ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:ప్రధాని మోడీ పర్యట నను వ్యతిరేకిస్తూ మండల కేంద్రంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద గురువారం గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హౌదా ఇవ్వకుండా మొండి చేయి చూపించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడాన్ని ప్రధాని మోడీ ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రానికి విరివిగా సహాయం చేయాలని కోరారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్ తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్యాకేజీ ఇస్తామని అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హౌదాను అటకెక్కించిందని విమర్శించారు. జీవో 3ను పునరుద్ధరణ చేయాలని, గిరిజనుల హక్కులను, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు గాసిరం దొర, భీమరాజు లైకోన్, లక్ష్మీపురం సర్పంచ్ త్రినాథ్, నీలకంఠం, గోవిందు కుమార్, రాందాసు పాల్గొన్నారు.
పాడేరు : విభజన హామీల అమలులో ఆంధ్రకు- అన్ని విధాల ద్రోహం చేసిన ప్రధాని మోడీకి విశాఖలో పర్యటించే నైతిక హక్కు లేదని ఎస్‌ఎఫ్‌ఐ అల్లూరి జిల్లా కార్యదర్శి ప్రభుదాస్ విమర్శించారు. గురువారం పాడేరులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,దేశంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, దీని ప్రభావం కళాశాలలపై పడుతుందని తెలిపారు. విద్య వ్యవస్థ పూర్తిగా ప్రైవేటీపరం చేయడానికి ఈ నూతన విద్యా విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక ప్రత్యేక హౌదా కల్పించడంలో బిజెపి ప్రభుత్వం ద్వంద వైఖరితో ద్రోహం చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం తలపెట్టిందని, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఉత్తరాంధ్ర ప్రాంతం మరింత వెనుకబడిందని అన్నారు. విశాఖలో మోడీకి అడుగులు వేసే హక్కు లేదని వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు మత్యారాజు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు..










