పి.ఎం కేర్స్ నిధులు సమాచార హక్కు చట్టం పరిధి లోకి రావంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాని, ప్రజా జీవితంలో జవాబుదారీతనాన్ని కాని ఇనుమడింపజేసేటట్టు లేదు. ప్రశాంత్ భూషణ్ కేసును సూమోటోగా స్వీకరించి శరవేగంగా తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ప్రజలకు న్యాయస్థానాలపై ఉండే నమ్మకాన్ని కాపాడుకోవడం అత్యంత కీలకం అని ఆ తీర్పును వెలువరించిన సందర్భంగా న్యాయమూర్తులు తెలిపారు. అది జరిగిన రెండు రోజులకే పి.ఎం కేర్స్ నిధుల వివరాలు సమాచార హక్కు చట్టం పరిధి లోకి రావని, ఆ నిధులను కాగ్ ఆడిట్ చేయనవసరం లేదని, పి.ఎం కేర్స్ అనేది పబ్లిక్ అథారిటీ కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇటువంటి తీర్పులతో ప్రజలకు సుప్రీంకోర్టు మీద ఏవిధంగా నమ్మకం కలుగుతుందో సుప్రీం న్యాయమూర్తులే శలవివ్వాలి.
మార్చి 28న కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన మెమో ప్రకారం 'పి.ఎం కేర్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక నిధి. ఈ నిధికి కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు (సిఎస్‌ఆర్ ఫండ్స్) గా పరిగణింపబడతాయి' అని ఆ మెమో స్పష్టంగా పేర్కొంది. ఆ ప్రకటన వచ్చిన వెంటనే పి.ఎం కేర్స్ కు విరాళాల ప్రవాహం మొదలైంది. మార్చి 28 నుండి 31వ తేదీ మధ్యలో, అంటే కేవలం మూడు రోజుల్లో రూ.3,076 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఎంత వచ్చిందో ఊహించవచ్చు. పైగా సిఎస్‌ఆర్ నిధులుగా పి.ఎం కేర్స్ కు ఇచ్చిన విరాళాలు పరిగణింపబడతాయంటూ మే 26న కంపెనీ చట్టాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. మే 26న సవరించినా, ఆ సవరణ వెనక తేదీ నుంచి, అంటే మార్చి 28 నుంచి వర్తించేలా ఈ సవరణ చేశారు.
పి.ఎం కేర్స్ నిధికి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలే కాకుండా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు సైతం 2019-20 ఆర్థిక సంవత్సరపు సిఎస్‌ఆర్ నిధులను వెంటవెంటనే జమ చేశాయి (మార్చి 31తో 2019-20 ఆర్థిక సంవత్సరపు వ్యవధి ముగుస్తుంది గనుక). అవిగాక దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తమ జీతాల నుండి ఈ నిధికి విరాళాలిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు ప్రధాని ప్రకటించారు. దీని ప్రయోజనం ప్రజలకు ఉపయోగపడడం. దీనికి విరాళాలిచ్చిన వారిలో వివిధ తరగతుల ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఈ నిధి వివరాలను వెల్లడించడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు? ఎందుకీ గోప్యత? దీనిని సుప్రీం కోర్టు తీర్పు సమర్ధించడం ఏవిధంగా ప్రజలలో విశ్వసనీయతను పాదుకొల్పగలుగుతుంది?
ఇప్పటికే జాతీయ విపత్తు సహాయ నిధి (నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్-ఎన్‌డిఆర్‌ఎఫ్) అంటూ ఒకటుంది. దానికి విరాళాలు స్వీకరించవచ్చు. అటువంటి విరాళాలూ సిఎస్‌ఆర్ నిధుల కింద పరిగణించబడతాయి. వాటి నుండి ప్రధాని బాధితులకు నేరుగా గాని, రాష్ట్రాలకు గాని నిధులను విడుదల చేసి ఆదుకోవచ్చు. ఈ పని చేసే ఒక నిధి ఇప్పటికే ఉండగా మళ్ళీ ఈ పి.ఎం కేర్స్ పేరుతో ఇంకొక నిధి అవసరం ఏముంది? ఈ ప్రశ్నకు కేంద్రం నుండి ఇంతవరకూ సమాధానం లేదు. ఇటువంటి ప్రశ్నకు సుప్రీం తీర్పులోనూ ఎటువంటి సమాధానమూ రాలేదు. ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులైతే వాటికి కాగ్ ఆడిట్ ఉంటుంది. ఆ నిధిలో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. వాటికి సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులకు ప్రభుత్వం జవాబుదారీతనం ముడిపడి వుంది. ఇప్పుడీ పి.ఎం కేర్స్ నిధులకు లేనిది ఆ జవాబుదారీతనమే. విరాళాలు ఎవరిచ్చారో తెలియదు, ఎంత మొత్తం వచ్చిందో తెలియదు, ఎంతెంత దేనికోసం ఖర్చు చేశారో తెలియదు. ఆడిట్ లేదు, పార్లమెంటుకు సమాధానం చెప్పనవసరం లేదు. ఇటువంటి నిధిని ప్రజాస్వామ్యంలో అనుమతించగలమా? దీనిని స్వయానా ప్రధాని నిర్వహిస్తున్నారు. ఈ నిధి ఏర్పాటును కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ప్రధాని పదవి పబ్లిక్ హోదాయే కదా? ఆయన ఎన్నికైన ప్రజా ప్రతినిధే కదా? మరి ఏ కారణం వలన ఎవరికీ సమాధానం చెప్పనవసరంలేదంటూ మోడీ ప్రభుత్వం వాదిస్తోంది? ఇదేం పారదర్శకత? ప్రజల్లో తలెత్తే సందేహాలను తీర్చి తమ నిజాయితీని రుజువు చేసుకోవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వానిదే. ఏ కోర్టు తీర్పులూ నిజాయితీ కొరవడిన పాలకులను రక్షించలేవు.
* ఎం.వి.ఎస్. శర్మ










