పరేడ్ రిహార్సల్ పరిశీలించిన ఎస్పీ
ముస్తాబైన తిరుపతి పోలీస్ పరేడ్ మైదానం
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: ఆగస్టు 15న 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీస్ కవాతు రిహార్సల్ తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సోమవారం. స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమాన్ని ఎస్పీ పరిశీలించారు. రిహార్సల్స్‌లో భాగంగా ముందుగా సిబ్బంది నుండి జిల్లా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగురవేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం కవాతు పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల పరేడ్ ప్రదర్శన పరిశీలించి కవాతును నిర్వహించడంలో కొన్ని సూచనలు, మెళుకువలు పాటించవలసిన నియమావళిపై, జెండా వందనం, పోలీసు కవాతు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు పలుసూచనలు, సలహాలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ సమిష్టి కృషితో బృందాలుగా ఏర్పడి కష్టపడి పనిచేయడం వలన ఎలాంటి అద్భుతాలను సాధించవచ్చునో ఈ పోలీస్ కవాతును చూసి విద్యార్థులు, పిల్లలు నేర్చుకునే అవకాశం ఉన్నది. కావున రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ కవాతులో మరింత నూతన ఉత్సాహంతో పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం పోలీస్ పెరేడ్ మైదానం పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి, స్వాతంత్య్ర దినోత్సవ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన, తదితర వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజలకు కల్పించాల్సిన భద్రత, సౌకర్యాలను సమీక్షించి, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీ నారాయణ, దిశ డిఎస్పి కాటమరాజు, ఎఆర్ డిఎస్పిలు చంద్రశేఖర్, నందకిషోర్, లక్ష్మణరావు ఆర్‌ఐలు చంద్రశేఖర్, రెడ్డప్పరెడ్డి, నాగభూషణం, చలపతి, శ్రీనివాసులు ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










