Aug 21,2023 22:51

ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు వైసిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో పోరాటం సాగిస్తే ప్రత్యేక హోదా సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అని ఆగస్టు 17న విశాఖపట్నం నుండి ప్రారంభమైన సిపిఐ బస్సు యాత్ర సోమవారం కాకినాడ చేరుకుంది. స్థానిక గాంధీ భవన్‌లో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావు, టిడిపి పాలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రామకష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ప్రత్యేక హోదాపైన, విభజన హామీలు పైన నోరు విప్పడం లేదన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్నారు. అధికారం వచ్చేవరకు ఒకలాగా అధికారం వచ్చిన తరువాత ఇంకోలాగా మాట్లాడుతున్నారన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సిఎం జగన్మోహన్‌ రెడ్డి తనకు పార్లమెంట్‌లో ఉన్న ఆరుగురు ఎంపీలతోనూ రాజీనామా చేయించి ఢిల్లీలో ప్రత్యేక హోదాపై ధర్నా చేశారని, తెలుగుదేశం పార్టీ ఎన్‌డిఎ ప్రభుత్వం నుండి బయటకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశారని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హోదాపై బయటకు వచ్చి కాకినాడ సభలో పాచిపోయిన లడ్డులు మాకు వద్దని మాట్లాడారన్నారు. కానీ ప్రస్తుతం మోడీకి భయపడి నోరు విప్పకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మొన్నటి వరకు అహంకారంతో ఆకాశం వైపే చూసేదని, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నేల చూపులు చూస్తోం దన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు సరైన సమయం ఆసన్న మైందన్నారు.
ప్రత్యేక హోదా ముగిసిన అంశం కాదు
ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని
ప్రత్యేక హోదా ముగిసిన అంశం కాదని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పదే పదే ముగిసిన అంశంగా మాట్లాడుతోందని, అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక హోదాను ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. విభజన హామీలు భావితరాలకు ఎంతో ఉపయోగమన్నారు. రాష్ట్రంలో ఉన్న నీచ రాజకీయాలతో ప్రత్యేక హోదా పక్కతోవ పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
పేరుకే హోదా అంశాన్ని మాట్లాడుతున్నాయి
సిపిఎం నాయకుడు దువ్వా శేష బాబ్జి
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు వైసిపి, టిడిపి, జనసేన ప్రత్యేక హోదా కావాలని పేరుకు మాత్రమే మాట్లాడుతున్నాయని సిపిఎం నాయకుడు దువ్వా శేషబాబ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రక్క ప్రత్యేక హోదా కావాలంటూనే ప్రత్యేక హోదా ఇవ్వబోనని కరాకండిగా చెప్పిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ఏ విధంగా కలిసి ప్రయాణిస్తాయని ప్రశ్నించారు. మూడు ప్రధాన పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని శేషబాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో రాష్ట్రంలోని పార్టీలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు.
విభజన సక్రమంగా జరగలేదు
టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి
రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పార్లమెంట్‌ తలుపులు మూసి విభజన చట్టం చేశారన్నారు. విభజనకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా దెబ్బతిని పోయిందన్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై మాట్లాడి పదేళ్లు కావాలని చెప్పారని అయితే ఎన్నాళ్ళైనా ఒక్క హామీ కూడా అమలు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రావులపల్లి రవీంద్ర, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్‌, కాకినాడ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి వెంకటేశ్వరరావు, సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఐఎన్‌టియుసి రాజు, సిపిఐ నాయకులు కొమ్మతి శ్రీనివాస్‌, ఎఐవైఎఫ్‌ నాయకులు పిఎస్‌ నారాయణ, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులడు గాంధీ రాజు, పాల్గొన్నారు.