ప్రజాశక్తి -వీరఘట్టం : స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద గల రక్షిత మంచినీటి పథకం ప్రధాన పైపులైను మరమ్మతులకు గురి కావడంతో పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాకు బ్రేకులు పడ్డాయి. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఈనెల 2న రోడ్లు, భవనాల శాఖ అధికారుల అనుమతులు తీసుకొని రాత్రి జెసిబి ద్వారా తవ్వకాలు జరపడంతో అంబేద్కర్ జంక్షన్ వద్ద గల టీ జాయింట్ తవ్వకాల్లో రక్షిత మంచినీటి ప్రధాన పైపులైను పూర్తిగా విరిగిపోయింది. తవ్వకాలు జరుపుతామని మేజర్ పంచాయతీ అధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల నిర్లక్ష్యమేనని పంచాయతీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురువారం మేజర్ పంచాయతీ ఇఒ వి.రామచంద్రరావు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. రోడ్డుకు అవతల వీధులకు, రోడ్డుకు ఇవతల తాగునీటి సరఫరాకు కావాల్సిన ప్రధాన పైపులైను టీ జాయింట్ దగ్గర దెబ్బ తినడంతో పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా నిలిపివేశారు. ప్రధాన పైపు మెటీరియల్ విశాఖ నుంచి రప్పించి ఈనెల నాలుగో న మరమ్మతులు చేపట్టి యధావిధిగా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేజర్ పంచాయతీ ఇఒ తెలిపినా, నేటికీ పనులు పూర్తి కాలేదు. దీంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలుపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పైపులైను మరమ్మతులు చేపట్టి తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.










