అక్కడ
గాలికి గొంతు కలుపుతున్న
వెదురు వనాల గుబురుల్లోంచి
ప్రేమ పాట వొకటి
నవవుతున్న నదుల దాటి
ఆకుపచ్చని అరణ్యాల మీదుగా సాగిపోతోంది
పాట విన్నపుడల్లా
పంటకాల్వలో ఇష్టంగా తడుపుకుంటున్న
మన పాదాలను నీళ్లు ముద్దాడుతుంటాయి
ఎక్కడివివో కన్నీళ్లు బోదెల్లోకి సాగుతుంటాయి
బతుకు చేపపిల్లలు నీటికి ఎదురీదుతుంటాయి
నీ భుజంపైన సీతాకోకలా నా చేయి
నా భుజమ్మీద తూనీగలా నీ చేయి
భరోసా వాక్యమై
వాలుతున్న క్షణాల మధ్య
తూనీగా సీతాకోకల గాజుకళ్లలో
మనమో చిత్తరువై రూపుకడుతుంటాము
ఎప్పుడు ఏది మనసులో కదలాడినా
విత్తులు నాటి నాటి రవ్వంత సేదతీరిన
మోటబావికాడ మర్రిచెట్టే గుర్తుకొస్తాది
అర్ధరాత్రో అపరాత్రో
పురుగనకా పుట్రనకా నీళ్లు పారగట్టి
వేకువ జామునో
ఇంటికొచ్చే నాన్నకోసం
కళ్ళలో వొత్తులేసుకు కూర్చున్న
అమ్మ గుర్తొస్తాది
పచ్చిమిరప కోతలప్పుడు
పరికిణీలో కూలికొచ్చిన
నీ లేత యవ్వనం చుట్టూ
వలపుపిట్టై తిరిగిన
మరుల మొగ్గల సమయం
పొదల్లో దాచిన
కాల్చిన తాటిపండ్లవంటి
దోర ముద్దుల కాలం
కానగ కొమ్మల్లోంచి
ప్రేమరెక్కల పిట్టై ఎగురుతుంటాది
గాలి ఊయల్లో
హొయలుపోతున్న పూలు
పూలరేకులపై
నీ విప్పారిన కళ్ల తుమ్మెదలు
చెనుమీదొక చూపు
నీ చెంపలమీదొక చూపు
తీరికాలేకుండా తపించిన
నా కనుపాపలు
ఆ ప్రేమ పంటల కాలం గుర్తొచ్చి
వెచ్చని చారికల తడేదో
చెంపను తడుముతుంది
ఎన్నెన్ని ఋతువుల్ని తట్టుకుని నిలబడ్డవో
మనవూరి ముందరి పంటచేలు
ఎన్నెన్ని ప్రేమల్ని పండించి పరిమళించినవో
మనపూర్వీకుల గాధలు
గానం చేస్తున్న తోటలు
వెదురు వనాల గుబురుల్లోంచి
ఏదో వేదనా గీతం వినిపిస్తోంది
వేదన మనవూరి తోటల్లాంటి తోటలదేమో
వేదన మనపంట భూముల్లాంటి భూములదేమో
వెళ్లి పలకరిద్దామా ప్రియా..!
ప్రేమ క్షేత్రాల దుఃఖం
ఏ సమాజానికి మంచికాదంటూ
ఏటి గట్టున గుబురు వనాలు గొంతెత్తిన పాట
ఎన్నో తుఫానుల్ని వెనక్కునెట్టి
నిలబడ్డ నేలపాట
దుఃఖపు భూముల్ని చేరే దారిచూపుతుందేమో..!
దుఃఖపు వరదల్ని మళ్లిస్తున్న చేతుల్ని
కలుపుమొక్కల్లా కోసిపారేస్తుందేమో.!!
అక్కడ
గాలికి గొంతు కలుపుతున్న
పాట సాక్షిగా
పొలంగట్టుపై కూకోని
ఎన్నెన్ని వొట్లు పెట్టుకున్నాం.!
ఈ నేలపై ఏదీ వొరిగి పోకూడదని
ఈ నేలపై ఏదీ కూలి పోకూడదని
ఈ నేలపైన ఏదీ ఒంటరి కాకూడదని
పల్లిపట్టు