'మనసున మనసై... బ్రతుకున బ్రతుకై/ తోడొకరుండిన అదే భాగ్యము... అదే స్వర్గము...' అంటాడు మహాకవి శ్రీశ్రీ. జీవితంలో ప్రేమ అయినా, బాధ్యత అయినా... ఒకరికొకరు తోడుగా నిలిచినప్పుడే... ఆ ప్రేమ సార్థకమౌతుంది. పరిస్థితులు సానుకూలంగా వుండి, జీవనయానం సాఫీగా సాగుతున్నకాలం వేరు. సమాజం మొత్తం సంక్షుభిత దశలో వున్న కాలంలో ఈ ప్రేమను పదిలంగా నిలుపుకోగలగడం వేరు. 80 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో, చలి, మంచు, వర్షం తట్టుకుంటూ... అనేక ఇబ్బందులనెదుర్కొంటూ, పోలీసుల దాష్టీకాన్ని ఎదిరిస్తూ, పోరాడుతున్న యువకుడు ఈ రోజు తన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తాడు? పట్టణంలో పనికోసం వలసవెళ్లిన యువకుడు.... అక్కడ పరిచయమైన అమ్మాయిని ప్రేమిస్తే, లాక్‌డౌన్ దెబ్బకి అనివార్యంగా తన గ్రామానికి రావాల్సి వస్తే... అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి... ఈ ప్రేమికుల రోజున ఏ రకంగా ఆలోచిస్తారు. వేర్వేరు మతాల వారు ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే... లవ్ జిహాద్ పేరుతో వారి ప్రేమను చంపేయాలనుకుంటే... వారు తమ ప్రేమను ఎలా వ్యక్తీకరిస్తారు. ప్రేమించి, పెళ్లిచేసుకొని, పిల్లలు పుట్టిన తర్వాత... కరోనా సంక్షోభంలో భర్త నిరుద్యోగిగా మారితే, చేయడానికి పనుల్లేక, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడితే... అదే సమయంలో... జీవితాంతం కలిసి వుండాలని, ప్రేమను పండించుకోవాలని చేసుకున్న బాసలు... నిలబెట్టుకోవాలంటే, ఆ భార్యాభర్తలిద్దరూ ఎలా స్పందిస్తారు. ఎవరైనాసరే... ఒకరికోసం ఒకరు... ఒకరికి తోడుగా ఇంకొకరు నిలవగలిగితే... అదే నిజమైన ప్రేమికులరోజు. ఇది కొత్త ప్రేమికులకే కాదు, వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వర్తిస్తుంది. ఎవరి ప్రేమ అయినా పరీక్షకు గురౌతుంది. వృద్ధాప్యంలో కూడా ఒకరికోసం ఒకరుగా వుండాలి. పరస్పర సహకరించుకోవాలి. అప్పుడే ప్రేమ గెలుస్తుంది. పోరాటం బతకడానికే కాదు... ప్రేమను కాపాడుకోవడానికీ అవసరమే. ఇది నేటి వాస్తవ చిత్రం. పోరాటం లేకుండా ప్రేమ వుండదు. అలాంటి ప్రేమ చిరకాలం సాగదు.
'లాహిరి లాహిరి లాహిరిలో' అని పాడుకుంటూ... నౌకాయానం చేస్తుంటే... మధ్యలో ఏ తుపానో వస్తే... ఇద్దరూ కలిసి పోరాడాల్సిందే. తుఫాను వచ్చింది కదాని... ఒకరినొకరు మధ్యలోనే వదిలేసి పోరుకదా! నావను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తారు. చేయిచేయీ కలిపి తుదివరకూ పోరాడతారు. ప్రస్తుతం సరళీకరణ విధానాలు, మోడీయిజం, మతతత్వం వంటివన్నీ కలిసి ప్రేమనావను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రేమనౌక సాఫీగా సాగకుండా అవరోధాలు కల్పిస్తున్నారు. దాడులు చేస్తున్నారు. ఈ ప్రేమ ప్రయాణం సాఫీగా సాగాలంటే... నావను కాపాడుకోవాలి... ప్రేమను నిలుపుకోవాలి. దాడిచేసే శక్తులపై పోరాటమూ చేయాలి. 'వాలంటైన్స్ డే' అంటే కేవలం పువ్వులివ్వడం, గిఫ్టులివ్వడమే కాదు... పోరాటంలో ఒకరికొకరు తోడుగా నిలవడం.
ప్రేమంటే.. ఏ కష్టం లేకుండా... వాస్తవాలతో సంబంధం లేకుండా.... సినిమాల్లో చూపించినట్లుగా... ప్రేమ వుంటే బతికే యోచ్చు అనుకుంటే ఆచరణతో సంబంధంలేని ప్రేమ అవుతుంది. నిజమైన ప్రేమంటే... ఒక్కరోజున చెప్పుకునే, ఇచ్చుకునే కానుక కాదు. ఎటువంటి పరీక్షా సమయాల్లోనైనా ఒకరికొకరు తోడుగా నిలుస్తూ... ప్రేమను కాపాడుకుంటూ, ముందుకు సాగేది. అదే... ప్రేమికుల రోజున ఒకరికొకరు ఇచ్చుకునే ప్రేమకానుక. జెన్నీ- మార్క్స్ అలాంటి పెద్దకానుకనే ఇచ్చిపుచ్చుకున్నారు. 'డియర్ కార్ల్... నీతో ఎక్కడికైనా వస్తాను. నీకన్నా ముందే బయల్దేరి నీ దారుల్లో వున్న అడ్డంకుల్ని తొలగించి, నీకు మార్గం సుగమం చేస్తాను. అదే నా ఆశయం' అని కార్ల్‌మార్క్స్‌కి ఉత్తరం రాస్తుంది జెన్నీ. మార్క్స్ పట్ల అపారమైన గౌరవం, ఆకర్షణ జెన్నీకి ప్రేమగా మారితే, అతని ఒంటరితనంలో ప్రశాంతతనిచ్చే ఆసరాగా నిలిచింది జెన్నీ. ప్రేమంటే... అభిమానం, గౌరవం, ఆకర్షణ మాత్రమే కాదు... బాధ్యత అని, ఒకరి లక్ష్యానికి ఒకరు తోడుగా నిలవడం అని రుజువు చేసింది జెన్నీ. అలా పోరాటంలోనుంచి పుట్టిన ప్రేమ... తుదివరకూ పరిమళిస్తూనే వుంటుంది.










