేమించే కుటుంబానిదీ ప్రేమే'' అని తెలపడమే ఈ సంవత్సరం ప్రేమికుల రోజు నినాదం. దీనిపైనే ఈ కథనం..

 

ప్రేమా.. ఓ ప్రేమా...

 

నేడు ప్రేమను ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రేమ చాలా ఓపెన్‌ అయిపోయింది. ప్రేమలో పడితే పార్టీలు చేసుకుంటున్నారు. ఎవరెవరు ప్రేమలో ఉన్నారో అందరికీ తెలిసిపోతోంది. చివరికి ఆ కథ సుఖాంతమా? కాదా? అనే విషయం తెలుస్తోంది. ప్రేమంటే ఇది అని నిర్వచనము ఇవ్వడంలో స్పష్టత దొరక్కపోవచ్చు గానీ, ఆ బంధాన్ని ఎలా తీసుకోవాలనే విషయంలో మాత్రం స్పష్టత ఉండాలి.
 

                                                                     సిసలైన ప్రేమ..

ప్రేమా.. ఓ ప్రేమా...

    ఆరాధన, జాలి, ఓదార్పు, సానుభూతి, ఆకర్షణ, ఇష్టం.. ఈ భావోద్వేగాలనే 'ప్రేమ' అనుకుంటారు ఎక్కువ శాతం మంది. ఈ ప్రభావాలతో ఎదుటి వ్యక్తిలోని లోపాలను గ్రహించకుండా, అదే ప్రేమ అని భ్రమించి, పెళ్లితో ఒకటయ్యాక, పుటుక్కున విడిపోయే జంటలు ఎన్నో. కానీ పెళ్లై దశాబ్దాలు గడుస్తున్నా ఒకరికొకరు ప్రాణంగా బతికే జంటల్ని గమనిస్తే.. ప్రేమకు అసలైన అర్థం తెలుస్తుంది. వాళ్లిద్దరికీ ఒకరి లోపాలు మరొకరికి తెలుసు. ఇష్టాయిష్టాలూ, బలహీనతలూ తెలుసు. వాటితోపాటే మొత్తంగా ఎదుటి వ్యక్తిని స్వీకరించగలుగుతారు కాబట్టి, అన్నేళ్లూ కలిసి జీవితాన్ని పంచుకోగలుగుతారు. 'అతని కోసం నేనెందుకు సర్దుకుపోవాలి?' అనే మొండితనం ఆమెలో కనిపించదు. 'ఆమెకు నచ్చిందే నేనెందుకు చేయాలి?' అనే అహం అతనిలో కనిపించదు. అవతలి వ్యక్తి మీదున్న ప్రేమ వల్ల స్వభావాల్లో మార్పు కలుగుతుంది. బలవంతం మీద కాకుండా ప్రేమతో, ప్రేమకోసం తమంతట తామే భాగస్వామికి అవగాహన కలిగించుకుని, ఒకర్నొకరు అర్థంచేసుకుంటారు. ఇంతటి పరిపక్వత ప్రేమికుల్లో ఉంటే, అదే సిసలైన ప్రేమ !

 

ప్రేమా.. ఓ ప్రేమా...

ప్రపంచంలో ఏ ఇద్దరి వ్యక్తుల ఆలోచనలూ ఒకే విధంగా ఉండకపోవచ్చు.. సహజంగానే ఉండవు కూడా. కారణం వారు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు.. మరెన్నో. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే ప్రేయసి / ప్రియుడి మీద కోపాన్ని ప్రదర్శించవచ్చు. అప్పుడు ఎదుటివ్యక్తి అవతలి వారి మీద అలక చూపవచ్చు. మాట్లాడటం మానేయవచ్చు. దాన్నే సాకుగా చూపించి, ఒకరినొకరు నిందించుకోవడం కరెక్టు కాదు. వారిని బతిమాలి, అలక తీర్చాల్సిన బాధ్యత ఇద్దరిదీ. వారిపై తీవ్రస్థాయిలో కోప్పడి ఉంటే.. వాళ్లు కాస్త ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మామూలుగా సారీ చెప్పడమో, బుజ్జగించడమో చేస్తే ఎదుటి వ్యక్తి అసలు సంతృప్తి చెందరు. కాబట్టి వారిని ముద్దుపేర్లతో పిలుస్తూ.. 'ఈ ఒక్కసారి క్షమించొచ్చు కదా!' అంటూ ఒకరినొకరు మన్నించుకునే గుణం కలిగి ఉండాలి. దీనివల్ల కోపతాపాలు తగ్గడమే కాకుండా.. సమస్యలు పెద్దవి కాకుండా సమసిపోవడానికి వీలవుతుంది. సందర్భాన్ని బట్టి ఒకర్నొకరు అర్థం చేసుకుంటుంటే.. సమస్యలు రావు.. వచ్చినా అవి బంధం తెంచుకునేంత పరిస్థితి రాదు.
 

                                                              కుటుంబానిదీ ప్రేమే..

ప్రేమా.. ఓ ప్రేమా...

ప్రేమంటే ఒక ప్రియుడు తన ప్రియురాలికి ఓ పువ్వును ఇవ్వడమో, హృదయాన్ని కానుకగా ఇచ్చానని చెప్పడమో కాదు. ప్రేయసీ ప్రియులదే ప్రేమ అని వాలంటైన్‌ కూడా చెప్పలేదు. ఆయన అమరత్వం ప్రేమకు ఉన్న విశాలత్వాన్ని, లోతును ప్రపంచానికి తెలియజేసింది. ఆ విశాలత్వం నుంచి చూస్తే.. వాలెంటైన్స్‌ డే అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై తనకున్న ప్రేమను చాటుకునేది. అలా చూస్తే ఆప్యాయతతో పిల్లల్ని అక్కున చేర్చుకునే అమ్మదీ ప్రేమే. అన్నింటా అండగా నిలబడే నాన్నదీ ప్రేమే. మనతో కలిసి ఆడే తమ్ముడూ, చెల్లిదీ ప్రేమే. మనచేయి పట్టి దారి చూపించే అక్కదీ, అన్నదీ ప్రేమే.
    ఆత్మీయులకు, రక్త సంబంధీకులకు మనసులోని కృతజ్ఞతను ప్రేమగా వ్యక్తీకరించడం అనేది మానవ సహజంగా ఉండాలి. ప్రేమికుల రోజున తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు, కానుకలో, కార్డులో ఇచ్చి ప్రేమను వ్యక్తీకరించే సంస్కృతి చాలా దేశాల్లో ఉంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఇచ్చే గ్రీటింగ్‌ కార్డుల మీద కనిపించే విలువైన వాక్యం..


f.a.m.i.l.y.
ఫాదర్‌ (m)  అండ్‌ (a)
మదర్‌ (f) ....ఐ (i)
లవ్‌ (l) యు (y)!

నాన్నకు ప్రేమతో ఇచ్చే కార్డులో... 'ద బెస్ట్‌ డ్యాడ్స్‌ ఆల్వేస్‌ హ్యావ్‌ ద బెస్ట్‌ కిడ్స్‌. యస్‌, దట్‌ మీన్స్‌ మీ! హ్యాపీ వాలెంటైన్స్‌ డే టు ద బెస్ట్‌ డాడ్‌!' లాంటి వాక్యాలు..
అమ్మకు ప్రేమతో ఇచ్చే కార్డులో... 'మై మదర్‌... యువర్‌ లవ్‌ ఈజ్‌ జస్ట్‌ ఇనఫ్‌ ఫర్‌ మీ! హ్యాపీ వాలైంటెన్స్‌ డే' లాంటి వాక్యాలు కనిపిస్తుంటాయి.
'కుటుంబం' అంటే జీవితంతో పెనవేసుకునే బంధం. 'ప్రేమ' అంటే... ఎప్పటికీ దూరం కాని బంధం. అల్లరి చిట్టి చెల్లికి తీయటి చాక్లెట్లు, గంభీరమైన పెద్దన్నకు ఇష్టమైన పెన్నులివ్వడం వరకూ అన్నీ ప్రేమ కానుకలే. వారిలో ఎవరికి పంచినా, ఎవరితో పంచుకున్నా అది ప్రేమే. 'స్పిరిట్‌ ఆఫ్‌ వాలెంటైన్స్‌ డే'కు పరిపూర్ణత తీసుకురావాలంటే అది ప్రేయసీ, ప్రియుల దగ్గర మాత్రమే ఆగిపోకూడదు. కుటుంబ బంధాలు, స్నేహాలు.. ఇలా నూరు అనుబంధాలు.. వేనవేల ప్రేమలై వికసించాలి.
 

                                                             మాకూ హృదయం ఉంది..

ప్రేమా.. ఓ ప్రేమా...

