
ప్రజాశక్తి- రేగిడి : రాజాం-పాలకొండ ప్రధాన రహదారిలో రాజాం అంబేద్కర్ జంక్షన్ నుంచి జిఎంఆర్ ఐటి మధ్య డోలపేట వద్ద రెండు లారీలు కూరికి పోవటంతో ప్రయాణికులకు నడక కష్టాలు తప్పలేదు. ఒకే ప్రాంతం వద్ద రెండు లారీలు గుంతలలో కూరికిపో వడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర రైలు బోగీలు వలె వాహనాలు దర్శనమిచ్చాయి. వృద్ధులు, చిన్నారులు జిఎంఆర్‌ఐటి నుంచి కాంప్లెక్స్ వరకు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లడంతో నానా ఆవస్థలు పడ్డారు. ఇంత జరిగినా పోలీసులు జాడా లేదని ప్రయాణికులు విమర్శించారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే నాధుడే కరువ య్యారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రధాన రహదారిలో కాలువ పనులు చేపట్టడం, రోడ్డుకి ఇరువైపులా ఉన్న కట్టడాలను తొలగించి రోడ్డుపైన పడి వేయడం, కాలువ నుంచి వచ్చే నీరు నిలిచిపోవడంతో వాహనాలు కూరుకుపోయాయి. ఆరు రోజులు క్రితం భారీ వాహనం డోలపేట వద్ద ఇలానే గుంతలో కూరుకుపోవడంతో ఇదే పరిస్థితి నెలకొంది. గత మూడు నెలలు నుంచి పనులు జరిగిన ట్రాఫిక్ కమిషనర్, పోలీస్ శాఖ పట్టించుకోక పోవడంతో మంగళవారం నాటి పరిస్థితితో బారీ మూల్యం చెల్లించుకోవలసిన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో సుధీర ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు నడుచుకొని వెళ్లి కాంప్లెక్స్‌లో బస్సు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పటికైనా ప్రధాన రహదారిలో ఉన్న శిధిలాలను తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు.