Jun 04,2022 06:31

రెండు మతాల మధ్య విద్వేష భావాలను రెచ్చగొట్టడానికి...యువ జంటల మధ్య ఉండే ప్రేమను సంఘపరివార్‌ ఎలా ఉపయోగించుకుంటుందో... ఈ రెండు సంఘటనలు తెలియజేస్తాయి. మన సమాజంలో మతతత్వ, పితృస్వామిక భావనలు కూడా ఎంత బలంగా ఉన్నాయనే విషయాన్ని పై రెండు ఘటనలు చెప్తాయి. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌, బిజెపి లు అటకెక్కించిన కుల దురహంకార హత్యల వ్యతిరేక చట్టాలు ఎంత అవసరమో కూడా వివరిస్తాయి.

    కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ కల్పించడమే కాక, వారికి వ్యతిరేకంగా హింసాత్మక దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జోక్యం చేసుకున్నప్పటికీ కుల దురహంకార హత్యలు కొనసాగుతునే ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, కర్ణాటకలలో భిన్న మతస్థుల మధ్య మతాంతర వివాహాలు చేసుకున్నా, మత మార్పిళ్లు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని రాజ్యాంగబద్దంకాని చట్టాలు చేయడం విచారకరం. ఒకవేళ పెళ్ళి చేసుకున్న వారిలో అమ్మాయి హిందువై, అబ్బాయి ముస్లిం అయితే వారిని మానసికంగా హింసించి, జైలులో పెట్టి శిక్షించడానికి ఆ చట్టాలను ప్రయోగిస్తారు.
     ఇటీవల జరిగిన రెండు సంఘటనలు బిజెపి తలపెట్టిన హానికరమైన మత విభజన, మోసాలను బహిర్గతం చేయడమే కాక, సంఘ పరివార్‌ అదేపనిగా చేసిన ప్రచారంతో...రెండు మతాల మధ్య పెరిగిన అసహనాన్ని కూడా బయట పెట్టాయి. మహిళలకు కుల మతాలను కాదని పెళ్ళి చేసుకునే స్వేచ్ఛను నిరాకరించే చర్య దురదృష్టవశాత్తు పురాతన భారతీయ సామాజపు ఒకానొక లక్షణం. వర్ణాశ్రమ ధర్మం ఉనికి ప్రమాదంలో పడుతుంది కాబట్టి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కును మహిళలకు నిరాకరించడం జరుగుతుంది.
    మే 8వ తేదీన, తెలంగాణ రాష్ట్ర డిఎస్‌ఎంఎం అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌ వెస్లీ, స్కైలాబ్‌ బాబుతో కలిసి వికారాబాద్‌ జిల్లాలోని మారేపల్లి గ్రామానికి వెళ్ళాను. మే 4న, అదే గ్రామంలో మాల సామాజిక వర్గానికి చెందిన నాగరాజును, అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆశ్రిన్‌ సుల్తానా బంధువులు హత్య చేశారు. కలిసి చదువుకున్న వారిరువురూ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఆశ్రిన్‌ సోదరుడు మోబిన్‌ వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించి, ఆమెను పలుమార్లు కొట్టాడు. జనవరి 30న, ఆశ్రిన్‌ ఇల్లు వదిలి వెళ్ళి, మరుసటి రోజు ఆర్య సమాజ్‌ గుడిలో నాగరాజును పెళ్లి చేసుకొని, తన పేరును 'పల్లవి' గా మార్చుకుంది. ఈ యువ జంట హైదరాబాద్‌ లోని సరూర్‌ నగర్‌లో కలిసి జీవనం సాగించారు. నాగరాజు ఒక ఆటోమొబైల్‌ షోరూంలో పని చేస్తుండేవాడు. ఆశ్రిన్‌ సోదరుడు మోబిన్‌ ఈ జంటను క్షమించకుండా, వారు ఎక్కడ నివాసం ఉంటున్నారో తెలుసుకున్నాడు. మే 4వ తేదీ మధ్యాహ్నం అతడు, తన బావమరిదితో కలిసి...ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్తున్న యువజంటను పలకరించాడు. వాస్తవానికి నాగరాజు తన భార్యను రంజాన్‌ పండగ నిమిత్తం షాపింగ్‌కు తీసుకెళ్తున్నాడు. హంతకులు యువ జంటను వాహనం దిగమని, నాగరాజుపై ఇనుపరాడ్‌, కత్తితో దాడి చేశారు. ఇది పట్టపగలు జనం రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగింది కానీ ఏ ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రాకుండా, మొబైల్‌ ఫోన్లతో జరుగుతున్న సంఘటనను వీడియో తీశారు. హంతకులతో ఆశ్రిన్‌ శివంగిలా పోరాడినా గానీ, నాగరాజును కాపాడుకోలేక పోయింది.
    ఏమాత్రం ఆలస్యం లేకుండా, బిజెపి, దాని అనుబంధ సంఘాలు ''హిందువులంతా మేల్కోవాలి'' అనే బ్యానర్లతో నిరసన కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించారు. అప్పటి నుండి వారు మత విద్వేషాలను రెచ్చగొట్టి, దళితుల్లో మత ప్రచారం చేపట్టడానికి వారు చేయని ప్రయత్నం లేదు.
     నాగరాజుకు ఆ గ్రామం లోని దళితవాడలో ఒక చిన్న గుడిసె ఉంది. ఆ ప్రాంతమంతా పూర్తి విషాదంలో మునిగిపోయింది. ఆశ్రిన్‌ను మే 5వ తేదీ ఉదయం పోలీసులు అక్కడికి తీసుకొచ్చారు. ఆశ్రిన్‌, నాగరాజు ఇంటికి రావడం, అతని తల్లిదండ్రులను కలవడం మొదటిసారి. మేము ఆ ఇంట్లోకి వెళ్ళినపుడు...ఆశ్రిన్‌, ఆమె అత్తగారు అనసూయ బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉన్నారు. మేం వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ, అక్కడే చాలాసేపు కూర్చున్నాం. ఆశ్రిన్‌ హిందుస్థానీ. తెలుగులో చాలా చక్కగా మాట్లాడింది. న్యాయం తప్ప మరేమీ అవసరం లేదని...తన సోదరుడు, అతని బావమరిదిని కఠినంగా శిక్షించాలని కోరుకుంది. తన భర్తను నిర్దాక్షిణ్యంగా చంపిన హంతకులను కూడా అదే రీతిలో చంపాలని ఆశ్రిన్‌ కోరుకుంది. కానీ నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వం వారిని వదిలేస్తుందని ఆమె భయపడింది. అలాంటి హింసాత్మక ఘటనలు మళ్ళీ జరగకుండా వుండేలా కఠినమైన చట్టాలను తేవాలని ఆమె డిమాండ్‌ చేసింది. కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా చట్టాలను తేవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఏనాడో ముసాయిదా చట్టాలను తయారు చేసిందని... కానీ బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను నిర్లక్ష్యం చేశాయని ఆమెకు చెప్పాను. అనసూయ కూడా తన కొడుకు హత్యకు గురికావడం పట్ల ఆగ్రహం, బాధను వ్యక్తం చేసింది. ఇకమీదట తమకు కొడుకైనా, కూతురైనా ఆశ్రినే అంటూ ఆమె పట్ల ఆప్యాయతను కనబరిచింది.
     నాగరాజు తరపు బంధువులు తన పట్ల ప్రేమానురాగాలు చూపుతూ, అండగా ఉంటామని చెప్తుండగా... తాను ముస్లిం కాబట్టి, తన కారణంగానే నాగరాజు హత్యకు గురయ్యాడు కాబట్టి, తనను బయటకు వెళ్లగొట్టాలనే ప్రచారం బిజెపి ప్రేరణతో గ్రామంలో అంతర్గతంగా సాగుతున్నదని ఆశ్రిన్‌ నాతో నెమ్మదిగా చెప్పింది. ఆశ్రిన్‌కు, నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన అనేకమంది గ్రామస్థులతో మేం మాట్లాడాం.
    ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆశ్రిన్‌ను గానీ, నాగరాజు కుటుంబాన్ని గానీ ఏ ఒక్కరూ కలవలేదు. మోబిన్‌, అతని బావమరిదిని అరెస్ట్‌ చేయడంలో పాలనా వ్యవస్థ చురుకుగా ఉండగా, పాలక టిఆర్‌ఎస్‌ నాయకులెవరూ మారేపల్లిని దర్శించలేదు. బిజెపి మాత్రం తీరికలేకుండా తనదైన విద్వేష ప్రచారం సాగిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రిన్‌, నాగరాజు తల్లిదండ్రులకు పరిహారం చెల్లించాలని, ఆశ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌) డిమాండ్‌ చేసింది.

                                                                            ***

మే 12వ తేదీన, రాష్ట్ర కమిటీ సభ్యుడు భరత్‌ సింగ్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి తోమర్‌, ఐద్వా నాయకులు కిరణ్‌, రాజేంద్రీ, సరోజ్‌ తో కలిసి ఆగ్రా వెళ్లి...ఎడిఐజి ని, జిల్లా మెజిస్ట్రేట్‌ ను కలిశాం. మా వెంట ఏప్రిల్‌ 12న ఢిల్లీ ఆర్య సమాజ్‌ మందిరంలో రితికా జైన్‌ను పెళ్లి చేసుకున్న సాజిద్‌ సోదరుడు మత్లూబ్‌, తండ్రి అబ్దుల్‌ ముఘానీ ఉన్నారు. ఈ యువ జంట కలిసి చదువుకున్నారు. ఐదు సంవత్సరాలకు పైగా ప్రేమించుకున్నారు. సాజిద్‌ ఒక జిమ్‌ ను నిర్వహిస్తున్నాడు. రితికా కుటుంబ సభ్యులు ఆమెను చదువు మాన్పించి, పెళ్లి చేయాలనుకున్నప్పటి నుంచి ఆమె చదువుకోడానికి సాజిద్‌ సహాయం చేస్తున్నాడు. వారు పెళ్లి చేసుకోడానికి ముందు ఆమె తల్లిదండ్రులకు వారి మధ్య ఉన్న సంబంధం గురించి తెలియడంతో, ఏప్రిల్‌ 11న తండ్రి ఆమెను విపరీతంగా కొట్టి, ఆమె మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నాడు. ఏదో విధంగా ఆమె ఇంటి నుండి బయటకు వచ్చి సాజిద్‌ జిమ్‌కు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్ళలేనని చెప్పడంతో సాజిద్‌ ఆమెను తీసికొని ఢిల్లీ వెళ్లాడు. అక్కడ కొంతమంది న్యాయవాదులను సంప్రదించి, ఏప్రిల్‌ 12న ఆర్య సమాజ్‌ మందిరంలో పెళ్లి చేసుకున్నారు. తాను మేజర్‌ కాబట్టి సాజిద్‌ను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెప్తూ ఒక వీడియో తీసింది. సాజిద్‌ కూడా తాను హిందూ మతం లోకి మారానని, ఇప్పుడు తన పేరు సాహిల్‌ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు.
     ఈ క్రమంలో ఏప్రిల్‌ 11 సాయంత్రం రితికా తండ్రి, సాజిద్‌ తండ్రిని జిమ్‌ వద్ద కలిసి, తెల్లారి ఉదయానికి తన కూతురుని అప్పగించకుంటే పరిణామాలు చాల తీవ్రంగా ఉంటాయని జైన్‌ అబ్దుల్‌ ముఘానీని బెదిరించాడు. తరువాత తన కూతురుని ఎత్తుకెళ్లాడని ఆరోపిస్తూ, సాజిద్‌పై కేసు నమోదు చేయించాడు. ముఘానీ, సాజిద్‌ ఫోన్‌ నెంబర్‌ ను పోలీసులకు, జైన్‌ కు ఇచ్చాడు. వారి పెళ్లయిన తరువాత ఏప్రిల్‌ 12న పోలీసులు సాజిద్‌తో మాట్లాడారు. మరుసటి రోజు తామిరువురమూ తీస్‌ హజారీ కోర్టులో పోలీసులకు లొంగిపోతామని సాజిద్‌ పోలీసులకు చెప్పాడు. ఏప్రిల్‌ 13న పోలీసులు రితికాను ఆగ్రాకు తీసుకొని వచ్చారు. కానీ సాజిద్‌ను మాత్రం ఢిల్లీ లోనే వదిలేశారు. తన తల్లిదండ్రులతో వెళ్ళడం ఇష్టం లేదని రితికా మేజిస్ట్రేట్‌కు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తరువాత ఆమెను ఆగ్రా లోని ఒక షెల్టర్‌కు తీసుకెళ్ళారు. కొద్ది రోజుల తరువాత మధుర తీసుకెళ్లారు.
    రితికా దొరికింది. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసినప్పటికీ, స్థానిక బిజెపి నాయకులు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో పంచాయితీ పెట్టించారు. ఈ రెండు కుటుంబాల వారు ఆగ్రాలో భాగంగా ఉన్న గ్రామీణ ప్రాంతమైన రన్కటలో ఉంటారు. ఈ క్రమంలో సాజిద్‌ కుటుంబం ఇల్లు వదిలి ఎక్కడో తలదాచుకుంది. ఏప్రిల్‌ 15 ఉదయం మరొక పంచాయతీ పెట్టారు. అక్కడికి చేరుకున్న వారంతా సాజిద్‌ కుటుంబం పైన, అతని బంధువులపైన దాడి చేశారు. డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులను లూటీ చేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ విధ్వంసం పూర్తయిన తర్వాత ఆ గుంపు సాజిద్‌ జిమ్‌కు వెళ్లి, అక్కడున్న మెషీనరీని, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు.
     మనో వేదనను అనుభవించిన సాజిద్‌ కుటుంబం ఏకాకిగా మిగిలింది. ఐద్వా సభ్యులు వారి ఇంటిని సందర్శించారు. షెల్టర్‌లో ఉన్న రితికాను కూడా కలిశారు. సిపిఐ(ఎం) సభ్యులు సాజిద్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
    ఏప్రిల్‌ 12న మేం పోలీసులు, పాలనాధికారులతో మాట్లాడగా...తాము అన్ని విధాలా సహకరించి, సహాయ పడతామని హామీ ఇచ్చారు. సాజిద్‌ కుటుంబానికి సంబంధించిన ఇళ్ళపై దాడులు చేసిన వారిని అరెస్ట్‌ చేశారు కానీ వారు చేసిన నష్టానికి పరిహారాన్ని కట్టించలేదు. కొన్ని లక్షల రూపాయలు నష్టపోయిన బాధితులకు ఏ విధమైన నష్టపరిహారాన్ని చెల్లించలేదు. ముఖ్యంగా, భవిష్యత్తులో దాడులు చేస్తారేమోననే భయంతో రితికాను తన భర్త వద్దకు తిరిగి తెచ్చుకునే విధంగా వారు న్యాయపరమైన సహాయాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. ధ్వంసమైన వారి ఇళ్లను, సాజిద్‌ జిమ్‌ ను కూడా మేం సందర్శించి, కుటుంబ సభ్యులను కూడా కలిశాం. సిపిఎం జిల్లా కమిటీ ఇప్పుడు వారికి న్యాయపరమైన సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
రెండు మతాల మధ్య విద్వేష భావాలను రెచ్చగొట్టడానికి...యువ జంటల మధ్య ఉండే ప్రేమను సంఘపరివార్‌ ఎలా ఉపయోగించుకుంటుందో... ఈ రెండు సంఘటనలు తెలియజేస్తాయి. మన సమాజంలో మతతత్వ, పితృస్వామిక భావనలు కూడా ఎంత బలంగా ఉన్నాయనే విషయాన్ని పై ఘటనలు చెప్తాయి. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌, బిజెపి లు అటకెక్కించిన కుల దురహంకార హత్యల వ్యతిరేక చట్టాలు ఎంత అవసరమో కూడా వివరిస్తాయి.

/ వ్యాసకర్త : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు /
సుభాషిణీ ఆలీ

సుభాషిణీ ఆలీ