ప్రేమంటే స్త్రీ-పురుషుల మధ్య పుట్టేది. పెళ్లంటే వాళ్లకి మాత్రమే జరిగేది. అదే ఓ అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించినా.. ఓ అబ్బాయి మరో అబ్బాయికి మనసిచ్చినా 'హవ్వ.. ఇదేం విడ్డూరం!' అనేస్తుంది ఈ సమాజం. ఇలాంటి అనుబంధాలను ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్లు, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్స్‌) అని పిలుస్తున్నాం. సహజత్వానికి భిన్నంగా ఈ జంటలు ఇప్పుడు వివాహాలు చేసుకుంటున్నాయి. తమ మధ్య ప్రేమ ఉంటుందంటున్నారు. హార్మోన్ల ప్రభావం కావచ్చు, మానసిక గాయాలు కావచ్చు.. చూడ్డానికి అసహజంగా కనిపించొచ్చు.. అలాంటి ఎల్జీబీటీక్యూలకూ హృదయం ఉంటుంది. వాళ్ల బంధానికీ ప్రేమే పునాది. ఎల్జీబీటీక్యూల మధ్య వివాహ బంధం సహేతుకమేనంటూ కొంతకాలం క్రితం 'సుప్రీం' తీర్పునిచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ జంటల్ని అర్థం చేసుకుంటోంది. అంగీకరించే ప్రయత్నం చేస్తోంది. వారిప్పుడు కలిసి జీవించే వాతావరణం కనిపిస్తోంది. సామాన్యుల్లానే ఈ జంటల పెళ్లిళ్లకు పెద్దల ఆశీర్వాదాలూ దక్కుతున్నాయి.

 

ప్రేమా.. ఓ ప్రేమా...


 

                                                                అనేక దేశాల్లో..

మనదేశంలో : మనదేశంలో 20-30 ఏళ్లుగా ప్రేమికుల రోజును జరుపుకొనే వారి సంఖ్య రానురాను పెరుగుతోంది.
ఇటలీ : ఇటలీలో ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం మొట్టమొదటిసారి చూసిన వ్యక్తే తమ జీవిత భాగస్వామిగా మారతారనే భావన ఉంది. అలా కనిపించిన వారితోనే, తర్వాత ప్రేమికుల దినోత్సవానికి వివాహం అయిపోతుందని నమ్మకం.
జర్మనీ : జర్మనీలో ప్రేమికుల రోజున పంది బొమ్మ / పంది బొమ్మ ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చిపుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. దీంతో వాలెంటైన్‌ డేకు ముందు పంది బొమ్మలకు అక్కడ డిమాండ్‌ పెరుగుతుంది.
అర్జెంటీనా : అందరికీ ప్రేమికుల రోజు ఉంటే అర్జెంటీనా వాసులకు ప్రేమికుల వారం ఉంది. ఆ దేశంలో జులై 13 నుంచి 20వ తేదీ వరకూ వారంపాటు వాలెంటైన్‌ వీక్‌గా జరుపుకొంటారు.
కొరియా : కొరియాలో రెండు సంప్రదాయాలున్నాయి. ఏప్రిల్‌ 14ను వైట్‌ డేగా భావిస్తూ ఓ పక్క ప్రేమికులు ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. మరోపక్క ప్రేమలో పడనివారు ఇదేరోజును బ్లాక్‌ డేగా భావిస్తూ నల్లటి దుస్తులు ధరిస్తారు.
జపాన్‌ : జపాన్‌లో వాలెంటైన్స్‌ డే రోజున ప్రేమికులు బహుమతులుగా చాక్లెట్లను ఇచ్చుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా చాకెట్లు తయారుచేస్తారు.
ఇంకా అమెరికా, డెన్మార్క్‌, యూకే, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో వాలెంటైన్స్‌ డేను పెద్ద పండుగలా చేస్తారు.
 

                                                              ఆమెకూ మనసుంది..

ప్రేమా.. ఓ ప్రేమా...

    ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటబడి వేధించడం కొందరి ఆకతాయిల పని. చూసిన వెంటనే ప్రేమ మొదలైందని.. తనని తప్ప వేరొకరిని జీవిత భాగస్వామిగా ఊహించుకోలేనని చెబుతూ ఆమెను వేధిస్తుంటారు. వారు ప్రేమకు ఒప్పుకోకపోతే దాడికి తెగబడతారు. తనకు దక్కనిది వేరొకరికి దక్కకూడదని ఆమెపై యాసిడ్‌తో, కత్తితో, తదితర మారణాయుధాలతో హత్యలకు పాల్పడతారు. మానసికంగా, శారీరకంగా హింసిస్తూ.. చివరకు వారి కుటుంబసభ్యులను చంపడానికీ వెనుకాడరు. ఇది సరైంది కాదు. ప్రేమ అనేది వ్యక్తిగతమైంది. ఆమె కూడా మనిషే, వస్తువు కాదు.. నచ్చిన వస్తువును పొందినట్లు ఆమెను పొందాలనుకోవడానికి. మనసు నుండి కలిగేదే ప్రేమ. అందుకే ఆమెకూ మనసుంటుందని అర్థం చేసుకోవాలి. తన జీవితాన్ని నచ్చిన వ్యక్తితో పంచుకునే స్వేచ్ఛ ఆమెకూ ఉంటుంది.. ఉండాలి. నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తి సుఖాన్ని, సంతోషాన్ని కోరుకుంటుంది. కానీ వారి బాధను కాదు. ఇది అందరూ అవగాహన చేసుకోవాల్సిన విషయం. అయితే కొందరు అమ్మాయిల్లోనూ పెడధోరణులు లేకపోలేదు. తమ విలాసాల కోసం, డబ్బు పొందేందుకు అబ్బాయిలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఇదీ సరైనది కాదు. దీన్ని ప్రేమ అనరు. ప్రేమ అంటే ఒకరికోసం ఒకరు ఏమైనా చేయగలిగేది.. అవతలివారి అభివృద్ధిని, అభ్యున్నతిని కోరేది. అమ్మాయైనా, అబ్బాయైనా ఈ విషయం అవగతం చేసుకోవాలి.
 

                                             ఏం సాధించడానికి ఈ కులదురహంకార హత్యలు..?

ప్రేమా.. ఓ ప్రేమా...

అనాదిగా అదే రక్త చరిత్ర. అబ్బాయీ అమ్మాయీ ప్రేమించుకోవడం.. అటువైపో, ఇటువైపో ఎవరో ఒకరి కుటుంబానికి నచ్చకపోవడం.. కుల అంతరాలు.. మత అంతరాలు.. ఆర్థిక అంతరాలు.. ఇలా అనేక అంతరాలు.. ఈ కారణాలతో ప్రేమించుకున్న వారిలో ఎవరినో ఒకరిని చంపేయడం. సమాజంలోని ఈ అంతరాల ప్రభావంతోనే కొందరు తల్లిదండ్రులు ఇలా ప్రవర్తిస్తున్నారు. సమాజం నిరంతరం మారుతూ ఉంటుంది. నేటితరం విద్యావంతులైన పిల్లల ఆలోచనా విధానంలోనూ మార్పులు వస్తున్నాయి. తమకేమి కావాలో? ఏది మంచో? ఏది చెడో? వాళ్లు తెలుసుకోగలుగుతున్నారు. వాస్తవానికి మేజరైన అబ్బాయి, అమ్మాయి వారికి నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకునే స్వేచ్ఛ చట్టం కల్పించింది. అయినా తల్లిదండ్రుల అనుమతి కోరుతున్నారు అంటే వారు పెద్దలకు ఇచ్చే గౌరవం. ఆ విషయాన్ని పెద్దలు గమనంలో ఉంచుకోవాలి. తమ పంతాలు, పట్టింపులతో, మూఢత్వం, మూర్ఖత్వంతో అవతలి వ్యక్తి కుటుంబ సభ్యులను హత్యలు చేయడానికీ వెనుకాడకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఏం సాధించడానికి ఈ కులదురహంకార హత్యలు..? కులం కోసం పాకులాడి.. ప్రాణాలు తీసి.. జీవితం జైలుపాలు చేసుకుని.. వాళ్లు సాధించిందేంటి..? పిల్లల సంతోషంకన్నా తల్లిదండ్రులకు ఏదీ ఎక్కువకాదు అనే విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు.

                                                                  ప్రేమా సరుకే !

ప్రేమా.. ఓ ప్రేమా...

ప్రేమికుల రోజు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఆ ఒక్కరోజే ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ విపరీతంగా జరుగుతుంది. కార్డ్స్‌, పూలు, డైమండ్‌ నగలు, చాక్‌లేట్స్‌, బొమ్మలు, రెడీమెడ్‌ దుస్తులు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, రిస్ట్‌వాచీలు, స్మార్ట్‌ఫోన్స్‌, బ్రాండెడ్‌ బట్టలు, బ్రాండెడ్‌ చెప్పులు, ఇంటర్నేషనల్‌ బ్రాండెడ్‌ హ్యాండ్‌ బ్యాగ్స్‌, సిల్వర్‌ కఫ్లింగ్స్‌, పట్టు 'టై'లు, లెదర్‌ బెల్టులు, వాలెట్‌, కీ చైన్స్‌, మాయిశ్చరైజర్స్‌, ఫెర్‌ఫ్యూమ్స్‌లాంటి వాటికి సంబంధించి కోట్లలో అమ్మకాలు సాగుతాయి. వాలైంటైన్‌ డే ఒక్కరోజే కొన్ని కంపెనీలు వేలకోట్లలో ఆదాయాన్ని పొందుతున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో! ఆ రోజు స్టూడెంట్స్‌ కన్నా ఎమ్‌ఎన్‌సీ, బీపీఓ, ఐటీ సెక్టర్స్‌లో పనిచేసే ఎంప్లాయీస్‌ ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. స్టూడెంట్స్‌ ఐదు వందల రూపాయల నుంచి పది వేల లోపు ఖర్చుపెడితే... సాప్ట్‌వేర్‌లాంటి ఉద్యోగులు వెయ్యి నుంచి 50 వేల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

