Oct 26,2023 22:55

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ఇవ్వకుండా బ్లాక్‌లో అమ్మకాలు
అధిక ధరలకు తినుబండారాల విక్రయాలు
మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానం
సౌకర్యాల లేమితో ప్రేక్షకుల అవస్థలు
కొరవడిన అధికారుల తనిఖీలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

సినిమా థియేటర్లకు వెళ్తున్న ప్రేక్షకులకు యాజమాన్యాలు సరికొత్త 'బొమ్ము' చూపిస్తున్నాయి. ఓ పక్క ప్రేక్షకుల జేబు గుల్లవుతున్నా వినోదం సంగతి పక్కనపెడితే సినిమా కష్టాలు పడుతున్నారు. ఎడాపెడా ప్రేక్షకుడి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు అందుకు తగిన సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఎంత పెద్దహీరో సినిమా రిలేజ్‌ అయినా పది, 15 రోజుల్లోనే రద్దీ తగ్గిపోతుంది. దీంతో సినిమాలను అత్యధిక స్క్రీన్ల్‌పై ఒకేసారి రిలీజ్‌ చేసి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కొత్త సినిమాలకు టిక్కెట్ల ధరలను పెంపుచేసి అమ్ముకునేందుకు అవకాశం సైతం ఇస్తోంది. ఇది చాలదన్నట్లు బ్లాక్‌లో సైతం టిక్కెట్ల విక్రయాలు సాగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం ఇలా అనేక పట్టణాల్లో పెద్దఎత్తున సినిమా థియేటర్లు ఉన్నాయి. దాదాపు వందకుపైగా స్క్రీన్‌లు ఉన్నాయి. ఒక్క ఏలూరులోని సినిమా హాళ్లలో 11 స్క్రీన్లపై సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ ధర రూ.150 ఉన్నప్పటికీ సినిమా రిలేజ్‌ సమయంలో అందుకు విరుద్ధంగా ధరలు పెంచుతున్నారు. కొంతమేర టిక్కెట్‌ పెంపునకు ప్రభుత్వం అవకాశం ఇస్తుండటంతో ఇదే అదునుగా మరింత దారుణంగా టిక్కెట్‌ ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌ టిక్కెట్లు ముందుగానే అయిపోయినట్లుగా బ్లాక్‌ చేసి సినిమా థియేటర్‌ వద్ద రూ.150 టిక్కెట్‌ను రూ.200 నుంచి రూ.250 వరకూ బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. పోలీసులుగానీ, రెవెన్యూ అధికారులుగానీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక సినిమా థియేటర్లలో తినుబండారాలు ఎంఆర్‌పి ధరలకే విక్రయించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని చెప్పొచ్చు. పాప్‌కార్న్‌ కొనాలన్న అదిరిపడే పరిస్థితి నెలకొంది. రూ.20 ఖరీదు చేసే వాటర్‌బాటిల్‌ ఒక్కో థియేటర్‌లో రూ.30, మరికొన్ని థియేటర్లలో అంతకు మించి విక్రయిస్తున్నారు. సమోస సైతం రూ.పదికి విక్రయిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదేమని అడిగిన ప్రేక్షకులపైకి వ్యాపారులు గొడవలకు దిగుతున్నారు. పెద్దఎత్తున సొమ్ములు వసూలు చేస్తున్న థియేటర్‌ యాజామాన్యాలు మరుగుదొడ్ల నిర్వహణ సైతం సరిగా నిర్వహించడం లేదు. టాయిలెట్‌కు వెళ్లాలంటనే భయపడే పరిస్థితులున్నాయి. ముఖ్యంగా మహిళలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం థియేటర్లలో వాహనాల పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేయకూడదు. కానీ మోటార్‌సైకిల్‌కు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.
అధికారుల తనిఖీలు శూన్యం..
సినిమా థియేటర్లలో నిబంధనల అమలుపై అధికారుల తనిఖీలు అనేవి లేకుండా పోయాయి. యాజమాన్యాలు, అధికారులు కుమ్మకై వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వివిపిస్తున్నాయి. థియేటర్లలో విక్రయించే తినుబండరాలను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలే లేవంటే అతిశయోక్తికాదు. అదేవిధంగా టిక్కెట్ల విక్రయాలు, మరుగుదొడ్ల నిర్వహణ, తినుబండారాలకు సంబంధించి ఎంఆర్‌పి అమలు వంటివాటిపైనే అధికారులు తనిఖీలు లేకుండా పోయాయి. దీంతో థియేటర్‌ యామాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు పరిస్థితి తయారైంది. ప్రేక్షకుడిని నిలువెల్లా దోచేస్తునప్పటికీ సినిమా థియేటర్లపై చర్యలు తీసుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.