
పట్టణ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గొయ్యి
ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : పట్టణంలో ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ భారీ గోతులు ఏర్పడ్డాయి. రాయగడ రోడ్డు జంక్షన్ నుండి పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డు వరకు ప్రధాన రహదారి పొడవునా పెద్దపెద్ద ఉగోతులున్నాయి. ద్విచక్రవాహనదారులతోపాటు ఆటో కార్మికులు ఈ రహదారిపై ప్రయాణం సాగించాలంటే భయపడుతున్నారు. ఈ గోతుల కారణంగా రాత్రివేళ్లలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి పరిస్థితి ఇలా ఉండటంపై ఆర్‌అండ్‌బి అధికారుల తీరుపై బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిదులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.