                                                        బలవంతపు పెళ్లిళ్లు ఆపాలి..

ప్రేమా.. ఓ ప్రేమా...

ప్రేమికుల రోజు ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు హిందూత్వ మూకలు దాడికి తెగబడుతున్నాయి. అసలు వారి మధ్య ఎలాంటి బంధం ఉందో తెలుసుకోకుండానే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. అలా అన్నాచెల్లెళ్ల మధ్య, అక్కా తమ్ముళ్ల మధ్య పెళ్లిళ్లు చేసేసిన భజరంగదళాలు ఈ వాలెంటైన్స్‌ డే రోజు కత్తులు, కర్రలతో పాటు మంగళసూత్రాలు పట్టుకుని దాడులకు తెగబడుతుంటారు. అసలు పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. అందులో జోక్యం చేసుకోవడానికి ఎవరికీ ఎలాంటి హక్కులూ లేవు. జాతి, కుల, మత, వర్గ, భాష, ప్రాంతీయ భేదాల్లేనిదే స్వచ్ఛమైన ప్రేమ. ఈ హిందూత్వ మూకదాడులను నేటి యువత అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీరి వీరంగం ఇలాగే కొనసాగిస్తే సమాజ వినాశనానికే దారితీస్తుంది.

                                                      ఆత్మహత్యలు పరిష్కారం కాదు..

ప్రేమా.. ఓ ప్రేమా...

యుక్త వయస్సు వచ్చిన యువతీ యువకులు తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలిపి, ఒప్పించి, పెళ్లి చేసుకుంటే అందరూ మెచ్చుకుంటారు. పెళ్లి తర్వాత వారు ఆపదలో ఉన్నా తల్లిదండ్రుల సహకారం అందుతుంది. ఒకవేళ పెద్దలు ఒప్పుకోకున్నా ఒక్కటైన జంట ఒకరికోసం ఒకరు అన్నట్లు ధైర్యంగా జీవించాలి. ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండే పరిస్థితి ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అంతేగానీ తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదనో, ఆర్థిక ఒడిదుడుకులు వచ్చాయనో, అవగాహన లేక ఆకర్షణనే ప్రేమ అని భ్రమించే యువత ఆత్మహత్యలకు పాల్పడున్నారు. ఆత్మహత్య ఏ సమస్యకీ పరిష్కారం కాదు. ఏదైనా బతికి సాధించుకోవాలి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాలి. అసలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే మదిలోనికి రానీయకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తుంటే.. మనకు సరైన సలహా ఇచ్చేవారితో సంప్రదించాలి. కని, ఇంతవరకూ పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల గురించైనా ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి సమయంలో ఎన్నో కష్టాలను గట్టెక్కి, జీవితంలో విజేతలుగా నిలిచిన వారి జీవితగాథలు చదవాలి. తల్లిదండ్రులను మీ ప్రేమతో గెలుచుకోండి.. మీ ప్రేమనూ గెలిపించుకోండి.

 

ప్రేమా.. ఓ ప్రేమా...


చరిత్రలో సమాజ మార్పుకు దోహదపడిన ప్రేమలు చిరస్మరణీయం.. మార్క్స్‌ జెన్నీ, రోజాలగ్జెంబర్గ్‌.. ఇలా వ్యక్తుల మధ్య, కుటుంబంలో ప్రేమ సమాజాభివృద్ధికి దారితీశాయి. ప్రేమానుబంధాలు మనల్నీ, మన చుట్టూ ఉన్నవారినీ, సమాజాన్నీ ప్రభావితం చేయగలగాలి. అలాంటి ప్రేమ అత్యున్నతమైనది. అలాగే ప్రేమను ఏ ఒక్కరోజో సెలబ్రేట్‌ చేసుకోవడం కాదు.. ప్రేమ అనేది ప్రతినిత్యం ఉండాలి.. ప్రేమికులందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

స్వర్ణలత నూకరాజు